Health Insurance: ఆరోగ్య బీమా పాలసీ క్లెయిం చేసేటప్పుడు ఏమేం కావాలి?

అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పడు కావాల్సిన పత్రాలు అన్ని ఒకచోట లేకపోతే ఇబ్బంది పడాల్సి రావచ్చు. అందువల్ల అప్పటికప్పుడు వెతుక్కోకుండా అన్నిపత్రాలను సకరించి ఒకచోట పెట్టుకోవడం మంచిది

Published : 03 Dec 2022 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న జీవన‌శైలి కార‌ణంగా వ్యాధుల బారిన ప‌డేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. చిన్న వ‌య‌సులోనే మ‌ధుమేహం, క్యాన్సర్‌, గుండెపోటు మొద‌లైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నవారెందరో ఉన్నారు. వీటికి దీర్ఘకాలిక చికిత్స అవ‌స‌రం. మరోవైపు ద్రవ్యోల్బణం కార‌ణంగా వైద్యానికి అయ్యే ఖ‌ర్చులు కూడా భారీగా పెరగ‌డంతో సుదీర్ఘకాలం చికిత్స కోసం చేసే ఖ‌ర్చులు పొదుపును హరిస్తున్నాయి. ఆరోగ్య బీమా మీ ఆర్థిక ప్రణాళిక దెబ్బతినకుండా పొదుపునకు రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా అత్యుత్తమ వైద్య చికిత్సను అందిస్తుంది. ఆసుప‌త్రి బిల్లు గురించి ఆందోళన చెందకుండా మాన‌సిక ధైర్యంతో వైద్యం చేయించుకోవ‌చ్చు. అయితే ఆరోగ్య బీమా తీసుకోవడంతోనే సరిపోదు. క్లెయిం సమయంలో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమే. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పడు కావాల్సిన పత్రాలు అన్నీ ఒకచోట లేకపోతే ఇబ్బంది పడాల్సి రావచ్చు. అందువల్ల అప్పటికప్పుడు వెతుక్కోకుండా అన్నిపత్రాలను సేకరించి ఒకచోట పెట్టుకోవడం మంచిది. కాబట్టి, క్లెయిం చేయాల్సి వస్తే, ఎలాంటి పత్రాలు సమర్పించాలనేది చూద్దాం.. 

ఆరోగ్య బీమా క్లెయిం సెటిల్‌మెంట్‌ కోసం కావాల్సిన పత్రాలు..
ఆరోగ్య బీమాను రెండు రకాలుగా క్లెయిం చేసుకోవచ్చు: 1. రీయింబర్స్‌మెంట్‌ 2. నగదు రహిత క్లెయిం

రీయింబర్స్‌మెంట్‌..

ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పుడు పాలసీదారుడు ముందుగా బిల్లు చెల్లించి ఆ తర్వాత బీమా సంస్థ వద్ద రీయింబర్స్‌మెంట్‌ క్లెయిం చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పత్రాలు:

  • పూర్తిగా పూరించి సంతకం చేసిన క్లెయిం ఫారం
  • ఐడీ ప్రూఫ్‌ (ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌)
  • ఇన్సురెన్స్‌ కార్డు
  • డాక్టర్‌ ఇచ్చిన మెడిల్‌ సర్టిఫికెట్‌
  • అనారోగ్యాన్ని నిర్దారించిన రిపోర్టులు
  • డాక్టర్‌ అందించిన చికిత్సకు సంబంధించిన పత్రాలు, ప్రిస్క్రిప్షన్‌, ఇతర ప్రతాలు
  • అంబులెన్స్‌ రసీదులు
  • ఒరిజినల్‌ ఫార్మసీ బిల్లులు
  • ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌) అవసరమైతే..
  • పాలసీ పత్రాల కాపీ
  • అవసరమైతే.. బీమా సంస్థ కోరిన ఇతర పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.

రీయింబర్స్‌మెంట్‌లో ఆసుపత్రి డిశ్చార్జ్ ఫైల్‌తోపాటు, అన్ని ఒరిజినల్‌ బిల్లులనూ బీమా సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చికిత్స అనంతరం వీటికి ఆసుపత్రి నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు అందించిన అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే బీమా సంస్థ  క్లెయిం మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది.

నగదు రహిత చికిత్స..

ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స కోసం ఆసుపత్రికి చెల్లించాల్సిన బిల్లు పాలసీదారుడు చెల్లించనవసరం లేదు. బీమా సంస్థ నేరుగా చెల్లిస్తుంది. అయితే, ఇందుకోసం బీమా సంస్థతో అనుసంధానమైన నెట్‌వర్క్‌ ఆసుపత్రిలోనే చేరాల్సి ఉంటుంది. 

  • అత్యవసరంగా ఆసుపత్రిలో చేరితే..24 గంటల్లోపు రిక్వెస్ట్‌ ఫారం ఇవ్వాలి. లేని పక్షంలో 4-5 రోజుల ముందుగానే రిక్వెస్ట్‌ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. 
  • పూర్తిగా నింపిన క్లెయిం ప్రీ-ఆథరైజేషన్‌ ఫారం
  • పాలసీదారుడి ఐడీ ప్రూఫ్‌ (ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌)
  • బీమా చేసిన వ్యక్తి ఇన్సురెన్స్‌ కార్డు

క్లెయిం ఫారం, ఇతర పత్రాలను బీమా సంస్థకు గానీ థర్డ్‌పార్టీ అడ్మినిస్ట్రేటర్‌కు గానీ అందించాల్సి ఉంటుంది. నగదు రహిత చికిత్సలో అనారోగ్యం, చికిత్సకు సంబంధించి అవసరమైన అన్ని పత్రాలు, చికిత్స వివరాలను, బిల్లులను మీరు పంపించాల్సిన అవసరం ఉండదు. చికిత్స అందించిన ఆసుపత్రి వారు పంపుతారు.

గుర్తుంచుకోండి..

బీమా సంస్థను అనుసరించి ఇవ్వాల్సిన పత్రాల్లో స్వల్పమార్పులు ఉండొచ్చు. బీమా సంస్థ అధికారిక వెబ్‌సైట్లో క్లెయిం ప్రాసెస్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. వాటిని చూడొచ్చు. లేదా నేరుగా బీమా సంస్థను అడిగి తెలుసుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిం సెటిల్‌మెంటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుకల్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని