
అమెజాన్ అడవుల్లో ఆయాసపడుతూ నడిచినా... ఆస్ట్రేలియా అందాల నడుమ ఆనందంగా విహరించినా, అంతర్యుద్ధంతో అల్లాడే ప్రజలను ఆప్యాయంగా పలకరించినా... అది అతడికే చెల్లింది! అందుకే ప్రపంచం నలుమూలలా సందర్శించాలన్న తపనతో... ఇంటినీ, ఉద్యోగాన్నీ చూసుకుంటూనే 17 ఏళ్లలో 186 దేశాలు పర్యటించాడు!
ఈ అరుదైన ఘనత సాధించింది మన తెలుగోడే... వైజాగ్‌కు చెందిన రవి ప్రభు. తన గురించి చెబుతున్నాడిలా...
నేను పుట్టింది ఒడిశాలో అయినా పెరిగిందీ, చదివిందీ మాత్రం అంతా వైజాగ్‌లోనే. నాన్న ఎస్బీఐలో పనిచేసేవారు, అమ్మ కాలేజీ లెక్చరర్. నాకో చెల్లి కూడా ఉంది. చిన్నప్పుడంతా సగటు మధ్యతరగతి జీవితాలే. ఏడాదికోసారి కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లేందుకు నాన్న వాళ్ల ఆఫీసులో ఎల్‌టీఏ సదుపాయం ఉండేది. దాన్ని ఉపయోగించుకుని మా నాన్న మాకు ఎన్నో అనుభవాలు రుచి చూపించారు. కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. దాదాపు ఇండియా అంతా చిన్నప్పుడే చూసేశా. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారిగా భూటాన్ వెళ్లాను. అదే నేను సందర్శించిన మొదటి దేశం. అప్పుడు కలిగిన సంతోషమైతే మాటల్లో చెప్పలేను. ప్రపంచం ఇంత విశాలమైనదా అనిపించింది. అప్పటినుంచే ట్రావెలింగ్ మీద ఇష్టం ఏర్పడింది. ఎప్పటికైనా ప్రపంచంలోని మొత్తం అన్ని దేశాలూ చూసేయాలి అని ఫిక్సయ్యా. వైజాగ్‌లో డిగ్రీ, హైదరాబాద్‌లో పీజీ చదువుకున్న తర్వాత ఆపైచదువుల కోసం బ్యాంకులో లోన్ తీసుకుని అమెరికా ఫ్లైటెక్కేశా. అక్కడ ఉన్నప్పుడే నా పర్యటనలు మొదలయ్యాయి.
అమెరికాలో చదువుకుంటున్న సమయంలో చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బులు దాచుకునేవాడిని. అలా దాచిన డబ్బుతో తొలిసారిగా నెదర్లాండ్స్ ఒక్కడినే సొంతంగా వెళ్లాను. అక్కడ కొన్నిరోజులు ఒంటరిగా పర్యటించడం చెప్పలేని అనుభూతి. ఆ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్ అందాల గురించి కొత్తగా చెప్పేదేముంది? కనుచూపుమేర రంగులు పరిచినట్లుండే తులిప్ తోటల్లో తిరుగుతుంటే ఎంత బాగుందో... ఇక ఆ తర్వాత నుంచీ తిరిగి చూసుకున్నది లేదు. ఏటికేడూ నేను పర్యటించిన దేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక సంవత్సరంలో అయితే ఏకంగా 18 దేశాలు చూసొచ్చాను! అలా టూర్లు వేస్తూనే రెండు ఎంబీఏలు, ఒక మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం వివిధ సంస్థలకు మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. అమ్మానాన్నలు చూసిన అమ్మాయినే చేసుకున్నా, తన పేరు స్వాతి. ఇక్కడే హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం చేస్తోంది. మాకో పాప, పేరు అనుష్క. ఎన్ని బాధ్యతలు పెరిగినా, ఎంత ఒత్తిడి ఉన్నా, ట్రావెలింగ్‌పై నా ఆసక్తిని మాత్రం అలాగే కొనసాగించా. మరి నేను ఇన్ని చూసేస్తుంటే ఇంట్లో వాళ్లు తామూ వస్తాం అంటారు కదా! అందుకే వాళ్లు నాతో వచ్చినప్పుడు అత్యంత సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాలకు మాత్రమే తీసుకెళ్తా. ఇబ్బందులు ఉంటాయనుకునే పర్యటనలు ఒక్కడినే చేస్తా. అలా ఇప్పటి వరకూ 186 దేశాలు చూసొచ్చాను. ఒకే దేశానికి మళ్లీ మళ్లీ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం 12 పాస్‌పోర్టులు ఇప్పటికే నిండిపోయాయి. అందరూ నాకు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని దేశాలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తిరగ్గలిగాను అనుకుంటారు. కానీ నేను 110 దేశాలు ఇండియన్ పాస్‌పోర్ట్‌తోనే ట్రావెల్ చేశాను. ఆ తర్వాతే అమెరికన్ పాస్‌పోర్ట్ వచ్చింది. ప్రస్తుతం వర్జీనియాలో ఉంటున్నాను.
ఎన్ని అనుభవాలో...!
ఇన్ని దేశాల్లో నాకు ఎదురైన అనుభవాలూ, నేను కలిసిన మనుషుల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ప్రేమగా ఆదరించిన వారూ ఉన్నారు, మోసం చేసిన వారూ ఉన్నారు, కొందరైతే కిడ్నాప్ చేసి డబ్బూ, విలువైన వస్తువులు లాక్కోవాలని కూడా చూశారు! కొన్నిసార్లు ఆహారం దొరక్క, మరికొన్నిసార్లు ఫ్లైట్ మిస్సై ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బంది పడ్డ సంఘటనలూ ఉన్నాయి. అయితే అవన్నీ ఆ పర్యటనలో భాగంగానే భావించాను తప్ప, ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవ్వలేదు. అందరూ వెళ్లాలనుకునే అందమైన దేశాలే కాకుండా ప్రమాదకరమైన ప్రాంతాలు కూడా చాలా చూశాను. న్యూజిలాండ్‌కు దగ్గర్లో ‘వనౌటు’ అనే దేశంలో ‘మౌంట్ యాసుర్’ అనే ఓ అగ్నిపర్వతం ఉంది. దాని దగ్గరకు ప్రైవేటు జెట్‌లో వెళ్లాలి. పర్వతం కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్తే... లావా ఉప్పొంగే చోటును కేవలం రెండు అడుగుల దూరం నుంచి చూడొచ్చు. విపరీతమైన వేడిగా ఉంటుంది... అగ్నికీలలు, దట్టమైన పొగ ఎగసిపడుతుంటే చూడ్డానికే భయమేస్తుంది. ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు కలిగిన థ్రిల్ మాత్రం జీవితంలో మర్చిపోలేను. అలాగే బ్రెజిల్లో ఉండే మురికివాడలను ‘ఫవేలా’ అంటారు. మన దేశంలో ఎంత పేదలైనా కొత్తవాళ్లు కనిపిస్తే ఆప్యాయంగా పలకరించి ఉన్నదాంట్లోనే ఆతిథ్యమిస్తారు. కానీ అక్కడలా కాదు, నేరస్థులు నిండి ఉండే ఆ ప్రాంతాలకు వెళ్లడానికి పోలీసులు కూడా భయపడతారు. అలాంటి చోట్లా తిరిగాను. జార్జియాలో సంరక్షణ కేంద్రంలో ఉండే నాలుగు సింహాలతో గంటసేపు వాకింగ్ చేశా. ఏదో కుక్కపిల్లల్ని తీసుకెళ్లినట్టే అనిపించింది. అవి కూడా పర్యటకులకు భలే సహకరిస్తాయి. సౌత్ సూడాన్‌లో పరిస్థితులు అంతగా బాలేనప్పుడే వెళ్లి రెండు రోజులు ఉండి వచ్చా. ఏ దేశాల్లో అయినా దౌత్యకార్యాలయాల ఫొటోలు తీయకూడదు. ఆ విషయం తెలియక ఓసారి ఇజ్రాయిల్‌లో ఎంబసీ ముందు నిలబడి ఫొటో తీసుకున్నా. ఇంకేముంది... వెంటనే సెక్యూరిటీ సిబ్బంది చుట్టుముట్టారు. ‘ఎవరు నువ్వు... ఎందుకు ఫొటోలు తీశావు’ అని మూడు గంటలు ప్రశ్నించి, నా మీద నమ్మకం కుదిరాక గానీ విడిచిపెట్టలేదు! బతుకుజీవుడా అంటూ బయటపడ్డా. ఇప్పుడు తలుచుకుంటే మాత్రం నవ్వొస్తుంది. ఎన్ని నగరాలు చూసినా బ్రెజిల్‌లోని ‘రియో డి జెనొరియో’ అంత అందంగా ఇంకేదీ కనిపించలేదు. కానీ నన్నెవరైనా ‘జీవితంలో ఒకే ఒక్క చోటు చూడాలి, ఏదైతే బాగుంటుంది’ అని అడిగితే మాత్రం... గ్రీస్‌లోని ‘సాంటోరినీ’ ఐలాండ్‌కు వెళ్లమని చెబుతా, భూతలస్వర్గంలా ఉంటుందది! సింగపుర్, మలేషియా, ఫిజి... వంటి దేశాల్లో ఏళ్ల క్రితం కూలీలుగా వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన తెలుగువాళ్లు ఉన్నారు. వాళ్ల వారసులు చాలామందిని కలిశా. అయితే ఇన్ని చూసినా... భారత్ లాంటి దేశం మాత్రం ఎక్కడా కనపడలేదు. మన దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో మరెక్కడా లేదు. అందరూ ఇటాలియన్ క్విజీన్ గురించి చెబుతారు కానీ, జపనీస్ వంటకాలు కూడా చాలా బావుంటాయి. టర్కీ దేశపు వంటలైతే జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే! ఇలా దేశాలు తిరుగుతుండగానే మెల్లగా భాషలు నేర్చుకున్నా. తెలుగు, ఇంగ్లిష్ మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్ భాషలు మాట్లాడగలను.
ఓసారి నమీబియాలోని అటవీప్రాంతంలో ఒక్కడినే కారులో వెళ్తున్నా. హఠాత్తుగా ఓ జింక రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దాన్ని కాపాడే ప్రయత్నంలో నా కారు అదుపుతప్పి ఆరు పల్టీలు కొట్టింది! ఇక అంతా అయిపోయింది అనుకున్నా. కానీ నేను మాత్రం చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డా. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పర్యటనల పట్ల నా దృక్పథమే మారిపోయింది. వెళ్లిన ప్రతి దేశంలోనూ అక్కడి పేద ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నా. అవసరాన్నిబట్టీ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకూ విరాళంగా ఇస్తున్నా. ఇలా ఇప్పటికి 70 దేశాల్లో ఇచ్చా. పర్యటనలు మన మనసును ఆహ్లాదపరచడమే కాదు, ఎంతోమంది మనుషుల్నీ చేరువ చేస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నేను ఫోన్ చేస్తే స్పందించే స్నేహితులున్నారు. వాళ్లందరితో మాట్లాడుతుంటే నా ప్రపంచం చాలా పెద్దది అనిపిస్తుంటుంది. ఎయిర్‌పోర్టులో దిగాక స్టార్ హోటల్లో బస చేసే నేను... రెండోరోజు రోడ్డు పక్కన పడుకోవాల్సి రావొచ్చు. కానీ రెండింటికీ ఇప్పుడు పెద్ద తేడా ఏం అనిపించట్లేదు. జీవితాన్ని ఓ కొత్త కోణంలో చూస్తున్నా.
అమెరికా వచ్చి 20 ఏళ్లవుతోంది. పర్యటనలు మాత్రమే కాకుండా సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండే ఫ్రెండ్స్‌తో బైకింగ్, ట్రెక్కింగ్ వంటివీ చేస్తుంటాను. దానికి అనుగుణంగా ఉండేలాగానే నా ఆహారపు అలవాట్లుంటాయి. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. టూర్లో ఉన్నప్పుడు మాత్రం ఏది దొరికితే అదే తింటా. ఇప్పటివరకూ నా టూర్లకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైగానే ఖర్చయ్యింది. అందులో ప్రతిపైసా నా సంపాదనే. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది సాధ్యమైందంటే, కష్టపడితే ఎవరికైనా ఏదైనా సాధ్యమే! ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా చెప్పాలనే ఈమధ్యే సోషల్ మీడియా ఖాతాలు తెరిచి అందరికీ చేరువవుతున్నా. కరోనా కారణంగా ప్రస్తుతం నా టూర్లకు కొంచెం బ్రేక్ వచ్చింది. లాక్డౌన్లు ఎత్తేయగానే తుర్క్మ్నిస్థాన్లో వాలిపోవాలి. ట్రావెలింగ్ గురించి చివరిగా నేను చెప్పేదొక్కటే... ఓ కొత్త ప్రాంతానికి వెళ్లిన ప్రతిసారీ మనం కొత్తగా పుడతాం... మనిషిగా ఇంకో మెట్టెక్కుతాం!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్