Chandrababu: చంద్రబాబు అరెస్టు.. అర్ధరాత్రి నుంచి ఎప్పుడేం జరిగిందంటే?

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.

Updated : 09 Sep 2023 09:16 IST

నంద్యాలలో అనుక్షణం హైటెన్షన్‌
పలువురి తెదేపా నాయకులు, కార్యకర్తల అరెస్టు
చంద్రబాబు బస చేసిన బస్సు అద్దాలు బాదిన పోలీసులు
5.30 గంటల ప్రాంతంలో కిందికి దిగిన బాబు

ఈనాడు - కర్నూలు : అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ వార్తలు రావడం.. అనంతపురం నుంచి ఆరు బస్సుల్లో భారీగా పోలీసులు రావడం.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేస్తారన్న సమాచారం అందుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా చంద్రబాబునాయుడు బస చేసిన ఆర్‌.కె.ఫంక్షన్‌ హాలు వద్దకు చేరుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు పోలీసులు వెళ్లే ప్రయత్నం చేశారు. నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో ఎందుకు వచ్చారని తెదేపా నాయకులు ప్రశ్నించారు. మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. నేరుగా చంద్రబాబు నాయుడుకే చెబుతామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

దీనిపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంక్షన్‌ హాలు వద్ద అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చంద్రబాబునాయుడితో చర్చలు జరిపారు. మాజీ మంత్రి అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం చంద్రబాబు విశ్రమిస్తున్న బస వద్దకు చేరుకుని బస్సు అద్దాలు గట్టిగా తట్టారు. బాబు బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ తన హక్కులను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరితీయండి అని చెప్పారు. ఏ చట్టం ప్రకారం నన్ను అరెస్టు చేస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.

తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆధారాలు చూపాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా రిమాండు రిపోర్టులో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. దాదాపు గంటపాటు వాదప్రతివాదాలు జరిగాయి. అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మీరు మాతో విజయవాడకు బయలుదేరితే 15 నిమిషాల్లో మీరు కోరిన అన్ని పత్రాలు వాట్సాప్‌లో పంపిస్తామన్నారు. అనంతరం చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించి ఆయన భద్రతాదళం సమక్షంలోనే విజయవాడకు తీసుకెళ్లారు.

అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉత్కంఠ

‘బాబు స్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం తెల్లవారే వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నంద్యాలలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ను వందలాదిమంది పోలీసులు చుట్టుముట్టారు. 600 మందికిపైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. పట్టణాన్ని దిగ్బంధించారు. అడుగడుగునా చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బస చేస్తున్న ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ చుట్టూ ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. అనంతరం డీఐజీ రఘురామిరెడ్డి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అడ్డుగా బైఠాయించిన తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ఫంక్షన్‌ హాల్‌ లోపలికి ప్రవేశించారు. మొదట చంద్రబాబు ముఖ్య భద్రతాధికారితో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆయన నిద్రిస్తున్న బస్సు వద్దకు చేరుకుని నిద్రలేపేందుకు ప్రయత్నిస్తుండగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఠాణాకు తెదేపా నేతల తరలింపు

ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ ప్రాంగణం నుంచి తెదేపా కార్యకర్తలు, మీడియా ప్రతినిధులను దూరంగా పంపివేసిన పోలీసులు తర్వాత లోపల ఉన్న వారి వాహనాలనూ తొలగించారు. అనంతరం పోలీసు వాహనాలను లోపలికి తీసుకెళ్లారు. లోపల ఉన్న తెదేపా నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. చంద్రబాబు బస్సు వద్ద రక్షణగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి తదితరులను మహానంది ఠాణాకు తరలించారు. ఆ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

నేతల  ప్రతిఘటన

రాత్రి 3 గంటల సమయంలో అధికారులు చంద్రబాబును నిద్రలేపేందుకు ప్రయత్నించారు. డీఐజీ రఘురామిరెడ్డి, తెదేపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి.టి.నాయుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తలుపునకు అడ్డుగా నిల్చుని తీవ్రంగా ప్రతిఘటించారు. పగలంతా కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోయిన తమ నేత ప్రస్తుతం విశ్రమిస్తున్నారని చెప్పారు. ఇంత రాత్రి సమయంలో ఆయన్ను ఎందుకు నిద్రలేపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు  డీఐజీ స్పందిస్తూ మేం మీతో మాట్లాడటం లేదు. మాజీ ముఖ్యమంత్రి ముఖ్య భద్రతాధికారితో చర్చిస్తున్నాం. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారన్నారు. తెదేపా అధినేతను జిల్లాకు తానే ఆహ్వానించానని, మీరు ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడండని బీటీ నాయుడు చెప్పారు. తాము బస్సులోపల ఏం జరుగుతుందో తెలుసు కోవాలనుకుంటున్నాం. చంద్రబాబుతో మాట్లాడాలని భావిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఇందుకు నాయకులు, తెదేపా కార్యకర్తలు ససేమిరా అన్నారు.

బస్సునే లాక్కెళతాం..

చంద్రబాబును నిద్రలేపేందుకు తాము ఒప్పుకోమని తెదేపా నాయకులు స్పష్టం చేశారు. మీరు ఇలా అడ్డుకుంటే బాబు బస చేస్తున్న బస్సునే లాక్కెళతామని పోలీసులు బెదిరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విశ్రమిస్తున్న బస్సును లాక్కెళతామనడం అన్యాయమని కాలవ శ్రీనివాసులు, ఇతర తెదేపా నాయకులు ఖండించారు. మీరు ఏం చర్యలు తీసుకోవాలన్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఉదయం రావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని