Published : 23 May 2022 01:04 IST

వృద్ధుల ఉత్సవాలు

సృష్టిలో అన్ని ప్రాణులకన్నా నరజన్మ ఉత్తమమైనది. ఆహార నిద్రా భయ మైథునాలు జీవకోటికి సమానమైనా- వాక్కు, బుద్ధి మానవులకు విశేషమైనవి. సాధారణంగా అధర్మ వర్తనులకు అపమృత్యువు కలుగుతుందని, ధర్మాత్ములకు పరిపూర్ణాయుర్దాయం సిద్ధిస్తుందని వరాహమిహిరుడు బృహత్సంహితలో పేర్కొన్నాడు.

శుక్లయజుర్వేద సంహిత ప్రకారం మానవుల పూర్ణాయుష్షు వెయ్యి సంవత్సరాలు. త్రేతాయుగంలో దశరథుడు 60 వేల సంవత్సరాలు, శ్రీరాముడు 10 వేల సంవత్సరాలు రాజ్యం చేసినట్లు రామాయణం చెబుతోంది. ఆ యుగాల్లో కాలమానం ఇప్పటికన్నా భిన్నమైందనే భావన ఉంది. కలియుగంలో 120 ఏళ్లు పరమాయువని కొన్ని గ్రంథాలు పేర్కొనగా, మానవ జీవన ప్రమాణం 116 సంవత్సరాలుగా ‘తాడిసంహిత’ తెలిపింది. భారతీయ సంప్రదాయభావనలో ‘శతమానం భవతి’ అని ఆశీర్వచనం. నిండు నూరేళ్లూ చల్లగా జీవించాలని దీవిస్తారు. మానవ జీవిత ప్రస్థానంలో తొలిదశ షష్టిపూర్తి. 120 ఏళ్ల పరమాయువులో అది సగం.

ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఒక చక్రభ్రమణం. ఎవరికైనా 60 ఏళ్లు పూర్తయితే వారి జీవితంలో రెండో కాలచక్ర భ్రమణం ఆరంభమైందన్నమాట. అప్పుడే ‘షష్టిపూర్తి’ జరుపుకొంటారు. గడచిన కాలాన్ని స్మరించుకుంటూ, భవిష్యత్తు సుఖశాంతులతో సాగడానికి, జీవన ప్రమాణం పెంపుదలకు ఆయుర్దేవతకు, గ్రహనక్షత్ర దేవతలకు పూజలు నిర్వహించి వారి అనుగ్రహం పొందే ప్రయత్నం ఒక సదాచారంగా ఏర్పడింది. లౌకికంగా షష్టిపూర్తి అంటున్నా, 60 ఏళ్లు నిండినవారు ఆచరించే విధిని ఉగ్రరథ శాంతిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఉగ్రుడు అధిదేవతగా, మృత్యుంజయుడు ప్రత్యధిదేవతగా చేసే మృత్యు పూజగా ఈ శాంతిని నిర్వహిస్తారు. 70 ఏళ్లు పూర్తయ్యాక నిర్వహించే కార్యక్రమాన్ని ‘భీమరథం’ అంటారు. ఇందులో నవగ్రహ మండపారాధన, నవగ్రహ హోమ జన్మనక్షత్ర జపం, హోమాలు, రావిచెట్టుకు ప్రదక్షిణం వంటి క్రియాకలాపాలుంటాయి. చతుర్వేద పారాయణాన్ని ఏర్పాటుచేస్తారు. 78వ ఏట జరుపుకొనే శాంతిని విజయ రథశాంతి అంటారు.

వయోవృద్ధుల జీవిత ప్రస్థానంలో ఒక అపూర్వ ఘట్టం- సహస్ర చంద్రదర్శనం. షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రదర్శనం పౌర్ణమినాటి అనుభూతి అయితే వెయ్యి పున్నములను దర్శించే మహోత్సవం ఇది. 83 సంవత్సరాల నాలుగు నెలల ప్రాయంలో నిర్వహించాలని శాస్త్రం చెబుతున్నా, చాంద్రమానంలో కొన్ని సంవత్సరాల్లో వచ్చే అధిక మాసాలను కలుపుకొని 81 ఏళ్లు నిండి 82వ సంవత్సరంలోపే సహస్ర చంద్రదర్శనం అయినట్టు లెక్క. సహస్ర చంద్రదర్శనం చేసినవారు సకల పాపాల నుంచి, సర్వ రుణాల నుంచి విముక్తులై మహాపుణ్యాన్ని పొందగలరని శాంతికమలాకరమనే ధర్మశాస్త్ర గ్రంథం చెబుతోంది. మానవుడు ఆచరించవలసిన షోడశ కర్మల్లో ఈ ఉత్సవాలు భాగం కాకపోయినా, వాటిని వైదికంగా ఆచరించడం చిరకాలంగా ఉంది. నూరోజన్మదినం సందర్భంలోనూ వైదిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటి.

‘శరీరం క్షీణిస్తుంది. నడక మందగిస్తుంది. దంతాలు ఊడిపోతాయి. చూపు నశిస్తుంది. వినికిడి తగ్గిపోతుంది. బంధువులు మాట పట్టించుకోరు. సేవ చేయడానికి భార్య ఇష్టపడదు. పుత్రుడు శత్రువులా ప్రవర్తిస్తాడు. అయ్యో! వార్ధక్యం ఎంత దుర్భరమో’ అంటాడో కవి. కాల స్వరూపాన్ని పారమార్థిక చైతన్యంగా గ్రహించి కాలం విలువను గుర్తించాలి. వృద్ధాప్యంలో ధనాశ, దురాశ, స్వార్థ చింతనలకు లోనుగాకుండా శేషజీవితాన్ని భగవత్‌ చింతనలో, సమాజ సేవలో గడపాలి.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని