చిన్న మొత్తాల పొదుపు పథకాలకు.. ఆధార్‌, పాన్‌ తప్పనిసరి

చిన్న పొదుపు పథకాల్లో ప్రవేశపెట్టిన మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలకు పాన్, ఆధార్‌ తప్పనిసరి చేసింది.

Updated : 01 Apr 2023 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. ఈరోజు (ఏప్రిల్‌1) నుంచి కేంద్రం తెచ్చిన కొత్త నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ పాన్ అనుసంధాన గడువును పెంచిన కేంద్రం మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇకపై పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు పాన్‌, ఆధార్‌ కార్డ్‌ను తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

దీని ప్రకారం.. ఇకపై చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలంటే పాన్‌, ఆధార్‌ ఉండాల్సిందే. ప్రజా భవిష్య నిధి (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ (SCSS), పోస్టాఫీస్‌ సేవింగ్‌ స్కీమ్‌.. ఇలా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. ఇక, ఈ పొదుపు ఖాతాల్లో పెట్టబడులు నిర్ణీత పరిమితిని దాటితే పాన్‌కార్డ్‌ అందించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

ఆధార్‌ నంబర్‌ లేకుండా ఈ ఖాతాలు తెరిచిన చందాదారులు 2023 సెప్టెంబర్ 30 లోగా సంబంధిత కార్యాలయాల్లో ఆధార్‌కార్డ్‌ సమర్పించాలని తెలిపింది. ఇకపై కొత్త ఖాతాలు ఓపెన్‌ చేసే వారు ఆధార్‌ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆధార్‌ లేకుండా కొత్త అకౌంట్‌ పొందితే ఖాతా తెరిచిన ఆరునెలల్లోగా సంబంధిత కార్యాలయంలో ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. అలాచేయకుంటే ఆరునెలల అనంతరం ఖాతాను స్తంభింపజేస్తారు. 

మరి పాన్‌కార్డ్‌ సంగతి

చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్‌కార్డ్‌ని సమర్పించాలి. ఆ సమయంలో పాన్‌ సమర్పించనట్లయితే, ఈ కింది సందర్భాల్లో ఖాతా తెరిచిన రెండు నెలల్లోపు సంబంధిత కార్యాలయంలో పాన్‌కార్డ్‌ తప్పనిసరిగా సమర్పించాలి.

ఖాతాల్లో రూ.50వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు

ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్‌ రూ.లక్ష దాటినప్పుడు 

ఒక నెలలో ఖాతా నుంచి జరిపిన లావాదేవీలు, ఉపసంహరణలు కలిసి రూ.10 వేలు దాటితే.. పాన్‌ను సమర్పించాలి.. అలా చేయకుంటే ఖాతాలు స్తంభింపజేస్తారు. తిరిగి పాన్‌ సమర్పించేంతవరకు అందులో ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీలుకల్పించరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు