Adani group: వీసాతో అదానీ గ్రూప్‌ జట్టు.. త్వరలో క్రెడిట్‌ కార్డ్‌..!

Adani group credit card: అదానీ గ్రూప్‌ నుంచి త్వరలో క్రెడిట్ కార్డు రానుంది. ఈ మేరకు ఆ సంస్థ వీసాతో జట్టు కట్టింది. ఇరు సంస్థలు ఓ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును లాంచ్‌ చేయనున్నాయి.

Published : 26 Jul 2023 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గౌతమ్‌ అదానీకి (Gautam Adani) చెందిన అదానీ గ్రూప్‌ (Adani group) నుంచి త్వరలో ఓ క్రెడిట్‌ కార్డు (Credit card) రానుంది. ఈ మేరకు ఆ గ్రూప్‌ అమెరికాకు చెందిన డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ వీసాతో (Visa) జట్టు కట్టింది. రెండు సంస్థలు కలిసి ఓ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును లాంచ్‌ చేయనున్నాయి. 40 కోట్ల మంది ట్రావెలర్లే లక్ష్యంగా ఈ క్రెడిట్‌ కార్డును తీసుకొస్తున్నట్లు వీసా సీఈఓ ర్యాన్‌ మెక్‌నెర్నీ పేర్కొన్నారు. ఈ కార్డులతో ఎయిర్‌పోర్ట్‌ సేవలతో పాటు రిటైల్‌, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసులను వినియోగించుకోవచ్చని తెలిపారు.

అదానీ గ్రూప్‌ ప్రస్తుతం భారత్‌లో ఏడు ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. ముంబయి, అహ్మదాబాద్‌ వంటి ప్రధాన ఎయిర్‌పోర్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు నవీ ముంబయి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును సైతం అదానీ గ్రూప్‌ అభివృద్ధి చేస్తోంది. త్వరలో ఇక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. మరిన్ని ఎయిర్‌పోర్టులను సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా అవతరించాలన్నది ఆ గ్రూప్‌ లక్ష్యం. మరోవైపు వీసా దాదాపు 200 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

కష్టాలు చుట్టుముట్టిన వేళ.. బైజూస్‌ రవీంద్రన్‌ కంటతడి!

కొవిడ్‌ అనంతరం ట్రావెల్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ డీల్‌ జరగడం గమనార్హం. ఇందులో భాగంగా తీసుకొచ్చే క్రెడిట్‌ కార్డు ద్వారా కస్టమర్లు సాధారణ లావాదేవీలతో పాటు ఆయా సంస్థలు అందించే సేవలు వినియోగించుకోవచ్చు. ఇందుకు గానూ వినియోగదారులకు కొన్ని ప్రయోజనాలను అందించనున్నారు. అదానీ గ్రూప్‌ ఇప్పటికే ట్రైన్‌మ్యాన్‌, క్లియర్‌ట్రిప్‌ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేసింది. అదానీ వన్‌ పేరిట వెబ్‌సైట్‌/ యాప్‌ నిర్వహిస్తోంది. ఇందులో విమాన బుకింగ్‌లు, రైలు టికెట్లు, హోటళ్ల బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డును తీసుకొస్తుండడం గమనార్హం. దేశీయంగా ఇప్పటికే ఐసీఐసీఐ- మేక్‌ మై ట్రిప్‌ కార్డ్‌, ఎస్‌బీఐ- యాత్ర, యాక్సిస్‌ బ్యాంక్‌- విస్తారా వంటి ట్రావెల్‌ ఆధారిత కో-బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని