అన్నదాతల మహాపాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

అన్నం పెట్టే అన్నదాతకు భోజనం చేసేందుకు స్థలం దొరకలేదు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన వారికి నిలువనీడ కరవైంది. మహిళల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బయో టాయిలెట్లను రోడ్డుపై నిలిపేందుకు కూడా అనుమతివ్వలేదు

Updated : 02 Dec 2021 05:49 IST

సర్వేపల్లి నియోజకవర్గంలో వంటకు, వసతికి అమరావతి రైతుల ఇబ్బందులు

నెల్లూరు గ్రామీణ మండలం పాలిచర్లపాడు అడ్డరోడ్డు సమీపంలోని ఎస్‌ఎల్‌వీ ఎస్టేట్‌ వద్ద పొదలకూరు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు

ఈనాడు డిజిటల్‌ - నెల్లూరు: న్యూస్‌టుడే - పొదలకూరు: అన్నం పెట్టే అన్నదాతకు భోజనం చేసేందుకు స్థలం దొరకలేదు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన వారికి నిలువనీడ కరవైంది. మహిళల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బయో టాయిలెట్లను రోడ్డుపై నిలిపేందుకు కూడా అనుమతివ్వలేదు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు బుధవారం నెల్లూరు జిల్లాలో ఎదురైన అడ్డంకులివి. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.

నడిరోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్న అమరావతి రైతులు 
బసకు, వంటకు స్థలాలిచ్చే వారిపైనా వైకాపా శ్రేణులు ఒత్తిడి తీసుకురావడంతో.. పాదయాత్రలోని మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు సరైన స్థలం దొరక్కపోవడంతో రోడ్డుపైనే కూర్చొన్ని అన్నం తిన్న రైతులు.. కన్నీటి పర్యంతమయ్యారు. ‘30 రోజులుగా పాదయాత్ర చేస్తున్నా ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేవు. టెంట్లు, వంట సామగ్రి లాగిపడేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంతూరు తోడేరు సమీపంలోనే అన్నదాతలు రోడ్డుపై భోజనం చేసే పరిస్థితి కల్పించారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. పోలీసులు టాయిలెట్లు పీకేశారు. అత్యవసర పరిస్థితుల్లో చెట్లు, పుట్ల పక్కకు వెళ్లలేక సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకెళతాం.. అమరావతి రాజధాని కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని స్పష్టం చేశారు.  

భోజనం చేసేందుకు కూడా స్థలమివ్వకుండా తమపై కక్షసాధిస్తున్నారంటూ కన్నీరు పెడుతున్న అమరావతి మహిళా రైతు

స్థలాలిచ్చే వారికి బెదిరింపులు
సర్వేపల్లి నియోజకవర్గంలో అమరావతి రైతులకు ఉండేందుకు, వండుకునేందుకు స్థలం ఇచ్చిన వారిని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని ఐకాస సభ్యులు ఆరోపించారు. పొదలకూరు సమీపంలోని వేబ్రిడ్జి దగ్గర బుధవారం భోజన ఏర్పాట్లు చేసేందుకు ఐకాస సభ్యులు తొలుత నిర్ణయించారు. ముందు సమ్మతించిన కాటా నిర్వాహకులు తెల్లారేసరికి మాట మార్చారు. దీంతో ఓ రైతు నివాస స్థలంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ చోటు చాలకపోవడంతో చాటగొట్ల దగ్గర రోడ్డుపైనే కూర్చొని భోజనం చేశారు. వాహనాల దుమ్ము, మురుగు దుర్వాసన మధ్యనే అర్ధాకలితో భోజనం ముగించారు. తింటున్నంతసేపు మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర 31వ రోజు ఉద్రిక్తతలు, భావోద్వేగాల మధ్య సాగింది. ఉదయం పారిచెర్లపాడు సమీంలోని ఎస్‌ఎల్‌వీ వెంచర్స్‌ దగ్గర పాదయాత్రకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆహ్వానం పలికిన తర్వాత.. వాహనాలు రోడ్డుపైకి వచ్చే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. యాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలకు న్యాయస్థానం అనుమతి లేదంటూ నిలిపివేశారు. ఆగ్రహించిన గురైన రైతులు, ముస్లిం, క్రైస్తవ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మద్దతు తెలిపే వారిని అడ్డుకోమని కోర్టు చెప్పలేదనీ, మతాచారాలను కించపరిచేలా పోలీసులు వ్యవహరించడం తగదనీ మండిపడ్డారు. అమరావతి రాజధాని అందరిదీ అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు పారుతుండటంతో.. భారీ వాహనాలన్నింటినీ పొదలకూరు-నెల్లూరు రహదారి మీదుగా మళ్లించారు. అదే మార్గంలో రైతులు బైఠాయించి నిరసన తెలపడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులు ఆందోళన విరమించి పాదయాత్ర కొనసాగించారు.

పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి బసకు చోటు దొరక్క కంకరపై కూర్చున్న మహిళా రైతులు

టాయిలెట్లు తీసేయమని చెప్పలేదు
పాదయాత్రలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను తీసేయాలని తాము చెప్పలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు అధికారి వివరించారు. జాతీయ రహదారిపై అడ్డంకుల దృష్ట్యా పొదలకూరు రోడ్డులో ట్రాఫిక్‌ పెరిగిందన్నారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డుపై నిలిపిన వాహనాలను ముందుకు పోనివ్వాలని మాత్రమే చెప్పామన్నారు.

రాత్రి బసకూ అవస్థలు
బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. సుమారు 12 కి.మీ. సాగి, మర్రిపల్లి వద్ద ముగిసింది. మరుపూరు నుంచి తోడేరు, పొదలకూరు మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆత్మకూరు, చేజర్ల మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. మరుపూరు దగ్గర బస చేసేందుకు స్థలం దొరక్కపోవడం, మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయోటాయిలెట్లను పోలీసులు తీసేయించడంతో వారు అవస్థలు పడ్డారు. దీంతోవారు అమరావతి రైతులు మళ్లీ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అంబాపురంలో నాలుగు రోజులుగా బస చేస్తున్న శాలివాహన ఫంక్షన్‌హాల్‌కే అమరావతి రైతులు చేరుకున్నారు. 400 కి.మీ.కు పైగా పాదయాత్ర చేస్తున్న అమరావతి ఆడపడుచులు అన్నం తినేందుకు చోటు దక్కకపోవడం దారుణమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్ర ప్రారంభం నుంచి లేని అభ్యంతరాలు ఒక్క సర్వేపల్లిలో నియోజకవర్గంలోనే వచ్చాయా? అని ప్రశ్నించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని