Chandramohan: అస్తమించిన నట చంద్రుడు

తరాలు మారుతుంటాయి.. కథలు, సినిమాలు మారిపోతుంటాయి. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొస్తుంటాయి. ఎన్ని మారినా సరే... భిన్న రకాల పాత్రలతో ప్రతి తరానికీ చేరువగా మెలిగిన ఓ అరుదైన నటుడు చంద్రమోహన్‌.

Updated : 12 Nov 2023 06:41 IST

సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
రేపు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
ఈనాడు, హైదరాబాద్‌, ఫిలింనగర్‌, న్యూస్‌టుడే

తరాలు మారుతుంటాయి.. కథలు, సినిమాలు మారిపోతుంటాయి. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొస్తుంటాయి. ఎన్ని మారినా సరే... భిన్న రకాల పాత్రలతో ప్రతి తరానికీ చేరువగా మెలిగిన ఓ అరుదైన నటుడు చంద్రమోహన్‌. కథానాయకుడు... రెండో కథానాయకుడు... ప్రతినాయకుడు... హాస్యనటుడు... సహనటుడు...

..ఇలా పాత్ర ఏదైనా సరే.. పాదరసంలా అందులో ఇమిడిపోయి ప్రేక్షకులకి వినోదం పంచిన ఆల్‌రౌండర్‌ ఆయన. ఐదున్నర దశాబ్దాలు నటప్రయాణం కొనసాగించి... ఎన్నో విలక్షణ పాత్రల్లో ఒదిగిపోయిన చంద్రమోహన్‌ (80) ఇకలేరు. కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కి కన్నుమూశారు. ‘ఉదయం కిడ్నీ సమస్య తలెత్తింది. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రిలో చేర్చాక.. మాతో మాట్లాడారు. అంతలోనే ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు’. అని చంద్రమోహన్‌ మేనల్లుడు, సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ చెప్పారు. ఆయనకి భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర రచయితగా తెలుగువారికి సుపరిచితం. కుమార్తెలిద్దరూ వైద్యులుగా స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో చంద్రమోహన్‌ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాల్ని నిర్వహిస్తామని కృష్ణప్రసాద్‌ తెలిపారు.

‘రంగుల రాట్నం’తో పరిచయం

1943 మే 23న కృష్ణాజిల్లా, పమిడిముక్కలలో వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకి జన్మించిన ఏడో సంతానం చంద్రమోహన్‌. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ చేశారు. డిగ్రీ పూర్తి కాగానే ఏలూరులో వ్యవసాయ విస్తరణాధికారిగా ఉద్యోగం పొందారు. 1966లో బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ‘రంగులరాట్నం’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంతోనే నంది పురస్కారాన్ని అందుకున్నారు. సుదీర్ఘమైన నట ప్రయాణంలో ఆయన నాలుగు భాషల్లో 932 సినిమాలు చేశారు. అందులో 175 సినిమాల్లో కథానాయకుడిగా చేశారు. కథానాయకుడిగానే కాకుండా.. హాస్యనటుడిగా, సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా భిన్న రకాల పాత్రల్ని పోషించారు. ‘సుఖదుఃఖాలు’, ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’, ‘రాధాకళ్యాణం’, ‘మూడు ముళ్లు’, ‘కలికాలం’, ‘సగటు మనిషి’, ‘ఆదిత్య 369’... ఇలా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. చివరిగా ఆయన 2017లో ‘ఆక్సిజన్‌’ సినిమాలో నటించారు. ఆయనకి  సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బంధువులు. బాపు, కె.విశ్వనాథ్‌, బాలచందర్‌ తదితర అగ్రదర్శకులతో కలిసి చంద్రమోహన్‌ పనిచేశారు.

హీరోయిన్ల లక్కీ హీరో..

చంద్రమోహన్‌ పక్కన నటిస్తే చాలు... ఆ కథానాయిక స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతారనే సెంటిమెంట్‌ అప్పట్లో ఉండేది. వాణిశ్రీ, జయసుధ, శ్రీదేవి, జయప్రద, రేఖ తదితర ప్రముఖులు చంద్రమోహన్‌ సరసన నటించి తార స్థాయికి చేరారు. సహజనటనకి పెట్టింది పేరు చంద్రమోహన్‌. ఆయన కెరీర్‌లో డీ గ్లామర్‌ పాత్రలకీ తనదైన నటనతో జీవం పోశారు. తెరపైన పాత్రలే తప్ప తాను కనిపించాలని కోరుకోని నటుడు చంద్రమోహన్‌. ఆయన ఇక లేరని తెలియగానే చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు, తొలితరం వెండి తెర కథానాయకుడు చంద్రమోహన్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సంతాపం తెలిపారు. ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిందని ప్రధాని అన్నారు. చంద్రమోహన్‌ మరణం సినీ ప్రపంచంలో శూన్యతను మిగిల్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లమంది ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం, తెలుగు చిత్రసీమకు తీరని లోటని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. ఇంకా మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి సంతాపం తెలిపారు. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి బాధాకరమని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘ఎక్స్‌’ ద్వారా విచారం వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌ తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాల వారికీ చేరువయ్యారని. ఆయన ఆత్మకు శాంతి కలగాలని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సినీ ప్రముఖులు బ్రహ్మానందం, ఆర్‌.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్‌, పరుచూరి వెంకటేశ్వరరావు చంద్రమోహన్‌ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని