Amazon layoffs: ఏఐ ఎఫెక్ట్.. అమెజాన్‌ అలెక్సాలో కొలువులకు మంగళం

Job cuts in Amazon alexa: అమెజాన్‌ మరోసారి వందలాది ఉద్యోగులను తొలగించింది. ఈ సారి అలెక్సా విభాగంలో పనిచేస్తున్న వారిని ఇంటికి పంపింది.

Published : 18 Nov 2023 13:38 IST

Amazon layoffs | న్యూయార్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) మరోసారి ఉద్యోగులను (Job cuts) తొలగించింది. తన వాయిస్‌ అసిస్టెంట్ అలెక్సాలో (Alexa) వందలాది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధపై (AI) ఆ సంస్థ ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో ఈ తొలగింపులు చేపట్టడం గమనార్హం. ఈ మేరకు అలెక్సా, ఫైర్‌ టీవీ విభాగాల వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ రౌశ్‌ ఉద్యోగులకు శుక్రవారం లేఖ రాశారు.

మారుతున్న వ్యాపార ప్రాధాన్యతల్లో భాగంగా మరింత మెరుగ్గా రాణించే ప్రయత్నంలో కొన్నింటిలో మార్పులు చేపడుతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉత్పాదక పెంచడం, ఏఐపై దృష్టి సారించడం వంటివి అందులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘వందలాది’ ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఎంతమందిని తొలగిస్తున్నదీ స్పష్టంగా పేర్కొనలేదు. అమెజాన్‌ తాజా నిర్ణయంతో అమెరికా, కెనడా, భారత్‌లోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది.

చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు.. ఆ వెంటనే ఓపెన్‌ఏఐ సహ-వ్యవస్థాపకుడి రాజీనామా

ఏఐ టూల్స్‌పై పెద్ద పెద్ద కంపెనీలు ఆధారపడడం ఇటీవల కాలంలో పెరిగింది. ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. అమెజాన్‌ సైతం కొన్ని నెలలుగా ఏఐని వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలెక్సాలో జనరేటివ్‌ ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. మరోవైపు ఇప్పటికే అమెజాన్‌ సంస్థ గతేడాది చివర్లో, ఈ ఏడాది మొదట్లో దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. గేమింగ్, మ్యూజిక్‌ విభాగాల్లోనూ ఇటీవల కొన్ని కొలువులను తొలగించింది. ఇప్పుడు అలెక్సా కూడా ఆ జాబితాలో చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని