close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి!

పదేళ్లకిందటి పాట ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’, రెండేళ్లకిందటొచ్చిన ‘బొమ్మల్లే ఉన్నదిరా పోరీ’, గతేడాది అదరగొట్టిన ‘దిమాక్‌ ఖరాబ్‌’, ఈ ఏడాది సంచలనం సృష్టించిన ‘రాములో రాములా’... వీటి మధ్య ఉన్న సామ్యం, సంబంధం ఏమిటీ...? సామ్యం అందరికీ తెలిసిందే... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతని ఊపేసిన పాటలివి. ఇక సంబంధం అంటారా... అవన్నీ కాసర్ల శ్యామ్‌ రాసినవి! తెలుగు పాటలమ్మ తోటకి కొత్త మాలిగా వచ్చి మత్తెక్కించే గీతాలు పూయిస్తున్న ఈ యువ కలం వెనకున్న కథ... అతని మాటల్లోనే...

మార్చి 17... కరోనా మనదేశంపైన అప్పటికింకా తన పంజా విప్పలేదు. ఆ రోజు ఉదయాన్నే హైదరాబాద్‌ నుంచి బయల్దేరి చెన్నై చేరుకున్నాం. విమానాశ్రయం నుంచి నేరుగా టి.నగర్‌లోని ఇళయరాజాగారి ఇంటికి వెళ్లాం. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ పాటల సిట్టింగ్‌ కోసం ఈ ప్రయాణం. రాజాగారి ముందు కూర్చుని పల్లెల్లో పిల్లలు పాడుకునే జాజిరి గీతాల శైలిలో ఓ పాట రాశాను. నేను ఆ పాటని పాడి వినిపిస్తున్నప్పుడే రాజాగారు నవ్వి ‘నీకు పాడటం కూడా వచ్చా! సరే ట్రాక్‌లో నువ్వే పాడు!’ అని నా చేతే పాడించారు. ఇళయరాజా ముందు గీత రచయితగా కూర్చోవడం, నా పాట ఓకే కావడం, దాన్ని నేనే పాడటం... ఇవన్నీ మనసుని దూదిపింజలా చేస్తున్నాయి కానీ గుండెలోని మరోమూల నుంచి సన్నగా కన్నీటి తడి కూడా మొదలైంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ తడి పెరిగి ‘దూదిపింజ మనసు’ని బరువుగా మార్చింది. ఆ కన్నీటి తడికి కారణం ఆ రోజు చెన్నైలో నేనున్న ఆ ప్రాంతం... దానితో ముడిపడ్డ మా నాన్న జ్ఞాపకం. ఈ టి.నగర్‌లోనే ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ దేదీప్యమానంగా వెలిగింది. ఆ వెలుగుని చూసి ఇక్కడికొచ్చిపడి తన ఆశల్ని మసిచేసుకున్న ఎంతోమంది రంగస్థల నటుల్లో మా నాన్న మధుసూదనరావూ ఒకరు. ఇక్కడే ఓ గదిని అద్దెకి తీసుకుని తినీతినకా సినిమా అవకాశాల కోసం తిరిగినవాడాయన. నాన్న అలా ఓడిపోయి వెను   తిరిగిన అదే ప్రాంతానికి ఇప్పుడు కాస్తోకూస్తో జనాదరణ సాధించిన పాటల రచయితగా నేను వెళ్లడం... నన్ను ఉద్వేగానికి లోను చేస్తోంది. ఆరోజు టి.నగర్‌, ఉస్మాన్‌ రోడ్డు, పానగల్‌ పార్కు... నాన్న మాటల్లో ఒకప్పుడు వినిపించే పేర్లన్నీ గుర్తుచేసుకుంటూ ఆ ప్రాంతంలో నడవడం మొదలుపెట్టాను. అలా నడుస్తూ ఆయన వేలుపట్టుకుని నేను ఇప్పటిదాకా నడిచిన నా పాటల ప్రయాణాన్ని నెమరేసుకున్నాను...

నా దశని మార్చారు...
మాది హన్మకొండ. రంగస్థల నాటకాలకి పెట్టని కోట అది. అప్పట్లో ప్రఖ్యాత జానపద గాయకులు వరంగల్‌ శంకరన్న, సారంగపాణీలు ప్రతి బడికీ వచ్చి పిల్లలతో నాటకాలు వేయించేవారు. ఆరోతరగతిలో ఉన్నప్పుడు వాళ్ల కంట్లోపడ్డాను. నాకు ‘మంత్రాల ముత్తిగాడు... తంత్రాల సత్తిగాడు’ అనే పాటనీ, దాని డ్యాన్సునీ నేర్పిస్తే మహారాజులా పెట్టుడు మీసం మెలేసి డ్యాన్సులు చేశాను. ఆ నటనకి నాకు జిల్లాలోనే ఫస్ట్‌ ప్రైజు వచ్చింది. ‘ఎవరీ పిలగాడు’ అని తెలియనివాళ్లు అడిగితే ‘కాసర్ల మధుసూదనరావు వాళ్లబ్బాయి!’ అని చెబుతుండేవారు అందరూ. అప్పుడే నాకు అర్థమైంది... నాన్నకి అక్కడున్న గౌరవం ఏమిటో. చిన్నప్పుడే రంగస్థల నాటకాల్లో పేరుతెచ్చుకున్న నాన్న సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లారు. అప్పటికే నీటి సరఫరా శాఖలో ఉద్యోగిగా ఉన్న ఆయన లాంగ్‌ లీవు పెట్టిమరీ మద్రాసులో మకాంపెట్టారు. నెలకోసారి మాత్రమే ఇంటికొచ్చేవారు. వచ్చినప్పుడల్లా వరంగల్‌ థియేటర్‌లలో తాను నటించిన సినిమాలని  చూపేవారు. అన్నీ చిన్న చిన్న పాత్రలే. ‘చలిచీమలు’, ‘రోజులు మారాయి...’ ఇలా 26 సినిమాల్లో కనిపించినట్లు చెబుతారు. మొత్తానికి సినిమాల్లో ఆయన ఆశించినంత స్థాయికి వెళ్లలేకపోయారు. ఇంట్లో మేం ముగ్గురం పిల్లలం... అన్నయ్యా, నేనూ, మా చెల్లి. ఉద్యోగంలో ‘లాంగ్‌ లీవ్‌’ కారణంగా నాన్నకి సగం జీతమే వచ్చేది. ఆ సగం జీతంతో ఇటు మా కడుపులు నిండటం, అటు మద్రాసులో నాన్న సినిమా ప్రయత్నాలు సాగడం కష్టమైంది. ఒకదశలో నాన్న ఉద్యోగం పోయే ప్రమాదమూ వచ్చింది. అదే జరిగితే పిల్లలం మాకు భవిష్యత్తు ఉండదనుకున్నారేమో... సినిమాలకి శాశ్వతంగా స్వస్తి పలికి వచ్చేశారు. మా కోసం ఆ నిర్ణయం తీసుకోవడం వెనక కళాకారుడిగా ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటారో ఇప్పుడు అర్థమవుతోంది! నేను మెల్లగా వరంగల్‌ శంకరన్న, సారంగపాణీల శిష్యుణ్ణయ్యాను. చుట్టుపక్కలవాళ్లందరూ ‘మీకు తగ్గ వారసుడే వచ్చాడు!’ అనేవారు నన్ను చూపించి. మెల్లగా నాన్నతోపాటూ నాటకాల్లో నటించడం మొదలుపెట్టాను. పదో తరగతయ్యాక నేరుగా సినిమా యాక్టర్‌ని అయిపోదామని కలలు కనడం ప్రారంభించాను. అప్పుడే నాన్న నా జీవిత గమనాన్ని మార్చే మాట చెప్పారు... ‘సినిమా రంగంలో నటులుగా నిలబడాలంటే అద్భుతమైన నటనా సామర్థ్యం ఉండాలి లేదా మనకి గట్టి నేపథ్యమన్నా కావాలి. అవి రెండూ మనకు లేవు. సినిమాల్లో మనలాంటివాళ్లకున్న ఒకే అవకాశం పాటలూ, సంగీతం ద్వారా వెళ్లడమే. అది కూడా నువ్వు పీజీ చేశాకే...!’ అన్నారు. అంతేకాదు నా దృష్టిని అప్పట్నుంచీ సాహిత్యంవైపు మళ్ళించారు. తెలుగులోని గొప్ప కవితా సంకలనాలన్నీ నా చేత చదివించారు. కాళోజీ, అలిసెట్టి ప్రభాకర్‌లాంటివాళ్ల దగ్గరకు నన్ను తీసుకెళ్లారు! అలాంటి వాతావరణంలో ఉంటే... కలం కవితలు రాయకుండా ఉంటుందా? ఇంటర్‌ చదివేటప్పటికే నాటక సమాజాల కోసం పాటలు రాయడం ప్రారంభించాను. అప్పట్లో అక్షరాస్యత కార్యక్రమాల కోసం జానపద బృందాల్లో పాటలు పాడేవాళ్లు కావాలంటే నేను వెళ్దామనుకున్నాను. నాన్న వద్దంటారని తెలిసి... ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి ఓ జానపద బృందంలో చేరిపోయాను. దాదాపు మూడు నెలలపాటు వరంగల్‌ జిల్లాలోని పల్లెపల్లెకీ వెళ్లి పాటలు పాడాను, అప్పటికప్పుడు గేయనాటికలు రాసి నటించాను. ఆ అనుభవమే నాకు తెలుగు నుడికారంలోని మట్టిపరిమళాన్ని పరిచయం చేసింది. పలుకుబడులూ, సామెతల్ని నా పాటల్లో అందంగా చొప్పించడం అప్పటి నుంచే మొదలైంది.

మొదటి పాట...
డిగ్రీలోకి వెళ్లడానికి ముందే సినిమా గేయరచయితగా మారాలని మనసు తహతహ లాడినా నాన్న చెప్పినట్టు పీజీ దాకా ఆగాను. అది కాగానే హైదరాబాద్‌ బస్సెక్కాను. మొదట్లో కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటు జానపద గీతాలు తయారుచేసే క్యాసెట్టు కంపెనీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. తెలుగు విశ్వవిద్యాలయంలో జానపదాలపైన ఎం.ఎ., ఎంఫిల్‌ కోర్సులో చేరడంతో హాస్టల్‌ సమస్య తప్పింది. యూనివర్సిటీ పరిచయాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ప్రచార గీతాలు రాయడంతోపాటూ నాటకాలూ వేసేవాణ్ణి. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలకీ ప్రచార గీతాలు రాసివ్వడం మొదలుపెట్టాను. అప్పట్లో ప్రతి క్యాసెట్టుకీ లక్ష రూపాయలు చేతికొచ్చేవి. దాంతో డబ్బుకి ఢోకాలేకుండా పోయింది. వీటితోనే కాలంగడుపుతున్న నన్ను మళ్లీ నాన్నే నిద్రలేపారు. ‘నువ్వు హైదరాబాదుకి ఏ లక్ష్యంతో వెళ్లావు... చేస్తున్నదేమిటీ?’ అని నిలదీశారు. దాంతో మళ్లీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. రెండేళ్ల తర్వాత నా స్నేహితుడి ద్వారా ‘చంటిగాడు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఆ సినిమా దర్శకురాలు జయ ఓ జానపద గీతం రాయమన్నారు. రాసిచ్చాను కానీ... తీరా సిట్యుయేషన్‌ మారిపోవడం వల్ల ఆ పాట తీసేయడంతో ఉసూరుమనిపించింది. కొద్దిరోజుల తర్వాత జయ మళ్లీ ఫోన్‌ చేశారు. ‘హీరో ఇంట్రడక్షన్‌ కోసం ఓ పెద్ద రచయిత పాట రాశారు కానీ అది నాకు నచ్చలేదు. ఆయన్ని ఇంకో వెర్షన్‌ అడిగే సమయం లేదు. నువ్వు రాసివ్వగలవా?’ అన్నారు. ట్యూన్‌ విని అప్పటికప్పుడే రాసిస్తే ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పారు. ‘కొక్కొరొకో...’ అనే ఆ పాటని శంకర్‌ మహదేవన్‌ పాడారు. ఆయనకి నేను వీరాభిమానిని! నా పేరుతో వచ్చిన తొలి పాటని నా అభిమాన గాయకుడే పాడటంతో నా ఆనందానికి అవధుల్లేవు.

‘నీలపురి గాజుల...’
అప్పట్లో తెలుగు విశ్వవిద్యాలయంలో నేను వీధినాటక బృందం ఒకటి నడుపుతుండేవాణ్ని. కృష్ణవంశీ ‘మహాత్మా’ సినిమాలో ‘ఇందిరమ్మ ఇంటిపేరు...’ పాటలో కనిపించేందుకు ఓ వీధినాటక బృందం కావాలనుకున్నారు. ఎవరో మా గురించి చెబితే రమ్మన్నారు. చిత్రీకరణప్పుడు రాత్రుల్లో సరదాగా నేను రాసిన ‘నీలపురి గాజుల...’ పాట పాడుకునేవాళ్లం. అది కృష్ణవంశీకి నచ్చి ఆ పాటని సినిమాలో వాడదామన్నారు. నా చేతే పాడించారు కూడా! ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్ర పేరు మొదట కస్తూరి అనే పెట్టారు. కానీ నీలపురి గాజుల పాటలో ‘కృష్ణవేణీ’ అని వస్తుంది కాబట్టి ఆ పేరే ఖరారు చేశారు... అప్పటికి సగం సినిమా షూటింగ్‌ పూర్తయినా సరే! ఆ పాట ఆయనకి అంతగా నచ్చింది. ఆ తర్వాత దర్శకుడు మారుతి తొలి సినిమా ‘ఈరోజుల్లో’ని ‘ట్రింగ్‌ ట్రింగ్‌’, ‘బస్టాప్‌’ చిత్రంలోని ‘కలలకే కనులొచ్చినా...’ పాటలు కాలేజీ కుర్రాళ్లకి బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఓసారి సంగీత దర్శకుడు సాయి కార్తిక్‌, రామ్‌గోపాల్‌ వర్మ ‘రౌడీ’ సినిమా అవకాశం ఉంది రమ్మని పిలిచాడు. నేను వెళ్లగానే వర్మ ‘నీకు పెళ్లైందా?’ అని అడిగారు. ‘ప్రేమ పెళ్లండీ...’ అని చెప్పాను. ‘అయితే నీ భార్యని నువ్వు ఎక్కువే ప్రేమిస్తావు. సరే... నీ భార్య చచ్చిపోయిందనుకుని ఆమె కోసం ఓ పాట రాయి’ అన్నారు. ఆ మాటకి నా కళ్లలో జివ్వున నీళ్లు తిరిగాయి. నా భార్య రాధిక అప్పుడు నిండు గర్భిణి. అసలే రేపోమాపో కాన్పు... ఎలా ఉంటుందో ఏమోనని ఆందోళనలో ఉండగా వర్మ అలా అనడాన్ని తట్టుకోలేకపోయాను. ఏడుస్తూనే ఇంటికెళ్లాను. అయినా సరే నేను ఓ ప్రొఫెషనల్‌ రైటర్‌నని నిరూపించాలనుకున్నాను. అర్ధగంటలో ‘నీ మీద ఒట్టు...’ పాట రాసిచ్చాను! ఆ వేగం ఆయనకి నచ్చినట్టుంది. ఇంకో పాట... మరో పాట అంటూ అన్ని పాటలూ నాచేతే రాయించారు. వర్మని మెప్పించడం... అదీ సింగిల్‌ కార్డు సాధించడం ఇండస్ట్రీలో నాకు మంచి గుర్తింపునిచ్చింది. నా కెరీర్‌లో ‘నీలపురి గాజుల...’ పాట ఓ మంచి మలుపునిస్తే మణిశర్మ సంగీత దర్శకత్వంలో ‘లై’సినిమాలోని ‘బొమ్మోలె...’ మరో పెద్ద మలుపునిచ్చింది. దాని తర్వాత నేను రాసినవన్నీ హిట్టు పాటలే. పూరీ జగన్నాథ్‌గారి ఇస్మార్ట్‌ శంకర్‌లోని ‘దిమాక్‌ ఖరాబ్‌’, ‘బోనాలు’ పాటలు నాస్థాయిని పెంచాయి. ఇక ‘రాములో రాములా...’ నన్ను ప్రపంచంలోని తెలుగువారందరి చెంతకు చేర్చింది. ఓ రోజు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పిలిచి ‘నీ పాట నన్ను నిజంగానే ‘ఆగం’ చేస్తోందిరా! నా మనవళ్లందరూ నా పాట(సామజవరగమనా!)ని కాదని నీదే వింటున్నారు. 2020... నీ నామ సంవత్సరం అనిపిస్తోంది. దున్నెయ్‌ ఇక...’ అన్నారు. అంతకంటే పెద్ద ఆశీర్వచనం ఏం ఉంటుంది?!

ఆ సంతృప్తితోనేనా?
ఇండస్ట్రీలో నా విజయాలకి నాన్న ఎంత సంతోషించారో... ఎంత సంబరపడ్డారో! ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించనీయకుండానే ఆయన్ని పక్షవాతం కబళించింది. హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఆయన్ని నేనే చూసుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడే ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ కోసం పల్లవి రాయమన్నారు. రాశాను. ఇంతలో నాన్న పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. మళ్లీ నేను మనిషిలా మారడానికి ఇరవై రోజులు పట్టింది. మన ఇండస్ట్రీలో మామూలుగా ఎవరికోసమూ ఏ పాటా ఆగదు. కానీ అనిల్‌ రావిపూడి నా కోసం ఆ పాటని ఆపాడు. ఆ రకంగా ఆ పల్లవికీ, చరణానికీ మధ్య నాన్న ప్రాణం పోయింది!

కృష్ణవంశీ తీస్తున్న ‘రంగమార్తాండ’ ఓ రంగస్థల కళాకారుడి కథ! నాన్న కూడా రంగస్థల నటుడు కావడం... ఒకప్పుడు ఆయన అవకాశాల కోసం వెతికిన ప్రాంతంలోనే నేను ఇప్పుడు మరో రంగస్థల నటుడికి సంబంధించిన కథకి పాటలు రాయడం... ఇవన్నీ యాదృచ్ఛికమేనని తెలిసినా మనసు నమ్మనంటోంది. దీని వెనక ఇంకేదో అంతస్సూత్రం ఉందని నమ్మమంటోంది. ఇలాంటి నమ్మకాలే ఒక్కోసారి జీవితానిక్కావాల్సిన స్ఫూర్తినిస్తాయనిపిస్తోంది..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.