Tesla Bot: యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకా ఏమేం చేస్తోందంటే..?

Tesla Bot: టెస్లా (Tesla) కంపెనీ తాజాగా తమ సంస్థ నుంచి వస్తోన్న ‘హ్యుమనాయిడ్‌ రోబో’కు సంబంధించిన వీడియోను తమ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 25 Sep 2023 12:05 IST

వాషింగ్టన్‌: విద్యుత్‌ కార్లు, అటానమస్‌ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసిన టెస్లా (Tesla).. రోబోటిక్‌ రంగంలోనూ రాణించేందుకు సిద్ధమైంది. తమ సంస్థ తయారు చేసిన భవిష్యత్‌ హ్యుమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ (humanoid robot Optimus)కు సంబంధించిన వీడియోను ఆదివారం తమ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకుంది.

ఈ హ్యుమనాయిడ్‌ రోబో (humanoid robot Optimus) యోగా కూడా చేస్తోంది. వస్తువులను గుర్తించి వాటిని ఓ క్రమ పద్ధతిలో సర్దుతోంది. మనిషి మధ్యలో కలగజేసుకొని ఏవైనా మార్పులు చేసి పనిని మరింత కష్టతరంగా మార్చినా.. రోబో దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతోంది. యోగాలో వివిధ రకాల భంగిమలను ప్రదర్శిస్తోంది. తన కాళ్లు, చేతులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంది. టెస్లా కార్ల తరహాలోనే న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీడియో ఇన్‌పుట్‌ను క్షుణ్నంగా సమీక్షించి తదనుగుణంగా ఔట్‌పుట్‌ను అందిస్తోంది.

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఈ వీడియోపై స్పందించారు. హ్యుమనాయిడ్‌ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు చెప్పారు. ఈ రోబోకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. టెస్లా నుంచి మరో అద్భుతమైన పురోగతి అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ‘టెస్లాబోట్‌’గా పేర్కొంటున్న ఈ రోబో ఎప్పుడు వినియోగంలోకి తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని