ChatGPT: చాట్‌జీపీటీ యూజర్ల డేటా లీక్‌.. డార్క్‌వెబ్‌లో అమ్మకానికి!

చాట్‌జీపీటీ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు సింగపూర్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. భారత్‌ సహా పాకిస్థాన్‌, బ్రెజిల్‌, వియత్నాం, ఈజిప్ట్‌ దేశాలకు చెందిన సుమారు లక్ష మంది యూజర్ల డేటాను హ్యాకర్లు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. 

Published : 22 Jun 2023 19:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌బాట్‌లను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూజర్లు అడిగే ప్రశ్నలకు ఈ ఏఐ చాట్‌బాట్‌లు (AI Chatbots) కచ్చితమైన సమాధానాలు ఇస్తుండటంతో ఎక్కువ మంది వీటి వినియోగానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఏఐ చాట్‌బాట్‌లతో కొందరు యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా రెప్లికా (ప్రతిరూపం)లను రూపొందించుకుని వాటితో సంభాషణలు సాగిస్తున్నారు. మరోవైపు చాట్‌జీపీటీ వంటి ఏఐ సాంకేతికతతో మానవాళి మనుగడకు ప్రమాదం ఉందని కొందరు టెక్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అభివృద్ధి చేస్తున్న సంస్థలు, యూజర్లు మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. తాజాగా చాట్‌జీపీటీపై కూడా సైబర్‌దాడి జరిగిందని సింగపూర్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీ (Group-IB) తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష మంది చాట్‌జీపీటీ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలిపింది. ఈ సైబర్‌దాడి కోసం ఇన్ఫో-స్టీలింగ్‌ మాల్‌వేర్‌ను ఉపయోగించినట్లు బ్లాగ్‌లో పేర్కొంది. ఈ మాల్‌వేర్ సాయంతో హ్యాకర్లు యూజర్ల బ్రౌజర్‌ డేటాతో పాటు బ్యాంక్‌ కార్డ్‌ల వివరాలు, క్రిప్టో వాలెట్‌ సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీ వంటి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. యూజర్లు తమ బ్రౌజర్ల నుంచి అధీకృతం కానీ వెబ్‌ లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా హ్యాకర్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టినట్లు గుర్తించామని గ్రూప్‌-ఐబీ వెల్లడించింది. దీనిపై చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) స్పందించాల్సి ఉంది.

హ్యాకర్ల వద్ద ఉన్న డేటాలో ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతానికి చెందిన యూజర్ల సమాచారం ఎక్కువగా ఉన్నట్లు గ్రూప్‌-ఐబీ బ్లాగ్‌లో పేర్కొంది. భారత్‌ సహా పాకిస్థాన్‌, బ్రెజిల్‌, వియత్నాం, ఈజిప్ట్‌ దేశాలకు చెందిన యూజర్ల సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలిపింది. ఈ వివరాలను హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు గ్రూప్‌-ఐబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ యూజర్లు తమ ఖాతాల పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవడంతో పాటు, టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA)ను ఎనేబుల్‌ చేసుకోమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని