Novel Jewels: నగల వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్‌

Novel Jewels: నావెల్‌ జెవెల్స్‌ పేరిట ఆదిత్య బిర్లా గ్రూప్‌ నగల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. సొంత నగల బ్రాండ్లతో కూడిన ప్రత్యేక రిటైల్‌ స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది.

Published : 06 Jun 2023 15:44 IST

దిల్లీ: ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్‌ (Aditya Birla Group) మంగళవారం కీలక ప్రకటన చేసింది. రిటైల్‌ నగల వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు తెలిపింది.

‘నావెల్‌ జెవెల్స్ (Novel Jewels)’ పేరిట ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ప్రకటించింది. సొంత నగల బ్రాండ్లతో కూడిన ప్రత్యేక రిటైల్‌ స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. వృద్ధికి అవకాశం ఉన్న కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడంలో భాగంగానే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు గ్రూప్ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా తెలిపారు.

డిజైన్‌ ఆధారిత, అధిక నాణ్యతతో కూడిన నగలకు భారత్‌లో గిరాకీ పెరుగుతోందని.. ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) తెలిపింది. లైఫ్‌స్టైల్‌ రిటైల్‌లో కంపెనీకి ఉన్న అనుభవం కస్టమర్ల ప్రాధాన్యతలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇప్పటికే తనిష్క్‌ పేరిట టాటా గ్రూప్‌, రిలయన్స్ జెవెల్స్‌ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ నగల వ్యాపారాల్లో ఉన్న విషయం తెలిసిందే. దేశ జీడీపీలో రత్నాభరణాల మార్కెట్‌ వాటా 7 శాతం. 2025 నాటికి ఆభరణాల మార్కెట్‌ 90 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని