గవర్నర్‌ తమిళిసై రాజీనామా

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు.

Updated : 19 Mar 2024 05:40 IST

పుదుచ్చేరి ఎల్జీ పదవికి కూడా
రాష్ట్రపతికి సమర్పణ
అద్భుత రాష్ట్రానికి సేవ చేయడం ఆనందాన్నిచ్చింది..
తెలంగాణ ప్రజలకు భావోద్వేగ లేఖ
ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నానని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌, చెన్నై(ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. ఆమె 2019 సెప్టెంబరు 1న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి 16న పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.

పోటీ చేసే అవకాశం

తమిళిసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తన పదవికి ఆమె రాజీనామా సమర్పించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజీనామా అంశాన్ని ఆమె ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఒకవైపు జగిత్యాలలో భాజపా బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రధాని బయలుదేరి వెళ్లగానే.. తమిళిసై రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లేదా పుదుచ్చేరి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన నాలుగున్నరేళ్లలో ప్రజా సమస్యలపై ఆమె చురుగ్గా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడం, తిరస్కరించడంలో తనదైన ముద్రను చాటారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. గతేడాది వరంగల్‌ను వరదలు ముంచెత్తిన సందర్భంగా గవర్నర్‌ హోదాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. రెడ్‌క్రాస్‌ సంస్థ సహకారంతో బాధితులకు సాయం అందించారు. గత భారాస ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య చోటుచేసుకున్న పలు వివాదాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. 2023 డిసెంబరులో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో తమిళిసై స్నేహపూర్వకంగా కొనసాగుతూ వచ్చారు.

చిరస్థాయిగా తెలంగాణపై ప్రేమ..

తెలంగాణ ప్రజల పట్ల తన ప్రేమ చిరస్థాయిగా ఉంటుందని, అద్భుతమైన ప్రయాణంలో చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో తాను రాష్ట్రాన్ని వీడుతున్నానని తమిళిసై తెలిపారు. రాజీనామా చేసిన అనంతరం చెన్నైకి వెళ్తూ.. తెలంగాణ ప్రజలనుద్దేశించి సోమవారం లేఖ విడుదల చేశారు. ‘‘నేను తెలంగాణ గవర్నర్‌ పదవి నుంచి వైదొలుగుతున్నప్పుడు.. అనేక భావోద్వేగాల్లో మునిగిపోయా. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది. నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలు అక్కగా ఆదరించారు. మీ అచంచలమైన మద్దతు, ప్రేమ, ఆప్యాయత ఎంతగా నా హృదయాన్ని తాకాయో.. నేను మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నా. అందరం కలిసి రాష్ట్ర ప్రగతికి పాటుపడ్డాం. బోనాలు, బతుకమ్మ తదితర పండుగలు జరుపుకొన్నాం. మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నా. క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నా. అందుకే రాజీనామా చేశా. లోక్‌సభ ఎన్నికల్లో అధిష్ఠానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా. రాజీనామా నిర్ణయం గురించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు సమాచారం ఇచ్చా. నేను ఏం కోరుకుంటున్నానో వారికి తెలుసు’’ అని చెప్పారు. 2019లో ఆమె భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి పాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని