Amazon: నీటిపై తేలియాడే స్టోర్‌ ప్రారంభించిన అమెజాన్‌

అమెజాన్‌ (Amazon) సంస్థ తమ తొలి నీటిపై తేలియాడే స్టోర్‌ను శ్రీనగర్‌ (Srinagar)లోని దాల్‌ సరస్సు(Dal Lake)లో ప్రారంభించింది. ఐ హ్యావ్‌ స్పేస్‌ కార్యక్రమం కింద ఈ స్టోర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

Published : 28 Jul 2023 21:09 IST

శ్రీనగర్‌: ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) మరో కొత్త స్టోర్‌ను ప్రారంభినట్లు ప్రకటించింది. అందులో కొత్తేముంది.. చాలా ప్రాంతాల్లో అమెజాన్‌ డెలివరీ స్టోర్లు ఉన్నాయనే కదా మీ సందేహం. మిగతా వాటితో పోలిస్తే.. ఇది కాస్త భిన్నం. నీటిపై తేలియాడుతూ.. కస్టమర్లకు సేవలందించడమే ఈ స్టోర్‌ ప్రత్యేకత. జమ్ము కశ్మీర్‌ (Jammu Kashmir) రాజధాని శ్రీనగర్‌ (Srinagar)లోని దాల్‌ సరస్సు(Dal Lake)లో ఈ స్టోర్‌ను అమెజాన్‌ సంస్థ ప్రారంభించింది. ఐ హేవ్‌ స్పేస్‌ (I Have Space) కార్యక్రమం కింద ఈ స్టోర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఇందుకోసం ముర్తజా ఖాన్‌ ఖాశీ అనే హౌస్‌బోట్‌ నడిపే వ్యక్తిని డెలివరీ ఏజెంట్‌గా నియమించింది. ఈయన తన పడవపై దాల్‌, నైగీన్‌ సరస్సు చుట్టు పక్కల ప్రాంతాల్లోని కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేస్తుంటాడని తెలిపింది. 

అమెజాన్‌ నుంచి ఫ్రీడమ్‌ సేల్‌.. తేదీలు, ఆఫర్లు ఇవే!

‘‘హౌస్‌బోట్‌తో నాకు సీజనల్‌గా మాత్రమే ఆదాయం ఉంటుంది. అందులో ఎక్కువ మొత్తం బోట్ నిర్వహణకే ఖర్చవుతుంది. దాంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. నేను అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తున్న సమయంలో నాకు ఈ అవకాశం లభించింది’’అని ముర్తజా తెలిపాడు. స్థానిక వ్యాపారాల వృద్ధికి, మార్కెట్‌ అనుసంధానతలకు అమెజాన్‌ తేలియాడే స్టోర్‌ ప్రతీకగా నిలుస్తుందని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్ అగర్వాల్‌ అన్నారు. అమెజాన్‌ సంస్థ 2015లో ఐ హేవ్‌ స్పేస్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా స్థానిక వ్యాపారులు, దుకాణదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో వస్తువులను డెలివరీ చేస్తుంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 420 నగరాలు, పట్టణాల్లో సుమారు 25 వేల మంది చిరు వ్యాపారులతో భాగస్వామ్యం నెలకొల్పినట్లు తెలిపింది. దీని వల్ల సంస్థ డెలివరీ నెట్‌వర్క్ మరింత అభివృద్ధి చెందుతుందని అమెజాన్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని