ప్రధాని సభలో భద్రతా వైఫల్యం

ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated : 18 Mar 2024 08:40 IST

పల్నాడు ఎస్పీ తీరుపై విపక్షాల ఆగ్రహం
సభకు వచ్చిన జనానికి నరకయాతన
ప్రధాని.. ప్రతిపక్షనేత ఎవరైనా పోలీసుల తీరు ఒక్కటే!
ముఖ్య నేతలకు గ్యాలరీల్లోకి అనుమతి నిరాకరణ

ఈనాడు, అమరావతి: ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని సభలో జరిగిన తొక్కిసలాట, రభసే ఇందుకు నిదర్శనం. ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసా విసరడం, వేదిక ముందు తోపులాట చోటుచేసుకున్నా పట్టించుకోలేదు. వీవీఐపీ, మీడియా గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చుకువచ్చి తోపులాటకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. జనాన్ని నియంత్రించాలని ప్రధానమంత్రే చెప్పినా పోలీసుల్లో స్పందన లేదు. ప్రజలు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఉన్నా పోలీసులు వారికి దిశానిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశమార్గం వద్దకు పంపారు. ఇక్కడ అందరూ గుమిగూడటం, పాసులు ఉన్నవారు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వీవీఐపీలు సైతం బయటపడటానికి నానా అవస్థలు పడ్డారు. సభలోకి వెళ్లలేక వెనక్కి వచ్చి సాధారణ జనం ఉన్న గ్యాలరీల్లో కూర్చోవాల్సి వచ్చింది. కొందరు నేతలు వెనక్కి వచ్చేటప్పటికి గ్యాలరీలు నిండిపోవడంతో రోడ్డుపైనే నిలబడిపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుని సభకు రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పోలీసులు జనానికి సహకరించకపోగా ఉద్దేశపూర్వకంగా పలు ఇబ్బందులకు గురిచేశారు.

అనుమతులున్నా అడ్డంకులే

సభకు వచ్చిన ముఖ్యనేతలకు చేదు అనుభవం ఎదురైంది. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోలీసులతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన తెదేపా, జనసేన నేతలు పాస్‌లు చూపించినా వారిని లోపలికి అనుమతించలేదు. గ్యాలరీ పాస్‌ మాత్రమే ఉందని, వాహనానికి పాస్‌ ఏదంటూ కొందరిని చికాకు పెట్టారు. వాదించలేక కొందరు వెనుదిరిగారు. పలువురు నేతలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వేల సంఖ్యలో పోలీసుల్ని పిలిచి వారితో బందోబస్తు విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారు. సభకు వచ్చే వాహనాలను ప్రాంగణానికి చేర్చడంలో సరైన చర్యలు తీసుకోలేదు. భారీసంఖ్యలో ఐపీఎస్‌లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఏపీఎస్పీ, సివిల్‌, ఏఆర్‌ పోలీసులు ఇలా ఎంతోమంది హాజరైనా ఉపయోగం లేకుండా పోయింది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. మారని పోలీసుల తీరు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా పోలీసుల తీరు మారలేదు. బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభలో భద్రత నిర్వహణను గాలికొదిలేసిన పోలీసులు సభకు వచ్చినవారిపై దృష్టిపెట్టారు. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలవాటైన పనిని అంతే బాధ్యతగా ఆదివారం అమలు చేశారు. ప్రజాగళం సభకు వచ్చిన వాహనాలు, నేతలు, జనం వివరాలు సేకరించేలా ఫొటోలు తీశారు. సభలో ప్రతి గ్యాలరీలోనూ ఉంటూ ఇలా వివరాలు సేకరించడాన్ని పలువురు గుర్తించి ప్రశ్నించగా తాము పోలీసులమని చెప్పారు. ఎన్నికల కోడ్‌ వచ్చినా ఇంకా ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని