వెలకట్టలేని సంపద

లోకంలో దొరికినదానితో తృప్తిపడేవారు కొందరు.  ఇంతకుమించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు. ఇంకాఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండూ కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి. తిన్నదాని తృప్తి భౌతికం. ఉన్నదానితో తృప్తి మానసికం.

Updated : 19 Feb 2024 06:21 IST

లోకంలో దొరికినదానితో తృప్తిపడేవారు కొందరు.  ఇంతకుమించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు. ఇంకాఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండూ కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం.

పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి. తిన్నదాని తృప్తి భౌతికం. ఉన్నదానితో తృప్తి మానసికం. అది మనిషి మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది. తృప్తి కలిగిన మనిషి మనసులో ఆనందం, ఆలోచనల్లో ప్రశాంతత, ముఖంలో చెరగని చిరునవ్వు, పలకరింపులో ప్రేమ ప్రస్ఫుటమవుతాయి.

మనిషికి ఏయే విషయాల్లో తృప్తి చెందాలి, ఎందులో కూడదు అనే వివేచన కావాలి. మనిషికి ముఖ్యంగా  అర్థ కామాల్లో తృప్తి ఉండాలి. ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించిన ధనంతో, ధర్మపత్నితో లభించిన సంసారసుఖంతో సంతుష్టి చెందాలి. లేకపోతే అసంతృప్తి అడ్డదారులు తొక్కిస్తుంది. అనర్థాలకు దారితీస్తుంది.

తృప్తికర జీవితం గడపాలంటే జీవన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. గంగానదిలో జలం ఎంత ఉన్నా నీ దోసిలిలో గ్రహించినదే నీది. కుండలో కూడు ఎంత ఉన్నా నీ కడుపు నింపింది మాత్రమే నీది. నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది. లభించినదాన్ని ఆనందంగా అనుభవిస్తూనే- అవి ఏవీ శాశ్వతం కాదు అనే  వైరాగ్య భావన కలిగి ఉండాలి. అది లేనప్పుడు ఆశలకు కోరికలకు అవధి ఉండదు. ఆనందం ఎండమావి అవుతుంది. తృష్ణ తీరదు, శాంతి ఉండదు.

కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితే తృప్తి, కొందరికి ఇతరుల అవసరాలు తీర్చి ఆనందం కలిగిస్తే తృప్తి. మౌలిక వనరులు అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని వెంపర్లాడటం ఎంత పొరపాటో, నిత్యశంకితులు దుష్టులు తృప్తి చెందనివారిని సంతోషపరచాలని ఆరాటపడటం కూడా అంతే పొరపాటు. క్షుద్బాధను దాహార్తిని తీర్చి ఆర్తులను, విద్యాదానంతో జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హవిస్సుతో దేవతలను, స్తుతులూ భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ని తృప్తి పరచవచ్చు. కాని, అవసరానికి అర్హతకు మించి ఆశపడే దురాశాపరుణ్ని తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు.

ఒకసారి, అజగరుడు అనే ముని ప్రహ్లాదుడితో  ‘లేదు అని ఎవరినీ అడగను, రాదేమో అని చింతించను, లభించినదాన్ని కాదనను. లేదనే ఖేదానికి గానీ ఉందనే మోదానికి గానీ లోనుకాకుండా సదా ఆనందంగా ఉంటాను’  అంటాడు. అలా సంతుష్ట స్వభావాన్ని అలవాటు చేసుకున్నవారికి అసంతృప్తి ఉండదు.

ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు. అసంతృప్తి జీవితంలో మాధుర్యాన్ని తగ్గిస్తుంది. ఉండటానికి ఒక గూడు, ఆహార సముపార్జనకు సరిపడా పని, అనుకూలవతియైన ఇల్లాలు, ఒద్దికగల పిల్లలు, మనసు విప్పి మాట్లాడుకునే నలుగురు స్నేహితులు,  జ్ఞానానికి సత్‌ కాలక్షేపానికి  మంచి పుస్తకాలు, ఆత్మీయత పంచుకునే బంధువులను, కలిగి ఉండటం కంటే మించిన జీవితం ఏముంటుంది?

కస్తూరి హనుమాన్నాగేంద్ర ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని