Balineni: అన్ని జిల్లాల్లోనూ భూ కబ్జాలున్నాయ్‌: బాలినేని

Updated : 21 Nov 2023 07:20 IST
ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భూ వివాదాలు, దురాక్రమణలు ఉన్నాయ్‌.. కానీ ఎక్కడా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు కాలేదు. ఏ జిల్లాలోనూ ప్రజాప్రతినిధులు విచారణ కోరిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో నేనొక్కడినే స్పందించా. ఒంగోలులో భూ అక్రమాలు నా దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడి సిట్‌ వేయించాను. నిందితులు ఎవరైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించా’ అని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను సిట్‌ వేయించిన తర్వాతే ప్రజలకు ధైర్యం వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసుల్లో తానెక్కడా జోక్యం చేసుకోనంటూ ఎస్పీతో చెప్పానని వివరించారు. ప్రస్తుతం ఒంగోలు భూకుంభకోణంతో ప్రమేయం ఉన్నవారిలో సుమారు 200 మంది ఊరొదిలి పారిపోయారని తెలిపారు. సిట్‌ దర్యాప్తు సజావుగా సాగుతోందని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రోజువారీ కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టుల్లో కొంత జాప్యం జరుగుతోందని వివరించారు. ఈ కేసులో ప్రతి నిందితుణ్నీ పోలీసులు అరెస్టు చేసి తీరుతారని స్పష్టం చేశారు. ఇకపై భూ దురాక్రమణలు చేయాలంటే బెంబేలెత్తిపోయేలా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే బాలినేని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని