close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టాటాల కోటకు రైతుబిడ్డే రాజు!

టాటాల కోటకు రైతుబిడ్డే రాజు!

7లక్షల కోట్ల రూపాయల ఆదాయం, దాదాపు 7లక్షల మంది ఉద్యోగులు, 6 ఖండాల్లో వందకుపైగా దేశాల్లో కార్యకలాపాలూ... ఇదీ టాటా గ్రూప్‌ స్వరూపం. దక్షిణ భారతంలోని ఓ మారుమూల పల్లెటూళ్లొ జననం, 30ఏళ్ల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం, ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లు విలువ చేసే ‘టాటా సన్స్‌’కి ఛైర్మన్‌గా నియామకం... ఇదీ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ప్రస్థానం. తండ్రి మాట విని వ్యవసాయం మొదలుపెట్టిన కుర్రాడు, దేశ ఆర్థిక స్థితిగతుల్ని ప్రభావితం చేయగల టాటా సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన విధానం, కష్టపడితే కానిదంటూ ఏమీ ఉండదని మరోసారి రుజువు చేస్తుంది.

మెరికాలోని ‘జీఈ’ సంస్థ కార్యాలయం. అక్కడ సమయం ఉదయం 9గం. ‘టీసీఎస్‌’కి చెందిన ఓ విభాగాధిపతి, తమతో వ్యాపారం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఆ అమెరికన్‌ సంస్థకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతలో ‘టీసీఎస్‌’ సీయీవో చంద్రశేఖరన్‌ నుంచి అతడికో ఎస్సెమ్మెస్‌ అందింది... ‘ప్రెజెంటేషన్‌కు సన్నద్ధత ఎలా జరిగింది?’ అని. అప్పుడు సమయం భారత్‌లో తెల్లవారుజాము 2.30. ఇంకో రెండు గంటల తరవాత మరో ఎస్సెమ్మెస్‌... ‘ప్రెజెంటేషన్‌ ఎలా ముగిసిందీ’ అని. అప్పుడు సమయం నాలుగున్నర. తనకు ఉద్యోగమిచ్చిన సంస్థలో చిన్న పనికి కూడా చంద్ర ఎంత ప్రాధాన్యమిస్తారో చెప్పడానికి ఆ ఒక్క సంఘటన చాలు. ఆ పనితీరే ‘టీసీఎస్‌’ను నంబర్‌వన్‌ ఐటీ సంస్థగా మార్చింది. ఆ నిబద్ధతే రతన్‌టాటాకు అతడిని నమ్మకస్తుడిని చేసింది. ఆ అంకితభావమే పేరు చివర ‘టాటా’ లేకపోయినా, వ్యాపారాల్లో వాటా లేకపోయినా అతడిని ‘టాటా సన్స్‌కి’ తొలి పార్సీయేతర ఛైర్మన్‌ స్థాయికి తీసుకెళ్లింది.

తండ్రి అడుగుజాడల్లో...
తమిళనాడులోని మోహనూర్‌ అనే పల్లెటూరు చంద్రశేఖరన్‌ స్వస్థలం. తండ్రి శ్రీనివాసన్‌ న్యాయవాది. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన చంద్ర రోజూ మూడు కిలోమీటర్లు నడిచి ప్రభుత్వ తమిళ మీడియం స్కూల్‌కి వెళ్లేవాడు. ఆరో తరగతిలో ఉన్నప్పుడు అనారోగ్యంతో దాదాపు రెండు నెలలు బడికెళ్లలేదు. దానివల్ల తరగతిలో వెనకబడకూడదని, క్లాస్‌ టీచరే చంద్ర కోసం స్కూల్లో చెప్పిన పాఠాల నోట్సు రాసిపెట్టేది. ‘నీకోసం టీచర్‌ నోట్సు రాయాల్సిన అవసరం లేదు. కానీ తన విద్యార్థి కోసం కష్టపడటంలో ఆనందముందని ఆవిడ అనుకుంది’ అంటూ తండ్రి చెప్పిన మాటలు ఇతరుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్న విషయాన్ని అతడికి నేర్పాయి. మరోసారి వేదమంత్రాలు నేర్చుకుంటానని చంద్ర చెప్పినప్పుడు ‘ఏ పనైనా సరదా కోసం చేస్తే ఓ గంట వృథా అవుతుంది. కానీ వేద విద్యకు నీ జీవితంలో చాలా సమయం కేటాయించాలి. చివరి వరకూ నేర్చుకోగలిగితేనే కోల్పోయిన సమయం సద్వినియోగం అవుతుంది’ అని శ్రీనివాసన్‌ బదులిచ్చాడు. అనుకున్నట్లే మంత్రాలను నేర్చుకున్న చంద్ర, మొదలుపెట్టిన పనిని చివరి వరకూ వదిలిపెట్టకూడదన్న మర్మాన్నీ తండ్రి మాటల నుంచి గ్రహించాడు. చంద్ర తాతయ్య చనిపోయినప్పుడు, తండ్రి శ్రీనివాసన్‌ న్యాయవాద వృత్తిని వదిలేసి వ్యవసాయం మొదలుపెట్టాడు. ‘న్యాయవాదిగా సాఫీగా సాగిపోయే జీవితం కంటే తండ్రికి ఇష్టమైన తమ వ్యవసాయ భూమిలో కష్టపడటమే ఎక్కువ సంతోషాన్నిస్తుందని’ శ్రీనివాసన్‌ చెప్పిన మాటలు చంద్రకి అనుబంధాల ప్రాధాన్యాన్ని బోధించాయి. అలా క్రమంగా తండ్రిని చూస్తూ చంద్ర వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకున్నాడు.

ఆర్నెల్లు వ్యవసాయం...
తొమ్మిదో తరగతి వరకూ తమిళ మాధ్యమంలోనే చదివిన చంద్ర పదో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియంలో చేరాడు. మనసులో ఇంజినీరింగ్‌ చేయాలనున్నా, స్థోమత లేక డిగ్రీకే పరిమితమయ్యాడు. డిగ్రీ పూర్తయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తున్న దశలో తండ్రి అతడిని వ్యవసాయ బాట పట్టించాడు. అన్నయ్యలిద్దరూ బాగా చదువుకున్నారు కాబట్టి, మూడోవాడైన చంద్ర తన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది తండ్రి ఆలోచన. డిగ్రీతో పెద్ద ఉద్యోగాలు రావు కాబట్టి, తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ పొలం దున్నుకోవడమే మంచిదన్న నిర్ణయానికి అతడూ వచ్చేశాడు. రోజూ ఉదయాన్నే తండ్రితో కలిసి నాగలి భుజాన వేసుకొని బయల్దేరేవాడు. ఆర్నెల్లు గడిచేసరికి వ్యవసాయం తన మనస్తత్వానికి సరిపడదని చంద్రకి అనిపించింది. ఎలాగైనా తండ్రిని ఒప్పించి సీఏ కోర్సులో చేరదామని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికే అడ్మిషన్లు పూర్తవడంతో ఎక్కడా సీటు దొరకలేదు. దాంతో రాజీపడి ఎంసీఏ కోర్సులో చేరాడు.

తొలి అవకాశం...
చంద్ర జీవితం మలుపు తిరిగింది ఎంసీఏలోనే. అప్పట్లో కంప్యూటర్‌ రంగంలో ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకే ప్రాధాన్యమిచ్చేవారు. దాంతో డిగ్రీ చదివిన చంద్రకు కూడా చదువయ్యాక ఉద్యోగం రాదేమోనన్న భయం ఉండేది. అందుకే కోర్సుతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్‌ విద్యార్థులతో సమానంగా సబ్జెక్టుపైన పట్టుతెచ్చుకోవాలని కష్టపడేవాడు. అదృష్టం కొద్దీ అతడికి కోర్సులో భాగంగా ‘టీసీఎస్‌’లో ప్రాజెక్టు చేసే అవకాశమొచ్చింది. ఆపైన ప్రాంగణ నియామకాల్లోనూ అదే సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం దొరికింది. అప్పటివరకూ ‘టీసీఎస్‌’ ఇంజినీరింగ్‌ చేసిన వాళ్లనే ఉద్యోగంలోకి తీసుకుంటూ వచ్చింది. అందుకు భిన్నంగా సంస్థ ఎంపిక చేసిన తొలి ఎంసీఏ విద్యార్థి చంద్రశేఖరనే. తన పనితీరుపైనే భవిష్యత్తులో ఎంసీఏ విద్యార్థుల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలో లేదోనన్న విషయం ఆధారపడుంటుంది అని యాజమాన్యం చెప్పిన మాట ఆయనపైన చాలా ప్రభావం చూపింది. ఆ నమ్మకం చెడగొట్టకూడదనీ, అందరితో సమానంగా పనిచేయాలనీ అనుకునేవారు. అన్నయ్యలిద్దరూ ఉదయం ఎనిమిదికి ఆఫీసుకి వెళ్లి ఆరింటికల్లా తిరిగొస్తే, ఆయన మాత్రం ఏడింటికి వెళ్తే ఏ అర్ధరాత్రో ఇల్లు చేరేవారు. కెరీర్‌ తొలినాళ్లలో ఓ ప్రాజెక్టు పనిలో తలమునకలైన చంద్రని ఓరోజు క్లయింట్‌ మేనేజర్‌ భోజనానికి పిలిచారు. తానొస్తే పని ఆగిపోతుందనీ, రావడం కుదరదనీ చంద్ర బదులిచ్చారు. ‘మనం లేకపోయినా ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఆ పని పూర్తిచేసేలా తీర్చిదిద్దడమే నాయకుడి లక్షణం’ అంటూ ఆ రోజు క్లయింట్‌ మేనేజర్‌ చెప్పిన మాట చంద్రకు పెద్ద పాఠంలా మిగిలింది. ఇతరుల్ని నమ్మడం, పనిచేసే వాళ్లందరితో స్నేహంగా మెలగడం, అందరికీ అన్ని పనులూ నేర్పడం అప్పట్నుంచే అలవాటు చేసుకున్నారు.

సంస్థలో పైపైకి...
ఎలాంటి పనైనా సకాలంలో పూర్తిచేసే అలవాటుండటంతో ‘టీసీఎస్‌’లో పెద్ద ప్రాజెక్టులతో పాటు విదేశాల్లోని ప్రాజెక్టులకూ నాయకత్వం వహించే బాధ్యతలు క్రమంగా చంద్రని వెతుక్కుంటూ వచ్చాయి. ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకే పూర్తిగా కొత్తవాళ్లని బృందంలో చేర్చుకుని అమెరికాలో ఓ ఐటీ ప్రాజెక్టుని పూర్తిచేసి చురుకైన నాయకుడిగా యాజమాన్యం దృష్టిని ఆకర్షించారు. దాంతో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా మొదలై కొన్నాళ్లకు ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆ స్థానంలో సంస్థ తొలిసారి బ్యాంకింగ్‌, టెలికాం రంగంలోని ప్రాజెక్టులను దక్కించుకునేలా చూశారు. ఆ పనితీరే అప్పటి టీసీఎస్‌ సీయీవో రామదొరైకి ఎగ్జిక్యుటివ్‌ అసిస్టెంట్‌గా చంద్రకి పదోన్నతి కల్పించింది. అతనిలో ప్రతిభా, నాయకత్వ లక్షణాలకు కొదవలేదనుకున్న రామదొరై ఓ మెంటార్‌లా మారి చంద్రకి మార్గనిర్దేశం చేయడం మొదలుపెట్టారు. క్రమంగా పదోన్నతి పొందుతూ వచ్చిన చంద్ర తొలిసారి ‘టీసీఎస్‌ ఈ-బిజినెస్‌’ విభాగాన్ని మొదలుపెట్టి, సంస్థను ఆన్‌లైన్‌ బాట పట్టించి, నాలుగున్నరేళ్లలో దాన్ని రూ.3500 కోట్లు విలువ చేసే విభాగంగా అభివృద్ధి చేశారు. ఆపైన టీసీఎస్‌ గ్లోబల్‌ డెలివరీ హెడ్‌గా, క్రమంగా ఆపరేషన్స్‌ విభాగానికీ హెడ్‌గా మారారు. ఆ క్రమంలో లాటిన్‌ అమెరికా, చైనా, ఐరోపా, మెక్సికో లాంటి అనేక ప్రాంతాలకు టీసీఎస్‌ కార్యకలాపాలను విస్తరించారు. అప్పగించిన ప్రతి బాధ్యతనూ సమర్థంగా నిర్వహిస్తూ సీయీవో రామదొరై స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న వ్యక్తిగా క్రమంగా పేరు తెచ్చుకున్నారు.

పరుగు మొదలైంది...
2007లో చంద్రను టీసీఎస్‌ బోర్డులో చేర్చడంతో పాటు ఆయనకి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నత బాధ్యతల్ని అప్పగించారు. సీవోవోగా చిన్న సంస్థల్ని చేజిక్కించుకునే పనిని వేగంగా చేపట్టిన చంద్ర, టీసీఎస్‌ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన ‘సిటీగ్రూప్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌’ అనే సంస్థను కొనుగోలు చేసి, టాటా గ్రూప్‌ యాజమాన్యం దృష్టినీ ఆకర్షించారు. కెరీర్లో దూసుకెళ్తున్న అదే సమయంలో వంశపారంపర్యంగా వస్తున్న డయాబెటిస్‌ సమస్య చంద్రలోనూ బయటపడింది. అందరిలా మందులు వాడకుండా, పరుగుతో మధుమేహానికి చెక్‌ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. సమస్య బయటపడిన మరుసటి రోజు నుంచే తెల్లవారు జామున నాలుగున్నరకే ముంబై సముద్ర తీరంలో పరుగెత్తడం మొదలుపెట్టారు. నెమ్మదిగా చంద్రకి పరుగుపైన ఇష్టం పెరగడంతో మారథాన్‌లలో పాల్గొనాలన్న ఆసక్తి పెంచుకున్నారు. తనకున్న పనిభారానికి పరుగెత్తడమే ఎక్కువని సహచరులు వారిస్తున్నా వినకుండా మారథాన్‌లో శిక్షణ తీసుకోవడానికీ సమయం కేటాయించారు. ఆపైన తొలిసారి 42కి.మీల పొడవైన ముంబై మారథాన్‌ను విజయవంతంగా పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నంబర్‌వన్‌గా టీసీఎస్‌
సీవోవోగా రెండేళ్లపాటు పనిచేశాక రామదొరై నిష్క్రమణతో 2009లో 46ఏళ్ల వయసులో టీసీఎస్‌ సీయీవోగా చంద్ర అత్యున్నత బాధ్యతల్ని చేపట్టారు. ఆ స్థానంలో సంస్థ కార్యకలాపాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. సంస్థను 60 విభాగాలుగా విభజించీ, వాటిని చూసుకునేందుకు 23 మందిని నియమించీ, వాళ్లు ప్రతి విషయాన్నీ నేరుగా తనకే రిపోర్టు చేసేలా విధానాల్ని రూపొందించారు. సంస్థలో మహిళల నియామకాల్ని క్రమంగా పెంచుతూ ప్రస్తుతం దేశంలోనే ఎక్కువమంది ఆడవాళ్లకు ఉద్యోగాలిస్తున్న ఐటీ సంస్థగా టీసీఎస్‌ని నిలిపారు. ఓసారి సౌదీ అరేబియాలో ప్రభుత్వం తరఫున ఓ బీపీవోని నిర్వహించే ప్రాజెక్టు కోసం సంస్థలన్నీ పోటీ పడుతుంటే, పూర్తిగా మహిళలతో బీపీవోని నడిపిస్తామన్న ప్రతిపాదనని తీసుకొచ్చి, అలా చేస్తే ఆ దేశ గౌరవమూ పెరుగుతుందని చెప్పి ఆ ప్రాజెక్టుని కైవసం చేసుకున్నారు. పెద్దస్థాయి కార్పొరేట్‌ సంస్థలకే పరిమితమైన టీసీఎస్‌ సేవల్ని చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకూ విస్తరించారు. ఇలాంటి చర్యలన్నీ చంద్రశేఖరన్‌ హయాంలో సంస్థను రాకెట్‌ వేగంతో ముందుకు నడిపించాయి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.30వేల కోట్లుగా ఉన్న సంస్థ వార్షికాదాయం ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలు దాటింది. గతేడాది సంస్థ విలువ రూ.5లక్షల కోట్లు దాటి దేశంలోనే అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా ఎదిగింది. టాటా గ్రూప్‌ వార్షికాదాయంలో 70శాతం వాటా టీసీఎస్‌ నుంచే వస్తోంది. చంద్ర సమర్థ నాయకత్వంతో సాధించి పెట్టిన మైలురాళ్లే ఇవన్నీ.

గతేడాది చివర్లో సైరస్‌ మిస్త్రీ అనూహ్యంగా ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగాక, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా కెమికల్స్‌, టాటా పవర్‌ లాంటి అనేక సంస్థలకు మాతృ సంస్థ అయిన ‘టాటా సన్స్‌’కి కొత్త ఛైర్మన్‌ పదవి కోసం చంద్రశేఖరన్‌తో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు. కానీ ఓ సంస్థలో చిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టి అదే సంస్థకు నాయకుడిగా ఎదిగి, లక్షల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి దాన్ని విస్తరించడంతో పాటు లక్షల కోట్ల ఆదాయాన్ని అందించే వనరుగా తీర్చిదిద్దిన చంద్రశేఖరన్‌కే చివరికి పట్టం కట్టారు. అలా 149ఏళ్లుగా ఆగర్భ శ్రీమంతులే పాలిస్తూ వస్తున్న టాటాల సామ్రాజ్యానికి ఓ రైతు బిడ్డ అధినేతగా అవతరించాడు.

 

రోజూ 7కి.మీ పరుగు

చంద్రశేఖరన్‌ పెద్దన్నయ్య శ్రీనివాసన్‌ మురుగప్ప గ్రూప్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా, చిన్నన్నయ్య సుబ్రహ్మణియన్‌ టీసీఎస్‌ సీవోవోగా పనిచేస్తున్నారు. ఇంట్లో వాళ్లూ, స్నేహితులంతా అతడిని ‘చంద్ర’ అనే పిలుస్తారు. భార్య లలిత, కొడుకు ప్రణవ్‌తో కలిసి చంద్ర ముంబైలో ఉంటున్నారు.

* రోజూ ఏడు కి.మీ.కు తగ్గకుండా చంద్ర పరుగెడతారు. మన దేశంలో అనేక మారథాన్‌లతో పాటు ఆమ్‌స్టర్‌డమ్‌, బోస్టన్‌, షికాగో, బెర్లిన్‌, న్యూయార్క్‌ లాంటి నగరాల్లోనూ మారథాన్‌లు పూర్తిచేశారు.
* చంద్ర మంచి ఫొటోగ్రాఫర్‌. తమిళ పాటల్ని ఎక్కువగా వింటుంటారు. పెంపుడు కుక్క ‘రే’కి క్యాన్సర్‌ అని తెలిసినప్పుడు అమెరికా పర్యటనని అర్ధంతరంగా ముగించుకొని దాన్ని చూడటానికి వచ్చి, తన మృదుస్వభావాన్ని బయటపెట్టారు.
* భారత రిజర్వ్‌ బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో చంద్ర ఒకరు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, నెదర్లాండ్స్‌ బిజినెస్‌ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. గీతం యూనివర్సిటీ, చెన్నై ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాలూ గౌరవ డిగ్రీలతో సత్కరించాయి.
* టీసీఎస్‌లో పనిచేసే దాదాపు ఐదు వేలమందిని చంద్ర ఇంటిపేరుతో సహా పలకరించగలరన్న పేరుంది. టీసీఎస్‌ సీయీవోగా గతేడాది దాదాపు రూ.26కోట్లు జీతంగా అందుకున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.