Elon Musk: మస్క్‌ మరో ప్లాన్.. ట్విటర్‌కు పే వాల్‌.. ఇక నెల నెలా చెల్లించాల్సిందే!

X paid service: ఎక్స్‌ త్వరలో పెయిడ్‌ సర్వీసుగా మారబోతోంది. ఇకపై ఎక్స్‌ వాడాలంటే నెలకు కొంత మొత్తం చెల్లించాల్సిందే. ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated : 19 Sep 2023 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌లో (ప్రస్తుతం X) అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్‌ మస్క్‌ (Elon musk) మరో మార్పునకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ట్విటర్‌ పేరును (ఎక్స్‌), లోగోను సైతం మార్చేసిన మస్క్‌.. ఆదాయం పెంచుకోవడానికి కొత్త ప్లాన్‌ వేశారు. ఇకపై ఎక్స్‌ వాడాలంటే ప్రతి యూజర్‌ ఎంతో కొంత (Paywall) చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.

ఎక్స్‌ను వాడే వారు ప్రతి నెలా ‘స్వల్ప మొత్తం’ చెల్లించాల్సి ఉంటుందని మస్క్‌ (Elon musk) పేర్కొన్నారు. దీనికీ ఓ కారణం ఉందని తెలిపారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమని చెప్పారు. ప్రస్తుతం ఎక్స్‌లో 550 మిలియన్‌ నెలవారీ యూజర్లు ఉండగా.. సగటున రోజుకు 100-200 మిలియన్‌ పోస్టులు పెడుతుంటారని చెప్పారు. ఇందులో బాట్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. బాట్స్‌ను తొలగించాలంటే స్వల్ప మొత్తంలోనైనా ఫీజు వసూలు చేయడం అవసరమంటూ మస్క్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల బాట్స్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలవుతుందని మస్క్‌ చెప్పారు. ట్విటర్‌ కొనుగోలు సమయంలోనూ బాట్స్‌ గురించి మస్క్‌ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ముకేశ్‌ అంబానీ!

అయితే, ఎక్స్‌ వినియోగం కోసం నెల నెలా ఎంత మొత్తం ఫీజు విధించేదీ మాత్రం మస్క్‌ వెల్లడించలేదు. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడొచ్చు. ప్రస్తుతం ఎక్స్‌ ప్రీమియం (గతంలో బ్లూ సబ్‌స్క్రిప్షన్‌) తీసుకోవాలంటే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్‌ యూజర్లు అయితే నెలకు రూ.650 చెల్లిస్తే సరిపోతుంది. తాజా ప్రకటన ప్రకారం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని వారూ ఇకపై ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికి ట్విటర్‌ను వినియోగించే ప్రతి యూజర్‌ నుంచి ఎంతో కొంత వసూలు చేయాలన్నది మస్క్‌ ఆలోచనలా కనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు