ఏడాదంతా ఎన్నికల పండగే!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే పండగ. 2023లో తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి మొదలు డిసెంబరు వరకూ వివిధ రాష్ట్రాల్లో ఈ సంబరాలున్నాయి.

Published : 31 Dec 2022 23:58 IST

ఏడాదంతా ఎన్నికల పండగే!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే పండగ. 2023లో తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి మొదలు డిసెంబరు వరకూ వివిధ రాష్ట్రాల్లో ఈ సంబరాలున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎత్తులూ, పొత్తులతో రాజకీయంగా ఈ ఏడాదంతా ఉత్తేజిత వాతావరణం ఉంటుంది.

ఈశాన్యంలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం.. దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటక.. ఉత్తరాదిలో రాజస్థాన్‌లకు తోడు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలకు 2023లో ఎన్నికలున్నాయి. వీటితోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లోనూ ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది. దేశంలోని అయిదో వంతు ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్‌-మేలో కర్ణాటక, నవంబరు-డిసెంబరులో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాజస్థాన్‌లలో ఎన్నికలు ఉన్నాయి.

తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల మధ్య పోరుగా ఉంటే ఈసారి పోటీ త్రిముఖంగా మారింది. ఈ రేసులో భారత్‌ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లలో ఏది గెలిచి నిలుస్తుందో చూడాల్సిందే. దక్షిణాదిలో మరిన్ని రాష్ట్రాల్లో కమలాన్ని వికసింపజేయడానికి తహతహలాడుతోన్న భాజపా తెలంగాణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గతంలో లోక్‌సభ స్థానాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన భాజపా ఈసారి శాసనసభలో పాగా వేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది.

2024లో జమిలి ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికల హడావుడి ఊపందుకొంది. ప్రధాన పార్టీల నాయకులు ఈ ఏడాదంతా ప్రచారంలో మునిగి పోనున్నారు. వీలైనంత త్వరగా పొత్తులు కుదుర్చుకొని ఎత్తులకు సిద్ధమవ్వాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. భారాస జాతీయ స్థాయి విస్తరణకు 2023లో జరిగే ఎన్నికలు ఓ అవకాశంగా చూస్తోంది. మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలు భాజపాకు ఎంతో కీలకం కానున్నాయి. అక్కడ గెలిస్తేనే దక్షిణాదిలో ఆ పార్టీ ఉనికి కొనసాగేది. 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో విజయం భాజపాకు ఎంతో ముఖ్యం. భారాస కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పోటీచేయాలనుకుంటోంది. అది కర్ణాటకతోనే మొదలైతే తెలుగు ఓటర్లతోపాటు సరిహద్దు జిల్లాల్లో కొంత ప్రభావం చూపొచ్చు. కాంగ్రెస్‌ కాస్త మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడ ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటంతో, ఈసారి ఎలాగైనా గెలిచి దక్షిణాదిలో తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకుంటోంది.

సెమీ ఫైనల్‌ కానుందా..

దాదాపు 120 లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరుగనుండటం, ఏడాదిలోపే లోక్‌సభ ఎన్నికలుండటంతో ఇవి 2024 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌ కానున్నాయా అంటే కచ్చితంగా చెప్పలేం. తెలంగాణ మినహా ఈ ఎన్నికలు ప్రధానంగా భాజపా, కాంగ్రెస్‌ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ మాత్రమే. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లను ఎలాగైనా తిరిగి నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షతో ఆ పార్టీ ఉంది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌లో ఎంత మేరకు జోష్‌ తెచ్చిందో ఈ ఎన్నికలతో తెలుస్తుంది. 2018 ఎన్నికల్లో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాల్ని నెలకొల్పగా.. తర్వాత కొద్ది నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ రాష్ట్రాల్లో భాజపా హవా నడిచింది. రాజస్థాన్‌లో 25 లోక్‌సభ సీట్లూ భాజపానే గెలిచింది. దిల్లీలోనూ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా హవా నడవగా, కొద్ది నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆప్‌ విజయకేతనం ఎగరేసింది. రాష్ట్ర, కేంద్ర స్థాయుల్లోని నాయకత్వాన్నీ, సమస్యల్నీ ప్రజలు ఒకే గాట చూడటం లేదనడానికి నిదర్శనం ఇది. రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం, సామాజిక పరిస్థితులు కీలకపాత్ర పోషించగా, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం, దేశ భద్రత, జాతీయవాదం, ఆర్థికవృద్ధి.. లాంటి అంశాల్ని ఓటర్లు దృష్టిలో పెట్టుకుంటున్నారు. భాజపా, కాంగ్రెస్‌లతోపాటు ఈ మధ్య ఆమ్‌ఆద్మీపార్టీ కూడా జాతీయస్థాయిలో పుంజుకుంటోంది. వీటికి భారాస పోటీ ఇవ్వాలనుకుంటోంది. ఎమ్‌ఐఎమ్‌ కూడా విస్తరణ కాంక్షతో ఉంది. ఇంతవరకూ ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వం అనే మాట భాజపాకే పరిమితమవుతూ వస్తోంది. ఇకపైన మరిన్ని పార్టీలూ ఇదే మాట చెప్పొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..