ఇబ్బందులున్నా బడ్జెట్‌ ప్రకారమే చేస్తున్నాం

‘‘బడ్జెట్‌ కేటాయింపులకు-ఖర్చులకు పొంతన లేదనడం సరికాదు. బడ్జెట్‌ అమలు చేసేందుకు ఫిస్కల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Published : 29 Jan 2022 03:15 IST

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఈనాడు, అమరావతి: ‘‘బడ్జెట్‌ కేటాయింపులకు-ఖర్చులకు పొంతన లేదనడం సరికాదు. బడ్జెట్‌ అమలు చేసేందుకు ఫిస్కల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాల డిమాండ్‌ అర్థరహితం. ఇలాంటి కౌన్సిల్‌ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే తోసిపుచ్చింది. కాగ్‌, ఆర్థిక సంఘం, గణాంకాల సంస్థ ఉండగా ఫిస్కల్‌ కౌన్సిల్‌ ఎందుకు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి పార్లమెంటులోనే పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారమే బడ్జెట్‌ను అమలు చేస్తున్నాం’’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి బుగ్గన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు కొన్ని...

* 2020-21ని సాధారణ సంవత్సరాలతో పోలుస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదు. కరోనా వల్ల ఆ ఏడాది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఆదాయం రూ.8,000 కోట్లు తగ్గింది. కరోనా చికిత్సలకు రాష్ట్రం రూ.7,120 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది.

* ఆ ఏడాది రూ.18,797.38 కోట్ల మూలధన వ్యయం చేశాం. 2019-20లో రూ.12,242 కోట్లు మూలధన వ్యయం చేశాం. తెదేపా హయాంలో మూలధన వ్యయం ఎంత చేశారో చెప్పాలి.

* ఈ ప్రభుత్వ హయాంలో ఇంతవరకు రూ.1,20,000 కోట్లు డీబీటీ పద్ధతిలో పేదలకు బదిలీ చేశాం. ఇంత సంక్షేమం గతంలో ఎన్నడూ జరగలేదు. దేశంలో మరెక్కడా కూడా సంక్షేమం కోసం ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం లేదు. పేదలకు సంక్షేమ పథకాలతో ద్రవ్యలోటు పెరుగుతోందనడం సరికాదు.

* వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు మెచ్చుకుని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నాయి.

* తెదేపా హయాంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని మేం గాడిలో పెడుతున్నాం. తెదేపా ప్రభుత్వం అదనంగా చేసిన అప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.17,923 కోట్ల మేర నిలుపుదల చేసింది. తెదేపా హయాంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని