Twitter: ట్విటర్‌ కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నా: ఎలాన్‌ మస్క్‌

టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Updated : 09 Jul 2022 07:24 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విటర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విటర్‌ ఉల్లంఘించిందని, దీంతో ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని గత కొంత కాలంగా ఆయన చెబుతూ వస్తున్నారు. ట్విటర్‌ చెప్పిన దానికంటే స్పామ్‌ ఖాతాలు నాలుగింతలు అధికంగా ఉన్నాయంటోన్న ఆయన.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే తాను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించానని గతంలో పేర్కొన్నారు. ఆ విషయం తేలేవరకు కొనుగోలు ఒప్పందం ముందుకు వెళ్లదని ఎలాన్‌ మస్క్‌ పలుమార్లు స్పష్టం చేశారు. 

మరోవైపు విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు యోచిస్తోందని ట్విటర్‌ ఛైర్మన్‌ బ్రెట్‌ టెయిలో పేర్కొన్నారు. ‘మస్క్‌తో అంగీకరించిన ఒప్పందాన్ని నిబంధనల ప్రకారం రద్దు చేయడానికి ట్విటర్‌ బోర్డు కట్టుబడి ఉంది’ అని ఆయన చెప్పారు. అయితే, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం.. ఏదైనా కారణంగా మస్క్‌ ఒకవేళ లావాదేవీని పూర్తి చేయకపోతే 1 బిలియన్‌ డాలర్లను బ్రేక్‌ అప్‌ ఫీజు(పెనాల్టీ) కింద కట్టాల్సి ఉంటుంది.

కాగా.. గత ఏప్రిల్‌లో ట్విటర్‌ కొనుగోలు చేసేందుకు మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. అయితే స్పామ్‌, నకిలీ ఖాతాల గురించి సరైన సమాచారం ట్విటర్‌ ఇవ్వడం లేదని గత మే నెలలోలో ఈ డీల్‌ను ముందుకు వెళ్లకుండా మస్క్‌ తాత్కాలికంగా  నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి సమాచారం వచ్చేవరకు ఇది ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. ట్విటర్‌ తమకు పూర్తి సమాచారం ఇవ్వడంలో విఫలమైందని మస్క్‌ తరఫున న్యాయవాదులు యూఎస్‌ సెక్యూరిటీస్‌, ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు లేఖ అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని