Apple: డ్రాగన్‌ కొరికిన యాపిల్‌..! రెండు రోజుల్లో రూ.16 లక్షల కోట్లు ఆవిరి..!

డ్రాగన్‌ సెగకు యాపిల్‌ వణికిపోయింది. బీజింగ్‌ ఇటీవల తీసుకొన్న కొన్ని నిర్ణయాలతో వాల్‌స్ట్రీట్‌లో యాపిల్‌ షేర్లు బ్లడ్‌బాత్‌ చేశాయి. కొండంత కంపెనీ విలువ ఏకంగా 6శాతం కరిగిపోయింది. 

Updated : 08 Sep 2023 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA) టెక్‌ దిగ్గజం యాపిల్‌(Apple)కు చైనా (China) సెగ గట్టిగానే తాకింది. ఈ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్‌ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేరకు విలువ కోల్పోయాయి. ఇది కంపెనీ మొత్తం విలువలో సుమారు ఆరు శాతానికి సమానం. యాపిల్‌కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి. ఆ సంస్థ మొత్తం ఆదాయంలో 18 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. దీంతోపాటు యాపిల్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఫాక్స్‌కాన్‌కు చైనాలో అతిపెద్ద తయారీ యూనిట్‌ ఉంది. వాల్‌స్ట్రీట్‌లో అతిపెద్ద మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీల్లో యాపిల్‌ కూడా ఒకటి. దీని మార్కెట్‌ విలువ 2.8 ట్రిలియన్‌ డాలర్లు.

ఇటీవల చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్‌ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్‌ ఫోన్లూ వాడొద్దని సూచించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బాంబు పేల్చింది. ఇక ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీల ఉద్యోగులు కూడా యాపిల్‌ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశించే అవకాశం ఉందటూ ఆ మర్నాడే బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ 12న  ఐఫోన్‌-15 విడుదలకు ముందు వచ్చిన ఈ కథనాలు యాపిల్‌ పెట్టుబడిదారుల్లో భయాల్ని రేకెత్తించాయి. చైనా మాత్రం ఈ కథనాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

రూపాయి.. పడిపోయింది

బీజింగ్‌-వాషింగ్టన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలో తాజా కథనాలు ఆజ్యం పోశాయి. ఈ ఏడాది అమెరికా తన మిత్రదేశాలైన జపాన్‌, నెదర్లాండ్స్‌తో కలిసి చైనాకు చిప్‌ టెక్నాలజీ ఎగుమతులను నియంత్రించింది. దీనికి ప్రతిగా చైనా నుంచి పశ్చిమ దేశాల సెమీకండెక్టర్‌ పరిశ్రమకు సరఫరా అయ్యే రెండు కీలక  పదార్థాల ఎగుమతులను డ్రాగన్‌ నిలువరించింది. దీంతో పాటు దేశీయ చిప్‌ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఏకంగా 40 బిలియన్‌ డాలర్లను బీజింగ్‌ కేటాయించింది. అంతేకాదు.. ఇటీవల చైనాకు చెందిన హువావే సంస్థ అత్యాధునిక మేట్‌ 60 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. దీనిలో చైనాకు చెందిన ఎస్‌ఎంఐసీ తయారు చేసిన 5జీ కిరిన్‌ 9000ఎస్‌ ప్రాసెసర్‌ను వాడింది. ఈ పరిణామం చైనా టెక్నాలజీ పరిశ్రమలో మేలిమలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కూడా యాపిల్‌ షేర్ల పతనానికి కారణమై ఉంటుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని