close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బతుకు పాఠాలన్నీ... ఆ నలభై రోజుల్లోనే!

బతుకు పాఠాలన్నీ... ఆ నలభై రోజుల్లోనే!

బలిరెడ్డి పృథ్వీరాజ్‌ అనగానే ఓసారి ఆలోచించేవాళ్లకి కూడా ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అనగానే టక్కున ఆయన మొహం గుర్తొచ్చేస్తుంది. అసలు పేరు కంటే ‘బాయ్‌లింగ్‌ స్టార్‌ బబ్లూ’, ‘ఫ్యూచర్‌స్టార్‌ సిద్దప్ప’, ‘బత్తాయి బాబ్జీ’ లాంటి కొసరు పేర్లతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పుడెప్పుడో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ పరిశ్రమలో అడుగుపెట్టిన పృథ్వీ అప్పట్నుంచీ పడుతూ లేస్తూ పైకొస్తూ ఇప్పుడు రాకెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. ‘పేరుకి థర్టీ ఇయర్స్‌ అయినా నేను పరిశ్రమలోకి వచ్చి పాతికేళ్లే’ అంటున్న పృథ్వీ సినిమాల్లో నలుగురిలో ఒకడిగా ఉండే దశ నుంచి నలుగురూ తన గురించి మాట్లాడుకునే దాకా ఎలా వచ్చాడంటే...

మానాన్న బలిరెడ్డి సుబ్బారావు దాదాపు అరవై సినిమాల్లో నటించారనీ, మోహన్‌బాబు, సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి లాంటి చాలామంది సీనియర్‌ నటులకు ఆయన దగ్గరి మనిషన్న విషయం చాలా మందికి తెలీదు. అలాగని ఆయన సహాయంతోనే నేను సినిమాల్లోకి వచ్చానని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నేను సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్న విషయం మొదట నాన్నతో సహా ఇంటి దగ్గర ఎవరికీ తెలీదు మరి. అంతెందుకు, ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఈ రంగంలోకి వచ్చానుకానీ, అన్నీ కుదిరుంటే భారత్‌ జట్టు తరఫున క్రికెట్‌ ఆడినా ఆడుండేవాణ్ణి. ఎవరికీ తెలీని ఇలాంటి మలుపులు నా కథలో చాలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం మా సొంతూరు. మావయ్యలూ, పెద్దమ్మలూ, వాళ్ల పిల్లలంతా కలిసుండే ఉమ్మడి కుటుంబం మాది. పెద్ద కుటుంబం కాబట్టి మేం స్కూల్‌ ఎగ్గొట్టి ఎక్కడ తిరిగినా క్షణాల్లో విషయం ఇంట్లో తెలిసేది. దాంతో బెత్తం విరిగేది. క్రికెట్‌లో నేను మంచి బ్యాట్స్‌మన్‌ని. మా వయసు విభాగంలో పశ్చిమ గోదావరిలో అన్ని పోటీల్లో మా జట్టే ముందుండేది. దర్శకుడు కృష్ణవంశీ మా వీధి చివరే ఉండేవాడు. అతడు డిగ్రీ కోసం వేరే వూరెళ్లి పోవడంతో కొన్నాళ్లపాటు మా మధ్య సంబంధాలు దూరమయ్యాయి.

అమ్మ పోరాటం...
మా నాన్న ఉద్యోగ రీత్యా రైల్వే పార్సిల్‌ మాస్టర్‌ అయినా నటనంటే ఆయనకు చాలా ఇష్టం. నాన్నా, శోభన్‌బాబు, సత్యనారాయణగారు లాంటి వాళ్లంతా ఒకే నాటక సమాఖ్యలో నటించేవారు. ఓసారి ఎన్టీ రామారావుగారు నాన్న నటించిన ఓ నాటకం చూసి, ఆయన్ని పిలిచి ‘మీ నటన మాకు బాగా నచ్చింది. మేమొక సినిమా తీస్తున్నాం. అందులో మీరు కర్ణుడి వేషం వేస్తున్నారు’ అన్నారు. అలా ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో నాన్న సినిమాల్లోకి అడుగుపెట్టారు. తరవాత ‘రణభేరి’, ‘పేదరాసి పెద్దమ్మ కథ’, ‘ధనమా దైవమా’ లాంటి చాలా సినిమాల్లో నటించారు. సినిమా మాయలో పడి ఆయన చాలాకాలం పాటు చెన్నైలో ఉండిపోయారు. కొన్నాళ్లకు ఏవో మాటపట్టింపులు వచ్చి నాన్న మాకు దూరంగా అక్కడే స్థిరపడ్డారు. పెద్దదిక్కు లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి ఆస్తి కూడా కరిగిపోయింది. దాంతో అమ్మే చిన్న ఉద్యోగం చేస్తూ నన్ను చదివించేది. డిగ్రీ పూర్తయ్యాక స్పోర్ట్స్‌ కోటాలో సీటు రావడంతో ఎంఏ చేయడానికి ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లా. సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచనకు పునాది పడింది అక్కడే.

చెప్పాపెట్టకుండా చెన్నైకి...
యూనివర్సిటీలో తరగతులు పూర్తవగానే సరదాగా బీచ్‌కి వెళ్లేవాళ్లం. అలా తీరంలో ఓసారి ‘అభిలాష’ షూటింగ్‌ జరుగుతుంటే చిరంజీవిగారిని చూశా. ఆ తరవాత కూడా అడపాదడపా ఏదో ఒక షూటింగ్‌ కంట పడుతూనే ఉండేది. ఆ వాతావరణం చూసినప్పుడల్లా ఆ రంగంపైన తెలీకుండానే ఇష్టం పెరుగుతూ వచ్చేది. కాలేజీలో నేను సాంస్కృతిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వార్షికోత్సవ వేడుక నిర్వహించారు. అంతకుముందు సంవత్సరం అదే వేడుకకి మా సీనియర్లు రావు గోపాలరావుగారిని తీసుకొచ్చారు. నేనెవర్ని తేవాలా అని ఆలోచిస్తున్నప్పుడు నటుడు ప్రభాకర్‌ రెడ్డి గుర్తొచ్చారు. నాన్న ద్వారా ప్రభాకర్‌ రెడ్డిగారితో నాకు కాస్త పరిచయం ఉండేది. ఆ చనువుతోనే వెళ్లి ఆయన్ని వేడుకకు అతిథిగా రమ్మని అడిగా. ఆయన వచ్చి వెళ్తూ వెళ్తూ, ‘నీ ఎత్తూ, ఫీచర్స్‌, బాడీ లాంగ్వేజ్‌ సినిమాలకు బాగా సరిపోతాయి. పీజీ పూర్తయ్యాక చెన్నై వచ్చేయ్‌’ అన్నారు. ఆ మాటలు నాపైన ఎంత ప్రభావం చూపాయంటే, నిజంగానే చదువయ్యాక నేరుగా చెన్నై రైలెక్కేశా. ప్రభాకర్‌ రెడ్డిగారిని కలిస్తే, ‘సందర్భాన్ని బట్టి లక్ష చెప్తాం, ఆ మాటల్ని పట్టుకొని వచ్చేయడమేనా. ఇంత అమాయకుడివి ఎలా పైకొస్తావయ్యా’ అంటూ చిన్న క్లాస్‌ తీసుకున్నారు. వెంటనే తిరిగి పంపించలేక, ఏదో ఒకటి చూద్దాంలే అని అక్కడే ఉండమన్నారు.

హోటల్‌లో ఉద్యోగం
చెన్నైకి వచ్చి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న విషయం చెబుతూ మా అమ్మకి ఉత్తరం రాశా. హాయిగా ఉద్యోగం చేసుకోక ఎందుకా కష్టాలంటూ అమ్మ తిట్టింది. నేను మాట వినకపోవడంతో నేరుగా చెన్నై వచ్చి ప్రభాకర్‌రెడ్డిగారిని కలిసింది. మా ఇద్దరినీ బాధపెట్టడం ఇష్టం లేక, నాకు అక్కడే ఓ ఉద్యోగం చూస్తాననీ, తరవాత సినిమాల గురించి ఆలోచిద్దామనీ నాకూ అమ్మకీ సర్దిచెప్పి ఆమెని పంపించారు. చెప్పినట్లుగానే ఓ హోటల్‌లో రిసెప్షన్‌ దగ్గర ఫ్రంట్‌లైన్‌ మేనేజర్‌గా నాకు ఉద్యోగం ఇప్పించారు. అలా రోజులైతే గడుస్తూ వచ్చాయి కానీ సినిమాల్లో పనిచేయాలన్న కోరిక విషయంలో మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. చివరికి ఓ రోజు హోటల్‌లో ఉద్యోగం మానేసి సిటీ కేబుల్‌లో చేరా. అక్కడైతే సినిమా దర్శకుల్ని ఇంటర్వ్యూలు చేసే అవకాశం ఉండేది. మామూలుగా వెళ్తే ఎవరూ పట్టించుకోరనీ, ఇంటర్వ్యూ కోసం వెళ్తే కాస్త గౌరవంగా చూస్తారనీ నా ఆశ. అనుకున్నట్లే అందరూ సానుకూలంగానే స్పందించేవాళ్లు కానీ పని మాత్రం జరగలేదు. ఓసారి ఈవీవీ సత్యనారాయణగారు ఏదో సినిమాకి క్యారెక్టర్‌ ఆర్టిస్టుల కోసం ఆడిషన్లు చేస్తున్నారని తెలిసి ఆయన దగ్గరకి వెళ్లా. నేను యూనివర్సిటీలో చదువుకోవడం, హోటల్‌లో పనిచేయడం వల్ల ఎప్పుడూ ఇన్‌షర్ట్‌ చేసుకొని హుందాగా కనిపించడం అలవాటైంది. నన్ను చూడగానే సినిమాలో బ్యాంకు మేనేజర్‌ పాత్రకి నేనైతే సరిపోతానని ఈవీవీగారికి అనిపించింది. దాంతో రావు గోపాలరావుగారు సరేనంటే నన్ను తీసుకుంటామని చెప్పారు.

గోపాలరావుగారితో నలభై రోజులు
ఏవీఎం స్టూడియోలో రావు గోపాలరావుగారు నన్ను చూస్తూనే ‘ఈ కుర్రాడేనా నా మేనల్లుడు’ అన్నారు. దాంతో సినిమాలో పాత్రకి నా గెటప్‌ సరిగ్గా సరిపోయిందని అర్థమైంది. అలా ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. స్టూడియోలో తొలిసారి రాజేంద్రప్రసాద్‌గారిని చూసి చాలా ఆనందమేసింది. ఇంకాస్త ముందుకెళ్తే మరేవో షూటింగులు జరుగుతూ కనిపించాయి. అక్కడ నటులందర్నీ చూస్తూ నేనొచ్చిన పని మరచిపోయా. ఈలోగా మేనేజరు వెతుక్కుంటూ వచ్చి మరుసటి రోజు సాయంత్రం విశాఖపట్నం బయల్దేరి రమ్మన్నారు. అక్కడ దిగగానే రావు గోపాలరావుగారి దగ్గరికెళ్లి నాకు వైజాగ్‌లో ఎవరూ తెలీదనీ, ఉండటానికి చోటు లేదనీ చెప్పడంతో నన్ను ఆయనతో పాటు హోటల్‌కి తీసుకెళ్లారు. ఆయనకిచ్చిన సూట్‌ ముందు గదిలో నన్ను సర్దుకోమన్నారు. కాసేపయ్యాక నన్ను పిలిచి మాట్లాడి వివరాలన్నీ ఆరాతీశారు. నా వ్యవహారశైలి నచ్చడంతో మరుసటి రోజు ఆయన గదిలోనే పక్కనో చిన్న మంచం వేయించి అక్కడే ఉండమన్నారు. ‘ఇప్పుడు మనతో కలిసి నటించిన వాళ్లు మనకంటే వేగంగా పేరు తెచ్చుకోవచ్చు. అలాగని వాళ్లని చూసి అసూయ పడకూడదు. ఇప్పుడు నీకు అన్నం పెట్టే పరిశ్రమ భవిష్యత్తులో పంచభక్ష పరమాన్నాలు పెడుతుంది. అప్పటి వరకూ ఓపిగ్గా ఎదురుచూస్తేనే అనుకున్నది సాధించగలవు’ అంటూ ఆయన అనుభవాలన్నీ నాకు పాఠాల్లా చెప్పేవారు. అయనతో గడిపిన ఆ నలభై రోజులూ నాకు జీవితమంటే ఏంటో నేర్పాయి.

అప్పట్నుంచీ ఆ పేరే
‘ఆ ఒక్కటీ అడక్కు’ తరవాత అవకాశాలకు కొదవుండదు అనుకున్నా కానీ, అలా జరగలేదు. ఒక్కో సినిమా కోసం కోడైరెక్టర్లూ, ప్రొడక్షన్‌ మేనేజర్ల చుట్టూ పడిగాపులు పడాల్సొచ్చింది. చిన్నచిన్న అవకాశాలొచ్చినా అవి కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. మధ్యమధ్యలో సినిమాలు నాకు సరిపడవు అనిపించి ఇంటికెళ్లిపోయి, కొన్ని రోజులకు ఉండబట్టలేక మళ్లీ వచ్చేసేవాణ్ణి. ఆ సమయంలోనే మా అమ్మ చనిపోవడం నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేసింది. నేను పెద్ద నటుడినై తనని కారులో పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తే చూడాలన్న చిన్న కోరిక తనది. అది కూడా తీరకుండానే దూరమవడంతో తట్టుకోలేకపోయా. కొన్నాళ్లకు తేరుకొని మళ్లీ సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టా. కృష్ణవంశీ ‘సింధూరం’ సినిమా మొదలుపెడుతున్నాడని తెలిసి అవకాశం కోసం అతడిని కలిశా. అలా చివరి నిమిషంలో ఓ నక్సలైటు పాత్ర వచ్చింది. తరవాత ‘చంద్రలేఖ’, ‘ఇడియట్‌’, ‘సముద్రం’ లాంటి కొన్ని సినిమాల్లో నటించా కానీ సరైన బ్రేక్‌ రాలేదు. ‘ఖడ్గం’ సినిమా మొదలయ్యే సమయానికి కృష్ణవంశీతో ఉన్న చనువు కొద్దీ ‘నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, ఏదైనా మంచి పాత్ర పడేట్టు చూడొచ్చు కదా’ అనడిగా. ఏదైనా సీరియస్‌ పాత్ర ఇస్తాడనుకుంటే సినిమాలో డైలాగు చెప్పడం కూడా సరిగ్గా రాని ఓ నటుడి పాత్ర ఇచ్చారు. దానికి ఏం పేరొస్తుందని నేను సందేహిస్తుంటే, సినిమా అయిపోయాక ప్రేక్షకులు ఆ పాత్ర గురించే మాట్లాడుకుంటారని వంశీ ధైర్యం చెప్పాడు. అతడు చెప్పినట్లే ఆ సినిమాతో నా జీవితమే మారింది. అప్పట్నుంచీ ఇప్పటిదాకా ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అన్న పేరు నాకు స్థిరపడిపోయింది.

ప్రతి సినిమాతో పైపైకి
‘ఖడ్గం’ పుణ్యమా అని అవకాశాల కోసం ఏరోజూ ఎదురుచూడాల్సి రాలేదు. ‘పోకిరి’, ‘ఢీ’, ‘రెడీ’, ‘కిక్‌’, ‘దూకుడు’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’, ‘వూహలు గుసగుసలాడె’ లాంటి బోలెడన్ని హిట్‌ సినిమాల్లో పేరున్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఆపైన ‘లౌక్యం’లో ‘బాయ్‌లింగ్‌స్టార్‌ బబ్లు’ పాత్ర నా కెరీర్‌ని ఎన్నో మెట్లు పైకెక్కించింది. అందులో మొదట సినిమా సగం వరకే నా పాత్ర పరిమితమైనా, రషెస్‌లో మంచి స్పందన రావడంతో చివరిదాకా కొనసాగించారు. ఆ సినిమాతో స్టార్‌ కమెడియన్‌ అన్న ముద్రపడిపోయింది. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘డిక్టేటర్‌’, ‘సరైనోడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ‘బాబు బంగారం’, ‘సుప్రీమ్‌’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’... ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తూనే ఉంది. త్వరలో విడుదలవనున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాలో సలోని పక్కన హీరోగా నటించా. ‘కాటమరాయుడు’, ‘బాహుబలి 2’, ‘ఖైదీనెం 150’ లాంటి అన్ని పెద్ద సినిమాల్లోనూ నటిస్తున్నా. మా గోదారి భాషలో చెప్పాలంటే సినీపరిశ్రమలో నటులూ, దర్శకులంతా పులస చేపల్లాంటోళ్లు. గోదారికి కొత్త నీరు వచ్చినప్పుడు పులసలు వచ్చినట్టే సినిమాల్లోకీ ఎప్పటికప్పుడు ప్రతిభ ఉన్న కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. ఇప్పుడు నా టైం నడుస్తోంది. రేపు నా స్థానాన్ని భర్తీ చేయడానికీ మరొకరు వస్తారు. ఆ రోజు వచ్చినప్పుడు నా సీటుని సంతోషంగా ఖాళీ చేస్తా..!

- శరత్‌ కుమార్‌ బెహరా
ఫొటోలు: శివకృష్ణ

బాపుగారితో ఏడేళ్లు!

బాపుగారి దగ్గర ‘భాగవతం’ సీరియల్‌ కోసం ఏడేళ్లు నటించా. ఇంద్రుడి నుంచి దుర్యోధనుడి వరకూ అన్ని రకాల పాత్రలూ వేశా. ఈటీవీ, బాపుగారు ఇచ్చిన అవకాశం వల్ల మధ్యలో మూడేళ్లు నాకు సినిమాలు లేని లోటు తెలీకుండా బతికా.
* నాకో అబ్బాయి, అమ్మాయి. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. అబ్బాయి టెక్‌ మహీంద్రాలో పనిచేస్తున్నాడు.
* అవసరాల కోసం స్నేహం చేసేవాళ్లూ, తప్పదు కదా అని ఓ నవ్వు నవ్వేవాళ్లూ నాకు నచ్చరు. అందుకే నాకు స్నేహితులు చాలా తక్కువ. సినిమాలూ, ఇల్లే నాకు తెలిసిన ప్రపంచం
* రాజకీయాలంటే నాకు మొదట్నుంచీ ఆసక్తి. వచ్చే ఎన్నికల్లో నా భావాలకు దగ్గరగా పనిచేసే ఏ పార్టీకోసమైనా ప్రచారం చేయాలన్న ఆలోచన ఉంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.