అర్థశౌచమే ఆనందం

ప్రపంచమనే చక్రం డబ్బు అనే ఇరుసు మీదనే పరిభ్రమిస్తుంది. డబ్బు, అర్థం, ధనం సమానార్థక పదాలు.

Published : 01 Dec 2022 00:41 IST

ప్రపంచమనే చక్రం డబ్బు అనే ఇరుసు మీదనే పరిభ్రమిస్తుంది. డబ్బు, అర్థం, ధనం సమానార్థక పదాలు. డబ్బు లేని బతుకు ఊహించడమూ కష్టమే. అంతగా మనిషి జీవితంతో ముడివడిపోయింది అది. ధర్మ కార్యాచరణకు కామిత పురుషార్థ అనుభవానికి సైతం అర్థమే కారకమవుతుంది. పురుషార్థాల్లో అర్థం రెండోది.

లోకంలో ప్రతికార్యం అర్థం చేతనే సిద్ధిస్తుంది కాబట్టి అందరూ అర్థాన్ని అపేక్షిస్తారు. ధనవంతుడే బలవంతుడు, గుణవంతుడు అనే దశకు అర్థం తీసుకుని వెళుతుంది. ప్రపంచమంతటికీ ధనమే మూలమైనదనే నానుడులు అందువల్లనే పుట్టుకొచ్చాయి. డబ్బు సంపాదన కోసం సక్రమమైన పద్ధతుల్లో ప్రయత్నం చేయడమే ఉత్తమం. కానీ, అలా చేసేవారు లోకంలో తక్కువ. దాన్ని సంపాదించడానికి అడ్డదారులు తొక్కేవారే ఎక్కువ. అది అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
శుద్ధిగా ఉండటాన్ని శౌచం అంటారు. వాక్శుద్ధి, మనశ్శుద్ధి, శరీర శుద్ధి, క్రియా శుద్ధి... వీటన్నింటినీ బాహ్యాభ్యంతర శౌచం అంటారు. సత్యం, ప్రియ, హిత వచనాల వల్ల దేవతా స్తుతుల వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. ధ్యానం, సద్భావనల వల్ల మనశ్శుద్ధి ఏర్పడుతుంది. పవిత్ర ప్రవర్తన వల్ల క్రియా శుద్ధి, స్నానం ఆహార నియమాలతో శరీర శుద్ధి కలుగుతాయి. ఆ విధంగానే సంపాదించిన ధనం విషయంలోనూ శుద్ధత పాటించడం అవసరం.

‘అర్థశౌచమే నిజమైన శౌచం’ అని మనుస్మృతి చెబుతోంది. సంపాదనలో శుద్ధత ఉండాలి. అంటే న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి. అక్రమంగా, అన్యాయంగా, మోసం చేసి సంపాదించడం సముచితం కాదు. ధనానికి ఆర్జన, వినియోగం, సంచయం అని మూడు దారులున్నాయి. అంటే సంపాదించడం, ఉపయోగించడం, దాచుకోవడం అని అర్థం. ఈ మూడు దశల్లోనూ శుద్ధత ఉండాలి. దీన్నే అర్థశౌచం అంటారు. ఎంత సంపాదించామని కాక, ఎలా సంపాదించామన్నదే ప్రధానం.
శుద్ధతను పాటించకుండా కొందరు అక్రమార్జన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటివారు లేనిపోని ఇక్కట్లు పడతారు. అలా సంపాదించిన దాన్ని అక్రమార్జన అంటారు. ధనాన్ని ఎలా సంపాదించావు అనేదానిమీద దాని శుద్ధత ఆధారపడి ఉంటుంది. అక్రమంగా ఆర్జించిన సంపాదనకు నిలకడ ఉండదు. ఫలితంగా వేదనతో కూడిన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది అన్యాయార్జనతో ధనాన్ని పోగుచేసుకుంటూ దానిలో కొంత భాగాన్ని దేవతల పూజలకు వినియోగిస్తారు. మరికొంత దేవాలయాల్లోని హుండీలో వేసి తమ పాపాలు తొలగి పోయాయని మురిసిపోతుంటారు. కానీ, అక్రమార్జనను దైవానికి సమర్పిస్తే దాని దోషం చాలా బలంగా తగులుతుంది. కాబట్టి న్యాయంగా, ధర్మబద్ధంగా సంపాదించిన ధనాన్ని మాత్రమే దైవకార్యాలకు, దానాలకు వినియోగించాలి.

ఎంత సక్రమంగా, నియమంగా, నిజాయతీగా ఆర్జించినా ఒక్కోసారి ఏదో విధంగా మనకు తెలియకుండానే చేసిన సంపాదనలో కాస్తంత అన్యాయం కలిసిపోవచ్చు. ఇది అజ్ఞాత దోషం. సంపాదనలో కొంత భాగం నిస్వార్థమైన సత్కార్యాలకు వెచ్చించడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది. కేవలం ధార్మిక సంపాదనే ఇలాంటి దోషాలను పోగొడుతుంది. అంతేకాని, ఉద్దేశ పూర్వకంగా చేసిన అక్రమాలకు వర్తించదు.

వి.ఎస్‌.రాజమౌళి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు