కానుకల ఎర

ప్రచార పథకాలు పనికిరావని అనుకుంటున్నారో... ఐదేళ్ల పాలన వ్యర్థమైందని అర్థమైందో... ‘అన్న’ మాటల్ని జనం నమ్మడం లేదని గుర్తించారో... మళ్లీ పీఠమెక్కడానికి తాము సిద్ధమంటుంటే... ఓటర్లు దించటానికి సంసిద్ధమంటున్నారని తెలుసుకున్నారో... కారణం ఏదైనా వైకాపా మూకల్లో దింపుడుకల్లం ఆశలు మొదలయ్యాయి.

Updated : 09 Mar 2024 16:40 IST

ఊరూరా వైకాపా ప్రలోభాల దందా
ఓటర్లకు విస్తృతంగా తాయిలాల పంపకం
విచ్చలవిడిగా చీరలు, కుక్కర్లు, సెల్‌ఫోన్లు, నగదు పంపిణీ
ఆత్మీయ సమావేశాల పేరిట కుల, మత ప్రాతిపదికగా
ఓట్ల అభ్యర్థన ఈసీ హెచ్చరికలు బేఖాతర్‌
ఈనాడు - అమరావతి

ప్రచార పథకాలు పనికిరావని అనుకుంటున్నారో... ఐదేళ్ల పాలన వ్యర్థమైందని అర్థమైందో... ‘అన్న’ మాటల్ని జనం నమ్మడం లేదని గుర్తించారో... మళ్లీ పీఠమెక్కడానికి తాము సిద్ధమంటుంటే... ఓటర్లు దించటానికి సంసిద్ధమంటున్నారని తెలుసుకున్నారో... కారణం ఏదైనా వైకాపా మూకల్లో దింపుడుకల్లం ఆశలు మొదలయ్యాయి. అందుకే ఎన్నికల కమిషన్‌ హెచ్చరికలనూ బేఖాతరు చేస్తూ..
షెడ్యూల్‌కు ముందే ప్రలోభాలకు తెరతీశారు! ప్యాంట్లు, చొక్కాలు... చీరలు, కుక్కర్లు, సెల్‌ఫోన్లు, టీకప్పులు... ఇలా చిల్లర తాయిలాలతో కుల, మత సంఘాలకు ఎర వేస్తున్నారు! ఆంధ్రుల భవితవ్యాన్ని మళ్లీ అంధకారం చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు!

‘‘సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దు. భక్తులు, దైవ సంబంధాలను అవమానించవద్దు. ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదు. నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలి. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసే వాళ్లం. ఈసారి కఠినచర్యలు తీసుకుంటాం..’’ ఈ నెల 1న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన హెచ్చరికలివి. ఇలాంటివేవీ చెవికెక్కని అధికార వైకాపా నాయకులు రాష్ట్రంలో ప్రలోభాల దందాను విస్తృతం చేశారు. ఊరూరా చీరలు, ప్యాంట్లు, షర్టులు, కుక్కర్లు, టీ కప్పుల సెట్లు, మిఠాయిలు, సెల్‌ఫోన్లతోపాటు రూ.5-6 వేల నగదు పెట్టిన కవర్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. నెలన్నర రోజులుగా సాగుతున్న ఈ తంతును ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పరాకాష్ఠకు చేర్చారు. ఆత్మీయ సమావేశాల పేరిట కుల, మత సంఘాల సభ్యులను, ప్రతినిధులను కలుస్తూ మత ప్రాతిపదికన ఓట్లడుగుతున్నారు. ఈ బరితెగింపును అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్దగా ఏమీ చేయడంలేదని, సమావేశాలకే పరిమితం అవుతోందని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి. సందర్భమేదైనా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి మరీ సోదాలు చేస్తున్న పోలీసులు... అధికార పార్టీ నాయకులు బహిరంగంగా కానుకలను పంపిణీ చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని, కోడ్‌ అమల్లోకి రానంత మాత్రాన... ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ అక్రమాలను ఆపలేరా అంటూ నిలదీస్తున్నాయి.

అటు సమావేశాలు... ఇటు ఉల్లంఘనలు

కొన్నిరోజులుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం... కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు కోరడం నిషిద్ధమని చెబుతోంది. మతపరమైన, దైవపరమైన బోధనలతో ప్రచారం చేస్తే... ఐపీసీలోని సెక్షన్‌ 171సీ, 171ఎఫ్‌ కింద శిక్షార్హమనీ హెచ్చరిస్తోంది. మరోవైపు వైకాపా నాయకులు మాత్రం... మతం మాటున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో క్రైస్తవ పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రావాలంటూ వారితో ప్రార్థనలు చేయించారు. ఆ సమావేశానికి హాజరైన వారందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. సీఎం జగన్‌ మేనత్త వై.ఎస్‌.విమలారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ పాస్టర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ... జగన్‌ను ఆశీర్వదించాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ అయితే... ‘‘పుట్టుకతో క్రైస్తవులమైన మనమంతా... ఏసు బిడ్డ జగన్‌ను మరొకసారి ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి’’ అంటూ ఇటీవల పాస్టర్లను కోరారు. ఎన్నికల సంఘం కేవలం సమావేశాలకే పరిమితం కావడం, కేసులు నమోదు చేయకపోవడంతోనే అధికార పార్టీ నేతలు ఇలా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఎంపీ, ఎమ్మెల్యే చీరలు పంపించారు..

సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిల ఫొటోలు ముద్రించిన బ్యాగుల్లో చీరలు పెట్టి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు. ‘‘ఎంపీ, ఎమ్మెల్యే మీకు చీరలు పంపించారు. వారిని గుర్తించుకుని ఓటు వేయాలి’’ అంటూ ప్రచారం చేయించారు. ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవవేతనం, పారితోషికాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇది అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది. అంతేకాదు తమ విధుల్లో భాగంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశమున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రిసోర్స్‌పర్సన్‌లు, యానిమేటర్లకు సైతం వైకాపా నేతలు కానుకలు పంపిణీ చేస్తున్నారు.

  • విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఉరుకూటి రామచంద్రరావు (చందు) ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లకు కుక్కర్లు, రిసోర్స్‌పర్సన్లకు చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి, తుని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అయితే వాలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లకు రూ.7 వేల చొప్పున నగదు పంపిణీ చేశారు.
  • ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెలుగు యానిమేటర్లకు డిన్నర్‌, టీ కప్పుల సెట్లు పంపిణీ చేశారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావులు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, రిసోర్స్‌పర్సన్‌లకు కుక్కర్లు, చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ-వ్యాలెట్‌ల ద్వారా వాలంటీర్ల ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు. మైలవరం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు వాలంటీర్లకు చీర, స్వీట్‌ ప్యాకెట్‌, రూ.5 వేల నగదు పంపిణీ చేశారు. మైలవరంలో వైకాపాను మరోసారి గెలిపించేలా వాలంటీర్లు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు.
  • రాజానగరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ... సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు కానుకలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌, జక్కంపూడి రాజా ఫొటోలు ముద్రించిన సంచుల్లో వాటిని పెట్టి అందజేశారు.
  • ప్రజాప్రాతినిథ్య చట్టం-1951లోని సెక్షన్‌ 123 (7) ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లేదా వారి ప్రతినిధి ఎవరైనా ప్రభుత్వోద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందటం, పొందేందుకు యత్నించటం, కానుకలతో ప్రలోభపెట్టటం నేరం. అలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై ఈ సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు.

ఊరూరా అదే తంతు

  • విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్త, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణఇంటింటికీ చీరలు పంపిణీ చేశారు.
  • రాష్ట్ర మంత్రి, రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తరఫున ఆయన తనయుడు నియోజకవర్గవ్యాప్తంగా డిన్నర్‌ సెట్లను పంపిణీ చేస్తున్నారు. వీటిని తరలించేందుకు సమాచార, పౌరసంబంధాల శాఖ వాహనాల్ని వినియోగించుకుంటున్నారు.
  • బాపట్ల వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి తరఫున ఆయన కుటుంబీకుడు కోన వెంకట్‌... మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్టు బిట్లు పంపిణీ చేశారు.
  • అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేశారు.
  • మంత్రి రోజా నగరి నియోజకవర్గంలోని మహిళలకు మహిళా దినోత్సవ కానుక పేరిట చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు.
  • చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంక్రాంతి కానుకల పేరిట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుక్కర్లు అందజేశారు. వాటిపై సీఎం జగన్‌ ఫొటో, తన ఫొటోతోపాటు రాబోయే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేయనున్న తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఫొటో ముద్రించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీ చేయనున్న నేపథ్యంలో అక్కడా తాయిలాల పంపిణీ పెద్ద ఎత్తున సాగిస్తున్నారు.
  • ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేయడమంటే ఓట్లు కొనుగోలు కిందే లెక్క. ప్రజాప్రాతినిథ్య చట్టం-1951లోని సెక్షన్‌ 123 (1), ఐపీసీ 171బీ, 171ఈ ప్రకారం నేరం. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయొచ్చు. అధికారులకు మాత్రం ఇవేవీ పట్టట్లేదు.

విజయవాడలోనే చెప్పారు కదా...!

‘‘రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు తరలింపు, పంపిణీకి ఎక్కడా అవకాశం లేకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి. వివిధ రకాల ఆన్‌లైన్‌ వ్యాలెట్ల ద్వారా అక్రమంగా జరిగే నగదు బదిలీలపైనా గట్టి నిఘా ఉంచాలి. డబ్బు, మద్యంతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసే అవకాశమున్న వస్తువులను, వాటిని నిల్వ చేసే గోదాములు, ప్రాంతాలను గుర్తించి దాడులు చేయాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ జనవరి 10న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంత స్పష్టమైన ఆదేశాలిచ్చినా... రాష్ట్ర అధికారులు ఎక్కడా దాడులు చేయట్లేదు. ఓటర్లనుప్రలోభపరిచే కానుకల పంపిణీ ఉద్ధృతంగా సాగుతున్నా నియంత్రించట్లేదు.


విలేకర్లకు వైకాపా నేతల తాయిలాలు

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైకాపా నేతలు వివిధ వర్గాల ఓటర్లతో పాటు విలేకర్లకూ తాయిలాలతో ఎరవేస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ పరిధిలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకర్లకు రేపల్లె 13వ వార్డులోని వైకాపా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కార్యాలయంలో శుక్రవారం పట్టుచీర, ప్యాంటు, షర్ట్‌తో కూడిన కిట్‌ను అందించి అల్పాహార విందును ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పార్టీ స్థానిక నాయకులు మాట్లాడుతూ.. యాజమాన్య సిద్ధాంతాలు పాటించి, దినపత్రికల్లో వాస్తవాలు రాసి, పార్టీకి అనుకూలంగా సహకారం అందించాలని కోరారు. 10న మేదరమెట్లలో జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభ విజయవంతానికీ కృషి చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.


టెక్కలిలో.. మహిళా దినోత్సవం వేళ

టెక్కలి, న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తున్నవేళ అధికార పార్టీ నేతలకు అన్ని వర్గాలూ గుర్తొస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో స్వయంశక్తి సంఘాల మహిళలకు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, వైకాపా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ మహిళా దినోత్సవం పేరిట చీరలు పంపిణీ చేశారు. శుక్రవారం అక్కవరం సమీపంలోని దువ్వాడ శ్రీనివాస్‌ నూతన గృహ ప్రాంగణంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల నియోజకవర్గ స్థాయి పాత్రికేయులకూ దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. గత నాలుగేళ్లలో ఏనాడూ మహిళా దినోత్సవం నేతలకు గుర్తుకు లేదని, ఎన్నికల వేళ సవతి ప్రేమ ప్రదర్శిస్తున్నారని మహిళలు వ్యాఖ్యానించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని