Apple: యాపిల్‌కు ఎదురుదెబ్బ.. మరో కీలక ఎగ్జిక్యూటివ్‌ నిష్క్రమణ?

Apple: ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌ల డిజైన్‌లో కీలక పాత్ర పోషించిన టాంగ్‌ టాన్‌.. యాపిల్‌ నుంచి వైదొలగనున్నట్లు సమాచారం.

Updated : 11 Dec 2023 13:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) నుంచి మరో కీలక ఎగ్జిక్యూటివ్‌ వైదొలగనున్నట్లు సమాచారం. ఐఫోన్‌ (iPhone), యాపిల్‌ వాచ్‌ (Apple Watch) రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన టాంగ్ టాన్ (Tang Tan).. కంపెనీ నుంచి నిష్క్రమించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఆయన అందుబాటులో ఉండకపోవచ్చునని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది.

టాంగ్‌ టాన్‌ (Tang Tan) నిష్క్రమణ యాపిల్‌ (Apple)కు పెద్ద ఎదురుదెబ్బగా పలువురు టెక్‌ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలో ఆయన ప్రోడక్ట్‌ డిజైన్‌ విభాగానికి ఉపాధ్యక్షుడి హోదాలో పనిచేస్తున్నారు. యాపిల్‌ (Apple) ఉత్పత్తుల విక్రయాల్లో ఐఫోన్‌ (iPhone), యాపిల్‌ వాచ్‌లదే (Apple Watch) కీలక వాటా. కంపెనీ ఆదాయంలో దాదాపు సగం వీటి అమ్మకాల నుంచే వస్తోంది. టాంగ్‌ టాన్‌ వీటి రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఎయిర్‌పాడ్స్‌ డిజైన్‌లోనూ ఆయన తోడ్పాటు చాలా ముఖ్యమైందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆయన కృషి వల్లే కంపెనీ వృద్ధిలో వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ కీలకంగా మారాయని వెల్లడించాయి.

టాంగ్‌ టాన్‌ (Tang Tan) నేతృత్వంలోని ప్రోడక్ట్‌ డిజైన్‌ విభాగం ఉత్పత్తుల ఫీచర్లను నిర్ణయించడంలో చాలా కీలకంగా వ్యవహరించేదని కంపెనీలోని కొందరు వ్యక్తులు తెలిపారు. వాటి ఆకారం, లుక్‌ దగ్గరి నుంచి ఇంజినీరింగ్‌ వరకు అన్నీ టాంగ్‌ బృందమే నిర్ణయించేదని పేర్కొన్నారు. టచ్‌ ఐడీ, ఫేస్‌ ఐడీ, డిస్‌ప్లే వంటి హార్డ్‌వేర్‌ టెక్నాలజీస్‌ విభాగాధిపతి స్టీవ్‌ హోటెలింగ్ సైతం కంపెనీ నుంచి బయటకు వెళుతున్నారని ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. ఇలా తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఉన్నతోద్యోగులు వైదొలగడం యాపిల్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు