Boeing: నాసిరకంగా బోయింగ్‌ విమానాల నిర్మాణం : ప్రజావేగు ఆరోపణలు

ఒకప్పుడు అమెరికా కీర్తి కిరీటంగా మెరిసిన బోయింగ్‌ (Boeing) ప్రతిష్ఠ మసకబారుతోంది. ఆ సంస్థకు చెందిన రెండు రకాల విమానాల నిర్మాణ సమయంలో ప్రమాణాలను పాటించడంలేదని ఓ ప్రజావేగు ఆరోపించాడు. ఆ లోపాలు తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చని వెల్లడించాడు.

Updated : 10 Apr 2024 12:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైమానిక రంగ దిగ్గజం బోయింగ్‌(Boeing)కు చెందిన రెండు ప్రతిష్ఠాత్మక మోడళ్లపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) రంగంలోకి దిగింది. ఆ కంపెనీకి చెందిన ఇంజినీర్‌ సామ్‌ సలేహ్‌పౌర్‌ బోయింగ్‌(Boeing) లోపాలను ఎత్తిచూపాడు. 777, 787 డ్రీమ్‌లైనర్‌ నిర్మాణ సమయంలో సంస్థ షార్ట్‌కట్లను వాడుతోందని పేర్కొన్నాడు. ఫలితంగా విమానాలు పాతబడేకొద్దీ ఈ లోపాలు అత్యంత ప్రమాదకరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను ఈ విషయాలను బహిర్గతం చేయడంతో కంపెనీ ప్రతీకారచర్యలకు దిగుతోందని ఆరోపించాడు. అతడు జనవరిలో నేరుగా ఎఫ్‌ఏఏకు ఫిర్యాదు పంపాడు. ఈ విషయాన్ని తాజాగా మంగళవారం బహిర్గతం చేశాడు. మొత్తం 400 వరకు బోయింగ్‌ 777 రకం విమానాలు, దాదాపు 1,000 డ్రీమ్‌లైనర్ల (787)లో ఈ సమస్యలు ఉన్నట్లు సామ్‌ వెల్లడించాడు. 

తన ఫిర్యాదులో ముఖ్యంగా రెండు లోపాలను ప్రస్తావించాడు. వాటివల్ల విమాన జీవితకాలం నాటకీయంగా పడిపోతుందని సామ్‌ అన్నాడు. ‘‘నేను బోయింగ్‌ను దెబ్బతీయడానికి ఈ ఫిర్యాదులు చేయలేదు. సంస్థను విజయవంతమైందిగా తీర్చిదిద్దడానికి, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను నివారించడానికి చేశాను. ప్రస్తుతం ఉన్న విధంగా ఆ సంస్థ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. మరింత మెరుగుపడాల్సి ఉందనుకుంటున్నాను’’ అని తెలిపాడు.

దర్యాప్తులో భాగంగా సామ్‌ను ఎఫ్‌ఏఏ బృందం విచారించింది. ఈ సందర్భంగా ప్రజావేగుల నుంచి అందే అన్ని ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ‘‘లోపాలను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడమనేది వైమానిక రంగ భద్రతలో కీలకమైంది. ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమాచారాన్ని పంచుకోవడాన్ని మేం ప్రోత్సహిస్తాం’’ అని ఎఫ్‌ఏఏ తెలిపింది. మరోవైపు బోయింగ్‌ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ‘‘787 డ్రీమ్‌లైనర్‌ నిర్మాణ సమగ్రతపై చేసిన ఆరోపణలు సరైనవి కావు. దీర్ఘకాలిక సురక్షిత, నాణ్యతపై బోయింగ్‌ చేసిన కృషిని విస్మరించాయి’’ అని పేర్కొంది.

బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలు 2011లో సర్వీసులోకి వచ్చాయి. వీటి జీవితకాలం 50 సంవత్సరాలుగా అంచనావేశారు. 44,000 సార్లు ప్రయాణాలు చేసేలా తీర్చిదిద్దారు. సామ్‌ ఆరోపణల ప్రకారం విమానం అసెంబ్లింగ్‌ సమయంలో సిబ్బంది కారణంగా లోపాలు చోటు చేసుకొంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో తయారై వచ్చిన విడిభాగాల అనుసంధానం వేళ ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. ఫలితంగా విమానం వాడకం సమయంలో తొందరగా దెబ్బతినడం, జీవితకాలం పడిపోవడం, ప్రాణాంతక వైఫల్యాల వంటివి చోటు చేసుకొనే ప్రమాదం ఉందన్నారు.

ఆరోపణలు ఇదే తొలిసారి కాదు..

డ్రీమ్‌లైనర్లపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2021లో ఈ రకం విమానం డెలివరీలను నిలిపివేశారు. ఆ సమయంలో విమానంలో లోపాలను ఎఫ్‌ఏఏ, బోయింగ్‌ పునః పరిశీలించాయి. నిర్మాణ విధానంలో మార్పులు చేసినట్లు అప్పట్లో బోయింగ్‌ ప్రకటించడంతో డెలివరీలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా మరోసారి ఎఫ్‌ఏఏ తనిఖీలు చేసింది. తాజాగా సామ్‌ ఆరోపణలు, వెల్లడించిన లోపాలను చూసి దర్యాప్తు సంస్థ ఆశ్చర్యపోయినట్లు అతడి లాయర్‌ తెలిపారు. 

బదిలీ చేసిన చోట కూడా లోపాలే..

సామ్‌ ఆరోపణలతో ఆగ్రహించిన బోయింగ్‌ అతడిని 787 ప్రాజెక్టు నుంచి తప్పించి 777 ప్రోగ్రామ్‌కు బదిలీ చేసింది. చివరికి అక్కడ కూడా అతడు లోపాలను గుర్తించాడు. ముఖ్యంగా 777 విమానం విడిభాగాలను అనుసంధానించే వేళ ప్రమాణాలు పాటించకపోవడం, చేసిన పనిని ఎటువంటి తనిఖీలు లేకుండా ఆమోదించేలా ఇంజినీర్లపై ఒత్తిడి తేవడం వంటివి చోటు చేసుకొంటున్నట్లు గమనించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని