ప్రేమాస్పదుడు

శరీరంలో ఆత్మలా భగవంతుడి సృష్టిలో ప్రేమ అంతర్లీనమై అలరారుతుంది. ఆత్మ లేకుండా దేహం లేదు. ప్రకృతి నుంచి పచ్చదనాన్ని విడదీయలేం. అగ్ని నుంచి వేడిని వేరుచేయలేం. గాలి నుంచి ప్రాణవాయువును వేరుగా చూడలేం. ఇలా ప్రకృతిలో అంతర్లీనంగా వాటి వాటి అంతశ్శక్తులు పూలదండలో దారంలా మిళితమై ఉన్నాయి.

Updated : 29 Jan 2024 05:58 IST

శరీరంలో ఆత్మలా భగవంతుడి సృష్టిలో ప్రేమ అంతర్లీనమై అలరారుతుంది. ఆత్మ లేకుండా దేహం లేదు. ప్రకృతి నుంచి పచ్చదనాన్ని విడదీయలేం. అగ్ని నుంచి వేడిని వేరుచేయలేం. గాలి నుంచి ప్రాణవాయువును వేరుగా చూడలేం. ఇలా ప్రకృతిలో అంతర్లీనంగా వాటి వాటి అంతశ్శక్తులు పూలదండలో దారంలా మిళితమై ఉన్నాయి. భగవంతుడు లోకాలను సృష్టించి ఆత్మతో సమానమైన ప్రేమను వాటిలో నిక్షిప్తం చేశాడంటారు పెద్దలు. పుట్టబోయే బిడ్డపై అపారమైన ప్రేమతో తల్లి అనేక కష్టాలు సహిస్తుంది. చెడు బిడ్డ ఉంటుందేమో గాని చెడు తల్లి ఉండదంటారు. ఇతర ప్రాణికోటిలో కొంత కాలంవరకే పుట్టిన బిడ్డపై తల్లికి ప్రేమ ఉంటుంది. మనిషి తన ప్రేమను కలకాలం నిలుపుకొంటాడు.

ప్రేమ వైవిధ్యమైనది. డబ్బుపై ప్రేమ, సుఖాలపై ప్రేమ, సౌకర్యాలపై ప్రేమ, ఆడంబరాలపై ప్రేమ, ఆరోగ్యంపై ప్రేమ... ఇలా భౌతిక అంశాలపై మనిషికి ప్రేమ ఉంటుంది. ప్రేమను దక్కించుకునేందుకు ఎన్నో చేస్తాడు మనిషి. మహాత్ముల్లో అకారణమైన ప్రేమ ఉంటుంది. తమకు ఏమీ కానివారిపై ప్రేమ చూపిస్తారు. రంతిదేవుడు, కర్ణుడు, బలిచక్రవర్తి... పుణ్యకార్యాల పట్ల ఆసక్తితో దాతృత్వంపై ప్రేమ చూపారు. లోకప్రీతి కోసం కాక ఆత్మోద్ధరణ కోసం దానాలు చేశారు.

భౌతిక ప్రపంచంలో కొందరు సద్గుణవంతులు సైతం లోకం తమను ప్రశంసించాలన్న కోరికతో మంచి పనులు చేస్తారు. భగవంతుణ్ని మెప్పించాలని చేసే కార్యాలలో దైవప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. ప్రేమను ప్రేమ కోసం పంచేవారు దైవ సమానులు. భగవంతుడి తదుపరి స్థానం దైవీ గుణాలు సంతరించుకున్న మహాత్ములది. సుఖాలను ఆశించి దాన్నే నిజమైన ప్రేమగా భావించి మనిషి తనను తాను మోసం చేసుకుంటాడు. మానవ జీవితం ఓ పుష్పం వంటిది. అందులో అంతర్లీనంగా ఉండే మకరందం ప్రేమ అంటాడు ఓ కవి.

మనిషి అందగాడైనా, కురూపైనా తనను తాను ప్రేమించుకుంటాడు. అలా కాని పక్షంలో బతుకుబండి ముందుకు సాగదు. నయం కాని రోగాలతో దేహం కునారిల్లుతున్నా మనిషికి శరీరంపై ప్రేమ తగ్గదు. లోకాన్ని నడిపించే ఏకైక సాధనంగా భగవంతుడు ప్రేమను సృష్టించాడంటారు తాత్వికులు. ప్రేమ అనే మహత్తర లక్షణాన్ని లోకంలో నిక్షిప్తం చేయగా అది దైవానికి మారుగా లోకాన్ని నడిపిస్తుందని పండితుల భావన. భగవంతుడు ఇష్టపడే ప్రేమను సాధకులు భక్తి రూపంలో అర్పిస్తారు. ప్రేమ లేకుండా మనిషి లేడు. ప్రాణికోటి లేదు. సూర్యుడు లోకంపై ప్రేమతో ప్రాణాలు నిలుపుతాడు. మేఘాలు ప్రేమతో వర్షిస్తాయి. ధరిత్రి ప్రేమతో ఆహారాన్ని అందిస్తుంది.

ప్రేమకు ఎల్లలు లేవు. ఆకాశమంతా ప్రాణవాయువు నిండి ఉన్నట్లుగా ప్రేమ లోకమంతా వ్యాపించి లోకాన్ని నడిపిస్తుంది. ప్రేమే దైవం అన్నారు. లోకాన్ని ప్రేమించే వ్యక్తి నేరాలు చేయలేడు. సుఖాలకు బానిసై లౌకికమైన ప్రేమను ఆరాధించడం కాక దైవీగుణాలతో కూడిన ప్రేమను సొంతం చేసుకోవాలి. భగవంతుడికి ప్రీతిపాత్రుడు కావాలి. ప్రేమాస్పదుడుగా మనిషి మారాలి. తాను తరించి లోకాన్ని తరింప జేయాలి.

గోపాలుని రఘుపతిరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని