2000 Note: ₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!

2000 Note Exchange: 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు ముగుస్తోంది. సెప్టెంబర్‌ 30 వరకు మాత్రమే బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవచ్చు.

Updated : 25 Sep 2023 13:12 IST

2000 Note Exchange ఇంటర్నెట్ డెస్క్‌: రెండు వేల రూపాయల నోట్ల (2000 Note) మార్పిడికి గడువు దగ్గరపడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. అంటే ఇంకా ఐదు రోజులే మిగిలుంది. ఒకవేళ ఇప్పటికీ ₹2 వేల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఆర్‌బీఐ క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. నోట్ల మార్పిడికి మే 23 నుంచి బ్యాంకుల్లో మార్చుకునేందుకు అనుమతిచ్చింది.

ఏదైనా బ్యాంకు శాఖలో ఒక రోజులో గరిష్ఠంగా రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అదే సాధారణ సేవింగ్స్‌ అకౌంట్లు, జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్లకు మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. ఒకవేళ ఒకే రోజు రూ.50 వేలకు పైబడి డిపాజిట్‌ చేయాల్సి వస్తే మాత్రం ఐటీ నిబంధనల ప్రకారం పాన్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నోట్ల మార్పిడికి స్లిప్‌ గానీ, ధ్రువీకరణ పత్రం గానీ అవసరం లేదని ఆర్‌బీఐ చెప్పినప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రం ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.

యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకా ఏమేం చేస్తోందంటే..?

వాస్తవానికి సెప్టెంబర్‌ 25 నుంచి 30 వరకు అంటే ఆరు రోజులు గడువు ఉన్నప్పటికీ.. మధ్యలో ఒక రోజు బ్యాంకులకు సెలవు వస్తోంది. అంటే 25, 26, 27 తేదీల్లో నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. 28న మిలాద్‌-ఉన్‌-నబి కారణంగా బ్యాంకులు పనిచేయవు. మళ్లీ 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆయా తేదీల్లో బ్యాంక్‌ పనివేళల్లో నోట్లు మార్చుకోవచ్చు. 

సెప్టెంబర్‌ 1 నాటికి 7 శాతం నోట్లు వెనక్కి రావాలని ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన 24 రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి? ఇంకా మొత్తంగా ఎన్ని చేరుతాయి? అనేది తెలియరావాలి. అలాగే, సెప్టెంబర్‌ 30 తర్వాత రూ.2వేల నోటు గురించి ఆర్‌బీఐ ఏం నిర్ణయం తీసుకుంటోందనేది ఆసక్తికరం. అయితే, నిర్దేశిత గడువు దాటిన తర్వాత కూడా  రూ.2 వేల నోటు లీగల్‌ టెండర్‌గా కొనసాగే అవకాశం ఉందని, లావాదేవీలకు అనుమతివ్వకుండా ఆర్‌బీఐ శాఖల వద్ద మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో డెడ్‌లైన్‌లోపు ఎందుకు మార్చుకోలేకపోయిందీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని