గ్రామ దేవతలు

భారత దేశంలో గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా వస్తోంది. మాతృ దేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృ దేవత అని గ్రహించిన పురాతన మానవులు ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించారు. వాటిలో ప్రార్థన, మంత్ర తంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మ హింస, బలి ముఖ్యమైనవి. గ్రామదేవతలను ఊరి పొలిమేరల్లోనే నిలిపేవారు.

Updated : 16 Aug 2022 07:28 IST

భారత దేశంలో గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా వస్తోంది. మాతృ దేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృ దేవత అని గ్రహించిన పురాతన మానవులు ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించారు. వాటిలో ప్రార్థన, మంత్ర తంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మ హింస, బలి ముఖ్యమైనవి. గ్రామదేవతలను ఊరి పొలిమేరల్లోనే నిలిపేవారు. ఈ దేవతలను పంచభూతాలకు ప్రతీకలుగా కొందరు పేర్కొన్నారు. పృథివి అంటే భూమి. పంటకు ఆధారం. కుంకుళ్లు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన గ్రామ దేవతను కుంకుళ్లమ్మ అని, గోగులు పూచే ప్రాంతంలో గోగులమ్మ అని, జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, వరి బాగా పండే ప్రాంతంలో నూకాలమ్మ అని గ్రామ దేవతలను వ్యవహరిస్తుంటారు.బతుకునిచ్చే తల్లి బతుకమ్మ. అన్నం పెట్టే అమ్మ అన్నమ్మ. జలానికి సంబంధించి గంగమ్మ, గంగాలమ్మ పేర్లతో గ్రామదేవతలు వెలశారు. తేజస్సునిచ్చే సూర్యుడికి ప్రతీకగా సూరమ్మ, రాత్రి పూట వెలుగునిచ్చే చంద్రుడికి సంకేతంగా పున్నమ్మ గ్రామ దేవతలయ్యారు. గ్రామ దేవతకు కుడి కన్ను సూర్యుడిగాను, ఎడమ కన్ను చంద్రుడిగాను భావించి, ఇద్దరి కళలు ఉన్న అమ్మను ‘ఇరుకళమ్మ’ అన్నారు. కొండ ప్రాంతంలో గాలి తీవ్రత ఎక్కువ. కరువలి అంటే పెద్ద గాలి. ఆ గాలినుంచి రక్షించేందుకు కొండ ప్రాంతాల్లో ‘కరువలమ్మ’ను ఏర్పాటు చేసుకున్నారు. కొండమ్మ అకాశ దైవానికి ప్రతీక. కొండ ఆకాశం పైన ఉంటుందిగనుక మెరుపులు, పిడుగులు, గాలి వాన నుంచి రక్షణకు ఈ దేవతను కొలుస్తారు. పొలిమేర గ్రామ దేవత పొలిమేరమ్మ. ఆమె జన వ్యవహారంలో పోలేరమ్మ అయ్యింది. భక్తుల తలపుల్ని తీర్చే తల్లి తలుపులమ్మ. ఈ గ్రామ దేవత ఆలయం తుని ప్రాంతంలో ఉంది. 

సరిహద్దులను ఎల్లలంటారు. గ్రామ సరిహద్దుల్లో కాపలా కాసే దేవత ఎల్లమ్మ. విశాఖపట్నంలో ఒక ప్రాంతంలో ఎల్లమ్మ గ్రామ దేవత. జీవన భృతి కలిగించి, పోషించే దేవత పోచమ్మ. బ్రోచు అంటే రక్షించు అని అర్థం. పాము పుట్టలుండే ప్రాంతాల్లో వెలసిన దేవతలు పుట్టమ్మ, సుబ్బమ్మ, పాపమ్మలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు కలిపి ఒక గ్రామ దేవత ఉంటుంది. మావూళ్లన్నింటికీ దేవత అనే అర్థంలో భీమవరంలో మావూళ్లమ్మ వెలసింది. శివుడి గళం మీద మచ్చ(అంకం) కారణంగా అంకగళమ్మ అంకాలమ్మగా మారిందని చెబుతారు. మనిషికి జీవిత కాలానికి ఉండే అవధిని ‘కట్ట’ అంటారు. ఆ కట్టను మేయగల అంటే ఆ అవధి నుంచి రక్షించగల దేవత ‘కట్టమైసమ్మ’. ప్రజలు స్వచ్ఛంగా భావించే తల్లి సత్తెమ్మ. స్వచ్ఛమైన తల్లి జన వ్యవహారంలో అచ్చెమ్మ అయ్యింది. దేవతలను విశాల నేత్రాలు కలవారిగా భావించడం సంప్రదాయం. ఫుల్ల అంటే వికసించిన అని అర్థం. ఈ ఉద్దేశంలో పుల్లమ్మ వెలసింది. నైవేద్యం సమర్పించడాన్ని అర్పణ అంటారు. అర్పణమ్మ అప్పలమ్మ అయింది. అమ్మవార్ల ఊరేగింపులో అతి చిన్న విగ్రహం, బాలాత్రిపుర సుందరి విగ్రహానికి సమ ఉజ్జి పెంటి(బాల) పెంటమ్మ అయింది. భోజనానికి వికృత రూపమైన బోనం అందించే తల్లి బోనాలమ్మ. లలితా దేవి భండాసుర సంహారానికి గుర్రం మీద వెళ్ళిందనే భావనతో గుర్రాలమ్మ వెలసింది. కాకతీయుల కాలంలో ఏకవీర, రేణుక గ్రామ దేవతలుగా ప్రసిద్ధికెక్కారు. 

గ్రామ దేవతలు చిన్న రాయిగానో, చెట్టు రూపంలోనో దర్శనం ఇవ్వడం ఉంది. శిష్టాచారం ప్రకారం పూజించే దేవతల్ని ఆర్య దేవతలు లేక వైదిక దేవతలు అంటారు. గ్రామ దేవతలను ద్రావిడ దేవతలుగాను కొందరు పరిగణిస్తున్నారు.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts