5G Services: 2023 డిసెంబరు నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలు: అంబానీ

టెలికాం రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు.

Updated : 01 Oct 2022 15:22 IST

దిల్లీ: దేశ టెలికాం రంగంలో కొత్త శకానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. దిల్లీలో శనివారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ -2022లో భాగంగా 5జీ సేవలను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సహా పలువురు టెలికాం రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రతి గ్రామానికీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

‘‘5జీ సేవలను మేం తీసుకొస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. టెలికాం రంగంలో నాయకత్వ పాత్ర పోషించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చెయిన్‌, మెటావర్స్‌ వంటి 21వ శతాబ్దపు సాంకేతికతకు ఇదే పునాది కానుంది’’ అని ముకేశ్ అంబానీ తెలిపారు. దేశ ప్రజలందరికీ అందుబాటు ధరల్లో 5జీ సేవలను అందించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమవుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2023 డిసెంబరు నాటికి దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎయిర్‌టెల్‌ 5జీ.. తొలుత 8 నగరాల్లో

అనంతరం భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్‌ సునిల్‌ మిత్తల్‌ మాట్లాడారు. తొలుత నాలుగు మెట్రో నగరాలు సహా 8 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దశల వారీగా వీటిని విస్తరించుకుంటూ 2024 మార్చి నాటికి దేశమంతా 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ‘‘ఈ రోజు చాలా ముఖ్యమైనది. టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. ఈ సేవలతో దేశ ప్రజలకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తాయి’’ అని మిత్తల్‌ తెలిపారు.

ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా కూడా ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొని ప్రసంగించారు. త్వరలోనే తమ 5జీ సేవల ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. టెక్‌ భాగస్వాములతో కలిసి ఈ సేవలను అందుబాటులో తీసుకొస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికి పెంచుకునేందుకు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని