డొక్కు బస్సులతో ప్రయాణికుల అవస్థలు

డబాడబా శబ్దాలతో రోతపుట్టిస్తూ, స్టీరింగ్‌, చక్రాలు ఊడిపోతూ, యాక్సిల్స్‌ విరిగిపోతూ.. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు.

Updated : 09 Mar 2024 06:16 IST

సీఎం రిబ్బన్‌ కటింగ్‌ కోసం కొత్త బస్సుల ఎదురుచూపులు
ఇప్పటికి 80 వచ్చినా రోడ్డెక్కించని అధికారులు

ఈనాడు, అమరావతి: డబాడబా శబ్దాలతో రోతపుట్టిస్తూ, స్టీరింగ్‌, చక్రాలు ఊడిపోతూ, యాక్సిల్స్‌ విరిగిపోతూ.. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. అసలే అధ్వానంగా ఉన్న రోడ్లతో బస్సులన్నీ డొల్లగా మారాయి. దూరప్రాంత సర్వీసులు కూడా ఘోరంగా తయారయ్యాయి. 12 లక్షల కిలోమీటర్లకే ఆపాల్సిన బస్సులను 15 లక్షల కిలోమీటర్లు దాటినా రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నారు. ఎట్టకేలకు కొత్త బస్సులు కొన్నారు. వాటిలో కొన్ని విజయవాడకు చేరుకొని రోజులు గడుస్తున్నా.. రోడ్డెక్కించలేదు. అదేమంటే సీఎం జగన్‌తో వాటిని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020 సంవత్సరంలో 300 కొత్త బస్సులు కొన్నారు. గత ఏడాది 1,500 బస్సులు కొన్నాక.. పలు సంస్థలకు బాడీ బిల్డింగ్‌కు ఇచ్చారు.

ఇందులో సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, అల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఉన్నాయి. బాడీబిల్డింగ్‌ యూనిట్లలో సిద్ధమవుతున్న బస్సులు కొద్దిరోజులుగా విజయవాడకు చేరుతున్నాయి. వీటిని విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్‌లో ఉంచుతున్నారు. ఇప్పటివరకు 80 బస్సులు వచ్చాయి. వీటిని వివిధ డిపోలకు కేటాయించి, అక్కడకు పంపి రోడ్లపై పరుగులు పెట్టించాలి. కానీ ఇంకా కేటాయించడంలేదు. అదేమంటే సీఎం జగన్‌ చేతుల మీదుగా వీటికి ప్రారంభోత్సవం చేయించాలని చూస్తున్నామని, ఆయన షెడ్యూల్‌ ఖాళీ లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు ఎలాగైనా ఆయనతో అన్ని బస్సులకూ ఒకేసారి రిబ్బన్‌ కటింగ్‌ చేయించాక జిల్లాలకు పంపుతామని పేర్కొంటున్నారు. ఓవైపు ప్రయాణికులు డొక్కు బస్సులతో ఇబ్బందులు పడుతుంటే, కొత్త బస్సులు వచ్చినా ఇలా ప్రారంభించకుండా పక్కనపెట్టడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి.

కొత్త బస్సులొచ్చాకే పల్లెవెలుగులకు మోక్షం

కొత్తగా కొనుగోలు చేసిన సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, అల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆయా డిపోలకు కేటాయించాక.. ఇప్పటికే ఉన్న ఇటువంటి దూరప్రాంత సర్వీసుల్లో అత్యధిక కి.మీ. తిరిగిన వాటిని పల్లెవెలుగు బస్సులుగా మారుస్తారు. ఇప్పటికే ఆయా డిపోల్లో ఉన్న పల్లెవెలుగు బస్సుల్లో పూర్తిగా డొల్లయిన వాటిని పక్కనపెడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని