క్షీరసాగర మథనం

ప్రకృతిలో ఏ వస్తువుగాని, ఏ ప్రాణిగాని దాని సహజగుణాన్ని విడిచిపెట్టదు. మట్టి బంగారం కాలేదు. పులి సాధుజంతువూ కాలేదు.

Published : 08 Dec 2022 01:00 IST

ప్రకృతిలో ఏ వస్తువుగాని, ఏ ప్రాణిగాని దాని సహజగుణాన్ని విడిచిపెట్టదు. మట్టి బంగారం కాలేదు. పులి సాధుజంతువూ కాలేదు. ఈ నియమం మనిషికి మాత్రం వర్తించదు. మనిషి దైవం కాగలడు, పశువుగానూ ప్రవర్తించగలడు. మార్పునకు అవకాశం ఉన్నది మనిషికే! వివేకి దీన్ని సద్వినియోగం చేసుకుని, వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తాడు. ఒక వస్తువు విలువ, దాని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి విలువ అతడి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. నీతి నిజాయతీల కన్నా, వాంఛలూ వ్యామోహాలే మనిషిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలుంటాయి. కొందరిలో నైతిక విలువలుంటే, కొందరిలో అవి కనపడవు.మనిషి మాటలు చేతలు అతడి ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మంచిగానే ఉంటారు. అననుకూలమైనప్పుడు మాత్రం కొందరు ధైర్యాన్ని, సహనాన్ని కోల్పోతారు. సమస్యల పరిష్కారానికి కొందరు బాహ్య ప్రపంచంవైపు చూస్తే, కొందరు అంతరంగంవైపు చూస్తారు. కొందరు ఎదుటివారిని గమనించినంతగా తమను తాము గమనించుకోరు.

మనం ఏ మహనీయుణ్ని దర్శించినా వారిలో సరళస్వభావం, నీతి, నిజాయతీ, చిత్తశుద్ధి ప్రస్ఫుటంగా కనపడతాయి. వారిలో విశాల దృక్పథం, అంతరంగ ధీరత్వం  గమనించగలం. ఎంతో హుందాగా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలున్నవారే మహనీయులు. ఆ లక్షణాలను అలవరచుకోవడమే మనిషికి లక్ష్యం కావాలి. అది అంత తేలిక కాదు. సిద్ధాంతాల వల్ల, ప్రవచనాల వల్ల వ్యక్తిత్వంలో మార్పురాదు. మన మనసును మనమే క్రమబద్ధం చేసుకోవాలి.  
సముద్రంలో అమృతం ఉందని విశ్వసించి దేవ దానవులు సాగరమథనం చేసినట్లే, మనిషి తన మనసును బాగా శోధించాలి. మనసు ఒక సాగరం లాంటిది. అంతుపట్టనంత లోతుంటుంది. సాగరంలో హాలాహలం అమృతం రెండూ ఉన్నట్లే, మనసులోనూ మంచి చెడు ఉంటాయి. మన పురాణాల్లో కథలు ఎంతో సందేశాత్మకంగా ఉంటాయి. మనిషి మనసును ఎలా మథించాలో, క్షీరసాగర మథనం కథ మనకు చెబుతుంది. విశ్వాసాన్ని కూర్మంలా నిశ్చలంగా ఉంచి, బుద్ధి అనే మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, మనసు అనే సాగరాన్ని చిలికితే, కరుడుకట్టిన స్వార్థం అనే హాలాహలం ముందుగా బయట పడుతుంది. దేవతలు శరణు వేడితే శివుడు ఆ విషాన్ని స్వీకరించినట్లే- పశ్చాత్తాపం వ్యక్తపరచిన మనిషి తప్పులను దైవం క్షమిస్తాడు. స్వార్థం మనిషిని ఎన్నో తప్పులు చేయిస్తుంది. పొరపాటు చేయకుండా ఉండటం ఎంతటి వారికైనా సాధ్యంకాదు. పశ్చాత్తాపం అనే తపస్సు చేసి దైవాన్ని ప్రార్థిస్తే క్షమిస్తాడని పెద్దలు చెబుతారు.

పశ్చాత్తాపం మనిషిలో గొప్ప మార్పు తెస్తుంది, మరో జన్మనిస్తుంది. క్షమించమని దైవాన్ని అర్థిస్తే ఆత్మన్యూనత తొలగుతుంది. తప్పులకు కుంగి పోకుండా దైవభక్తి కాపాడుతుంది. గంగాస్నానం, పుష్కరస్నానాలు పాపవిముక్తిని ఇస్తాయని, ప్రాయశ్చిత్త విధానాలు పాటించమని చెప్పి, మన శాస్త్రాలు మనిషిలో మార్పునకు అవకాశం కల్పించాయి. మనసు మార్చుకుని మంచి మార్గంలో నడవాలని వీటి ఉద్బోధ. మనసు అనే సముద్రం నుంచి స్వార్థం, దుర్బుద్ధి అనే హాలాహలం బయటకు వచ్చేస్తే, ఆపై పొందేవన్నీ అమూల్య గుణసంపదలే. ఇహలోక వైభవాలకు, అష్టైశ్వర్యాలకు చిహ్నాలైన కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కౌస్తుభం, లక్ష్మీదేవి- సద్గుణ సంపన్నుడి వద్దకే చేరతాయి. చివరికి అమరత్వాన్నిచ్చే ఆత్మామృతాన్ని మనసును మథించి సాధించవచ్చు.

 పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని