Budget 2023: డిజిటల్‌ రూపాయికి ఏమిస్తారు..?

డిజిటల్‌ రూపాయికి సంబంధించిన కేటాయింపులు, ప్రతిపాదనలు ఈ సారి బడ్జెట్‌లో ఉండే అవకాశం ఉంది. భారత్‌ను డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

Published : 30 Jan 2023 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ కరెన్సీ దిశగా భారత్‌ ఇప్పుడే తొలి అడుగు వేసింది. గతేడాది సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని దేశానికి పరిచయం చేసింది. దీనిని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం సీబీడీసీ హోల్‌సేల్‌, సీబీడీసీ-రిటైల్‌ కరెన్సీలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. వీటిపై రానున్న బడ్జెట్‌లో కేంద్రం మరింత స్పష్టతను తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కరెన్సీ నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, పారదర్శకత ఉండటం ప్రధాన బలాలు. ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ ఫిన్‌డెక్స్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 67 కోట్ల మందికి బ్యాంక్‌ ఖాతాలున్నాయి. దీంతోపాటు 26 కోట్ల మంది యూపీఐ సేవలను వినియోగించుకొంటున్నారు. చూడటానికి ఇది పెద్ద సంఖ్యలా ఉన్నా.. భారత జనాభాలో కేవలం 20 శాతం మాత్రమే. అంటే బ్యాంకు ఖాతాలున్న వారిలో చాలా మంది డిజిటల్‌ యూపీఐకి మొగ్గడానికి ఇష్టపడటంలేదు. కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం భారీగా ఖర్చుపెడుతోంది. ఉదాహరణకు ప్రతి 500 రూపాయల నోటు ముద్రణకు రూ.2.94 పైసలు ఖర్చవుతుంది. 2019లో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం రూ.8,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ నుంచి కాగితపు నగదును పూర్తిగా తొలగించాడానికి డిజిటల్‌ రూపాయి ప్రధాన మార్గంగా మారనుంది.

కొవిడ్‌ వ్యాప్తి తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు డిజిటల్‌ కరెన్సీని ప్రారంభించడానికి యత్నాలు చేపట్టాయి. భారత ఆర్థిక మంత్రి గత బడ్జెట్‌ సమయంలో డిజిటల్‌ కరెన్సీని ప్రస్తావించారు. ఇందుకోసం 1934 ఆర్‌బీఐ చట్టాన్ని సవరించి ‘బ్యాంక్‌ నోట్‌’  నిర్వచనంలో మార్పులు చేసి డిజిటల్‌ రూపాన్ని కూడా జత చేశారు. గతేడాది చివర్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఇది విజయవంతమైతే వినియోగంలోకి తీసుకురావడంలో అతిపెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి బడ్జెట్‌ 2023లో ఆచరణాత్మక విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది.

* ప్రభుత్వ పథకాల కింద ఇచ్చే సొమ్ము, కీలక రంగాలకు ఇచ్చే రాయితీ మొత్తాలను డిజిటల్‌ కరెన్సీ రూపంలో బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ కరెన్సీని నిర్దిష్టమైన వాటి వద్ద వినియోగించుకోవాల్సి ఉండటంతో ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు తగ్గుతాయి.

* ప్రస్తుతం సీబీడీసీని రెండు రకాలుగా వాడేలా డిజైన్‌ చేశారు. హోల్‌సేల్‌ కరెన్సీని కొన్ని సంస్థలకే పరిమితం చేసిన కేంద్రం పర్యవేక్షిస్తుంది. అదే సమయంలో రిటైల్‌ కరెన్సీని అందరూ వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రకాలుగా డిజిటల్‌ కరెన్సీ నిర్వహణకు అవసరమైన వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి కేంద్రం సహకరించాలి. ఈ క్రమంలో శాఖల అభివృద్ధి, ఏటీఎంలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల ఏర్పాటకు సహకరించాలి.

* డిజిటల్‌ రూపాయి వాడకం విస్తరించడానికి ప్రీపెయిడ్‌ వాలెట్‌ ఆపరేటర్లు, గ్రామీణ ఫిన్‌టెక్‌ సంస్థలు, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను మధ్యవర్తులగా ప్రభుత్వం వాడుకోవచ్చు. యూపీఐ విస్తరణకు వాడినట్లే థర్డ్‌ పార్టీ పీఎస్‌పీలు, అవసరమైన సాఫ్ట్‌వేర్ల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్‌ రూపాయిని సృజనాత్మకంగా ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన నియమ నిబంధనలను ప్రకటించాలి.

* కొత్త డిజిటల్‌ కరెన్సీపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం  కృషి చేయాలి. ఈ దిశగా ప్రచారం కోసం నిధులను కేటాయించాలి. ఇప్పటికే నగదు ప్రధానంగా సాగే రంగాల్లో డిజిటల్‌ రూపాయిని వినియోగించేలా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు ఇచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వినియోగించుకొనేలా చేయాలి.

* డిజిటల్‌ రూపాయిని వినియోగంలోకి తెచ్చే సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. కొత్త వ్యవస్థను ఆసరగా చేసుకొని పుట్టుకొచ్చే మోసాలపై ప్రజలను చైతన్య పర్చాలి.

ముఖ్యంగా డిజిటల్‌ మోసాలను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసే అంశంపై బడ్జెట్‌లో దృష్టిపెట్టాలి. సామాన్య ప్రజలు వీలైనంత ఎక్కువగా వినియోగించుకొనేలా దీని పరిమితిని పెంచాలి. అంతేకాదు.. సమాంతర ఆర్థిక వ్యవస్థలు పుట్టుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గత బడ్జెట్‌లో డిజిటల్‌ కరెన్సీ ప్రస్తావించిన సమయంలో దాని గురించి ఎటువంటి కీలక అంశాలను కేంద్రం వెల్లడించలేదు. ప్రయోగాత్మకంగా మాత్రమే దానిని ప్రవేశపెట్టడంతో సరిపోయింది. కానీ, ఈ సారి డిజిటల్‌ కరెన్సీని సామాన్యప్రజలకు అందుబాటులోకి తెచ్చేట్లైతే పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకొని దానికి తగినట్లు బడ్జెట్‌ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు