మంత్రి ఆదేశించారు.. మేఘా పట్టుకెళ్లింది

ఎక్కడో నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో పైప్‌లైన్‌ వేసేందుకు... అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన పైపులను తీసుకెళ్లాలా? అంటే.. అరాచక వైకాపా ప్రభుత్వ హయాంలో ఏదైనా సాధ్యమేనని సమాధానం వస్తుంది.

Updated : 19 Mar 2024 06:54 IST

అమరావతి నుంచి భారీగా తాగునీటి పైపుల తరలింపు
రూ.20 కోట్ల విలువైన సామగ్రి డోన్‌కు
వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం తరలించేసిన గుత్త సంస్థ
అనుమతుల్లేకుండా నోటిమాటతో నడిచిన వ్యవహారం

ఈనాడు, అమరావతి: ఎక్కడో నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో పైప్‌లైన్‌ వేసేందుకు... అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన పైపులను తీసుకెళ్లాలా? అంటే.. అరాచక వైకాపా ప్రభుత్వ హయాంలో ఏదైనా సాధ్యమేనని సమాధానం వస్తుంది. అమరావతికి జగన్‌ ప్రభుత్వం మేలు చేయకపోగా అడ్డంకుల్ని సృష్టిస్తోంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మౌలిక వసతుల పనులను జగన్‌ ప్రభుత్వం ఆపడం ఓ ద్రోహమైతే.. ఆ పనుల కోసం తెచ్చిన సామగ్రిని వేరే పనికి గుట్టుగా తరలించడం మరో ద్రోహం. తాగునీటి పనులకు సంబంధించిన పైపులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు గుత్త సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే ఆఘమేఘాలపై వాటిని వేరేచోట చేసే పనులకు సంస్థ తరలించేసింది. ఆదేశించింది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కాగా.. పట్టుకెళ్లింది అస్మదీయ గుత్త సంస్థ మేఘా. ఎక్కడా రాతపూర్వక ఆదేశాలు లేకుండానే తతంగాన్ని నడిపించడం గమనార్హం.

రాజధానిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా..

రాజధానిలో వచ్చే 50 ఏళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని తాగునీటి కొరత తలెత్తకుండా కృష్ణా నుంచి తాగునీటి తరలింపునకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును రూపొందించారు. రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా భూగర్భంలో పెద్ద పైపులను వేసేందుకు 13 జోన్లుగా ప్యాకేజీల్ని విభజించి ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. ఓ ప్యాకేజీని మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో పనులు మొదలయ్యాయి. 2019లో జగన్‌ ప్రభుత్వం కొలువుదీరడంతో నిలిచిన పనులు మళ్లీ మొదలుకాలేదు. పనుల కోసం తెచ్చిన సామగ్రిని గుత్త సంస్థలు ఎక్కడికక్కడ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే నిల్వ ఉంచాయి.

బుగ్గన నియోజకవర్గానికి...

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల జిల్లా డోన్‌లో రూ.350 కోట్లతో ఇంటింటికీ తాగునీటిని అందించే వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి నియోజకవర్గంలోని గ్రామాలకు పైప్‌లైన్‌ ద్వారా నీటిని పంపింగ్‌ చేసేందుకు ప్రాజెక్టును ఉద్దేశించారు. ఈ పనిని మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ దక్కించుకుంది. అక్కడి అవసరాల కోసం అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన ఇదే సంస్థ ఆధీనంలో ఉన్న తాగునీటి పైపులను లారీల్లో తరలించారు. రూ.20 కోట్ల విలువైన ఒకటి, రెండు అడుగుల వ్యాసం ఉన్న ఇనుప పైపులను ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. మేఘాకు సామగ్రిని సరఫరా చేసినందుకు గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ బిల్లులు చెల్లించింది. రాజధాని అవసరాల కోసం వినియోగించాల్సిన సామగ్రిని ఇతర పనులకు తీసుకెళ్లేందుకు ఎటువంటి అనుమతులూ లేవు. కేవలం నోటిమాటతోనే తరలించేశారు. మంత్రి చెప్పారని తీసుకెళ్తున్నా సీఆర్డీఏ అధికారులు నోరు మెదపలేదు. ఆపే ప్రయత్నమూ చేయలేదు. అక్రమంగా సామగ్రిని తరలించిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని