సాక్షాత్తు దేశ ప్రధాని వస్తే కనీస భద్రత కల్పించరా?

సీఎం జగన్‌ హెలికాఫ్టర్‌లో వెళుతుంటే, కింద రోడ్లపై ట్రాఫిక్‌ను ఆపే రాష్ట్ర పోలీసులు.. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభకు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారని తెదేపా, జనసేన, భాజపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 19 Mar 2024 03:20 IST

డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి అనర్హుడు
ప్రజాగళం భగ్నానికి ఇంటెలిజెన్స్‌ డీజీ, పల్నాడు ఎస్పీల యత్నం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూటమి నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ హెలికాఫ్టర్‌లో వెళుతుంటే, కింద రోడ్లపై ట్రాఫిక్‌ను ఆపే రాష్ట్ర పోలీసులు.. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభకు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారని తెదేపా, జనసేన, భాజపా నేతలు ధ్వజమెత్తారు. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయలేని రాజేంద్రనాథరెడ్డికి డీజీపీగా ఉండే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జనం వచ్చిన సభ విషయంలో వ్యవహరించే తీరు ఇలాగేనా అంటూ ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను ప్రశ్నించారు. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు కంటే.. కానిస్టేబుల్‌ సమర్థంగా పని చేస్తారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అనవసరంగా ఖాకీ చొక్కా వేసుకున్నారని.. ఆయన వైకాపా చొక్కా వేసుకొని తిరగాల్సిందని మండిపడ్డారు. కూటమి సభను ఎలాగైనా ఛిన్నాభిన్నం చేయాలని వైకాపా ప్రభుత్వం, పోలీసులు శాయశక్తులా ప్రయత్నించారని ఆరోపించారు. జగన్‌ సేవలో పునీతులవుతున్న రాజేంద్రనాథ్‌రెడ్డి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పాలరాజు, రవిశంకర్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణం వారిని విధుల్లోంచి తొలగించాలని కోరారు. ఈ మేరకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్‌, భాజపా నేతలు పాతూరి నాగభూషణం, షేక్‌ బాజీ, జనసేన నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, చిల్లపల్లి శ్రీనివాసరావులు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన ముకేశ్‌కుమార్‌ మీనా.. అన్ని అంశాల్నీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని విలేకర్ల సమావేశంలో మూడు పార్టీల నేతలు తెలిపారు.

దొంగ ఓట్లు వేస్తారు.. వేయిస్తారు

‘రాజేంద్రనాథ్‌రెడ్డి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పాలరాజు, రవిశంకర్‌రెడ్డిలు అవసరమైతే వైకాపాకు దొంగ ఓట్లు కూడా వేస్తారు.. వేయిస్తారు.. చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, అందులో ప్రధాని మోదీ పాల్గొంటారని ఈ నెల 12న డీజీపీకి లేఖ రాశాం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరాం. కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎల్‌ఈడీ పోల్స్‌పైకి ఎక్కిన వారిని దిగమని సాక్షాత్తు మోదీ విజ్ఞప్తి చేయాల్సిన దుస్థితి. ప్రధాని సభలో మైక్‌ పని చేయకపోవడం పోలీసుల వైఫల్యం కాదా.. ప్రజాగళం సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్‌ డీజీ, పల్నాడు ఎస్పీలు యత్నించారు. వైకాపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీలు అంటున్నారట.. పల్నాడు ఎస్పీ ముందే పారిపోతారు. వీరా ప్రజల్ని రక్షించేవారు. జగన్‌ సేవలో పునీతులవుతున్నారు’ అని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హెలిప్యాడ్‌ వద్ద మోదీకి స్వాగతం పలికే వారి పేర్లు ముందే ఇచ్చినా వారినీ వెళ్లనివ్వలేదు. బొకేలు, శాలువాల్ని అనుమతించలేదు. దేవుడి బొమ్మల్ని సైతం పక్కన పడేశారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పల్నాడు ఎస్పీ స్పందించలేదు. ఈ అంశాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం’ అని భాజపా నేత నాగభూషణం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని