జీవనరాగం

భూమ్మీదగల ప్రాణులన్నింటిలో మానవుడే సృష్టికర్తకు ప్రీతిపాత్రుడనిపిస్తుంది. మిగతా జీవులకు కేవలం ఆహారాన్ని సంపాదించుకోగల అవయవ సంపదను ఇచ్చిన పరమాత్మ- మనిషికి ఎన్నో ఇతర సౌకర్యాలను సమకూర్చుకోగల మేధాసంపత్తిని వరంగా ప్రసాదించాడు.

Published : 06 Feb 2024 00:34 IST

భూమ్మీదగల ప్రాణులన్నింటిలో మానవుడే సృష్టికర్తకు ప్రీతిపాత్రుడనిపిస్తుంది. మిగతా జీవులకు కేవలం ఆహారాన్ని సంపాదించుకోగల అవయవ సంపదను ఇచ్చిన పరమాత్మ- మనిషికి ఎన్నో ఇతర సౌకర్యాలను సమకూర్చుకోగల మేధాసంపత్తిని వరంగా ప్రసాదించాడు. నదులు, అడవులు, పర్వతాలు, వివిధ రకాల వృక్షాలు, లతలు మొదలైనవి సృష్టించి మనిషికి ఎంతో మేలు చేశాడు. మానవుడికి అసాధ్యమైన పనులను అవలీలగా చేయగల జంతుజాలాన్ని సృష్టించాడు. ఆహారానికి లోటులేకుండా చూశాడు.

ప్రకృతి ప్రసాదించిన వనరులతో ధరించడానికి వస్త్రాలు తయారుచేసుకున్న మానవుడు సౌకర్యవంతమైన నివాసానికి గృహాలు నిర్మించుకున్నాడు. భూమిపై లభించే సమస్త వనరులతోపాటు భూమిలోపల నిక్షిప్తమైన ఖనిజ సంపదను వెలికితీసి తన అవసరాలకు ఉపయోగించుకోగల శక్తిసామర్థ్యాలను మనిషి వరంగా పొందాడు. ఇంతటితో ఆగకుండా జీవనవిధానాన్ని తీర్చిదిద్దుకోగల వ్యక్తిత్వ వికాస బోధనలతో మనిషికి జ్ఞానోదయం కలిగించాలనీ సంకల్పించిన భగవంతుడు మానవరూపంలో భూమిపై అవతరించి స్వయంగా ధర్మాన్ని ప్రబోధించాడు. పరమేశ్వరుడైన తనను నిరంతరం అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామభావంతో సేవించేవారి యోగక్షేమాలను తానే వహిస్తానని అభయమిచ్చాడు. ఈర్ష్య భయం లేనివాడు, సర్వప్రాణుల పట్ల అవ్యాజమైన ప్రేమ, కరుణ, క్షమ వంటి ఉత్తమగుణాలతో మనోబుద్ధులను అర్పణ చేసిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడు ఉపదేశించాడు.

వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు రచించి ఈ ప్రపంచం సత్యం మీదనే ఆధారపడి నిలబడిందని వివరించాడు. మనిషి పాటించాల్సిన ఆచార విధులను తెలియజేశాడు. అధర్మ, అహంకార, అసత్యాలనే మూడు అకారాలు మనిషి పతనానికి కారణమవుతాయని బోధించాడు. శ్రీశంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం వంటి నిత్య పారాయణ స్తోత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చారు. ప్రతిదినం స్తోత్ర పఠనంతో తనను సృష్టించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకొనే అవకాశం కల్పించారు.

మానవుల రక్షణ కోసం కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. తాత, బామ్మ, అమ్మ, నాన్న, తమ్ముడు వంటి బంధాలు మానవుడికి మానసిక బలాన్నిస్తాయి. రెండు మూడు తరాలు కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఆనందంగా జీవించగలగడం మనిషికి లభించిన అపూర్వ వరం. ఇన్ని రకాలుగా నిర్విచారంగా, ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశాలు కల్పించినా సృష్టికర్త ఆశించిన రీతిలో సుగుణ శోభితుడై మనుగడ సాగించలేక మనిషి అనేక విధాలుగా బాధలను అనుభవిస్తున్నాడు. అసంతృప్తి అనే మనోవ్యాధితో ఉద్వేగభరితుడవుతున్నాడు. సంతృప్తి లేని జీవితం నరకప్రాయమని గ్రహించలేకపోతున్నాడు. ఆకాశానికి నిచ్చెనలు వేయాలనుకునే దురాశాపరులు నిత్య దుఃఖితులే. కోరికలకు కళ్లెం వేయగలిగినవాడే ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతాడు. నిజానికి సత్యవ్రతమే అత్యంత సులభమైనది. అబద్ధమాడటానికి ఎంతో ఆలోచించాలి. నిజం చెప్పడానికి క్షణం పట్టదు.

నీతిని నమ్ముకున్న నిజాయతీపరుడు ధైర్యంగా తలెత్తుకుని తిరగ్గలుగుతాడు. అందరినీ దూషించేవాడికి ఎందరో శత్రువులు. ఇతరుల్లో మంచిని గ్రహించేవాడికి అందరూ శ్రేయోభిలాషులే. అధర్మపథంలో ముళ్లపొదలుంటాయి. ధర్మాన్ని కాపాడేవాడిని పూలబాట స్వాగతిస్తుంది. ఇహలోకమే స్వర్గసీమగా మారుతుంది.

భగవంతుడు ఆశించిన రీతిలో జీవించేవాడు సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు. ఊపిరి ఉన్నంత కాలం ఊరికి ఉపకారి అవుతాడు. ఆయువు ఉన్నంత కాలం ఆపద్బాంధవుడవుతాడు. ఆపైనా చిరకాలం గౌరవ మన్ననలు పొందుతాడు.

ఇంద్రగంటి నరసింహ మూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని