కృషి-విశ్వాసం

దైవాన్ని ముక్తికో లేక దర్శన భాగ్యానికో పూజించేవారే భక్తులు కారు. కార్యార్థులూ భక్తులే. ఇహపరాలు ఆయన అధీనమని భక్తులు నమ్ముతారు. దైవంపై నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే కార్యం సఫలమవుతుందని వారి విశ్వాసం. కృషి, విశ్వాసం రెండూ ఉండాలన్నమాట.

Published : 17 May 2023 00:52 IST

దైవాన్ని ముక్తికో లేక దర్శన భాగ్యానికో పూజించేవారే భక్తులు కారు. కార్యార్థులూ భక్తులే. ఇహపరాలు ఆయన అధీనమని భక్తులు నమ్ముతారు. దైవంపై నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే కార్యం సఫలమవుతుందని వారి విశ్వాసం. కృషి, విశ్వాసం రెండూ ఉండాలన్నమాట. దైవానుగ్రహం అనేది పక్కన పెట్టి, వాస్తవ దృక్పథం చూస్తే మనిషి చేసే కార్యాలన్నీ కృషితోనే నెరవేరుతున్నాయి. దైవానుగ్రహం అనేది ఒక విశ్వాసం. ఇది అవసరమా అన్నది ప్రశ్న. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తి మనకు తెలిసిందే. కృషితోనే ఏదైనా సాధించగలమని చెప్పే ఈ సూక్తి మనిషికి కొండంత ఆత్మబలాన్నిస్తుంది. తన కృషితోనే ఎదిగాననే భావన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తే మంచిదే. కాని, దాని వెనక అహం బలంగా ఉంటుంది. ఇది మోతాదు మించితే సమస్య మొదలవుతుంది.

కృషితో ఎదిగినవారున్నారు. అంతకుమించి కృషి చేసినా ఓడినవారెందరో ఉన్నారు. గెలుపునకు కృషి అత్యావశ్యకమైనా పరిస్థితులు అనుకూలించాలి. ఇదే దైవానుగ్రహం. పరిస్థితులు అన్నివేళలా సానుకూలంగా ఉంటాయనుకోవడం అవివేకం. వాటిని దాటగలమని అనుకోవడం అంతకన్నా అవివేకం. ఎంతో శ్రమించి సాధించినా అది దైవకృపేనని భావించకపోతే మనిషి జీవితం పరాజయమవుతుంది. గెలుపునుంచి పుట్టే అహం ఎన్నో అనర్థాలకు మూలం. ఎవరినీ లక్ష్య పెట్టకపోవడం, మాట తూలడం, ఎవరు చెప్పినా వినకపోవడం, తాను అనుకున్నదే సరైనదని భావించడం, వ్యతిరేక భావాలను సహించ లేకపోవడం, చిన్న పొరపాటుకే తీవ్రంగా స్పందించడం... ఇలా ఎన్నో దుర్గుణాలను అహం తెచ్చి పెడుతుంది. వాదనలో తనదే పైచేయి కావాలనుకోవడం, తెలియని మొండి తనం, పంతాలు పట్టింపులకు అహం ముడిపదార్థం. బంధు మిత్రులు, సహోదరులు, సహోద్యోగులు, జీవిత భాగస్వామి మనసులో కొంచెమైనా మంచి స్థానం పొందలేనప్పుడు మనిషి ఏది సాధించినా ఎంత సంపాదించినా ఏమీ ప్రయోజనం ఉండదు.

తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి ప్రపంచ నియంత అయినా నిష్ప్రయోజకమే. ఏదో ఒక రోజు అన్నీ కోల్పోతాడు. అహాన్ని ఆదిలోనే తుంచాలంటే గెలుపును దైవకృపగా భావించాలంటారు పెద్దలు. దైవానుగ్రహంతో తన కృషి ఫలించింది అంటే సరిపోదు. అనుకున్నా సరిపోదు. దృఢంగా విశ్వసించాలి. అహానికి విరుగుడు దైవభావనని గుర్తించి, మన పెద్దలు బాల్యం నుంచే దీన్ని అలవరచేవారు. తరగతిలోకి వెళ్ళేముందు, బడిపిల్లలందరిచేతా గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి శ్లోకాలను గతంలో ప్రార్ధన చేయించేవారు. ధార్మిక వాతావరణంలో పిల్లలను పెంచేవారు. పసి మనసులు పసిడి మనసులు. అవి ఎంతో విలువైనవి. సద్భావనలు అనే విత్తనాలు లేత మనసులో నాటాలి. నీరు ఎండి బీటలువేసిన నేలలో విత్తనాలు మొలకెత్తవు. అలాగే కొత్త సంస్కారాలు ఎదిగిన మనసులో పుట్టవు. ఎదిగిన బుద్ధి తర్కాన్ని ఇష్టపడుతుంది. అశక్తుడే దైవాన్ని పట్టుకుంటాడు అనే మాటలు ప్రభావితం చేస్తాయి. భక్తిరహితమైన తార్కికభావాలు నాస్తికుణ్ని చేస్తాయి. తార్కిక భావాలు భక్తికి తోడైతే జ్ఞానం పుడుతుంది. పెరిగే జాజితీగను కర్రకు జోడించి, అది పాకే దిశను నిర్దేశిస్తారు. అలాగే దైవమనే కర్రను కృషికి జతచేస్తే మనిషి సవ్యంగా ఎదుగుతాడు, అహం అదుపులో ఉంటుంది. దైవభావన నుంచి మొదట పుట్టేది పాపభీతి. ఇది నిష్ఠ, నియమం, నీతి, నిబద్ధత, నియంత్రణ అనే అయిదు ఆణిముత్యాలను మనిషికి ఆభరణంగా ఇస్తుంది.

పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు