Credit Card Upgrade: క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Credit card Upgrade: క్రెడిట్‌ కార్డును అప్‌గ్రేడ్‌ చేసుకునే ముందు ఈ విషయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

Published : 07 Apr 2023 12:02 IST

Credit Card Upgrade | ఇంటర్నెట్‌డెస్క్‌: తొలిసారి క్రెడిట్‌ కార్డు (Credit Card) తీసుకున్నప్పుడు బ్యాంకులు ‘ప్రవేశ స్థాయి ప్రయోజనాలు’ ఉన్న కార్డుని అందజేస్తాయి. ఇవి మీ క్రెడిట్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి అనువుగా ఉంటాయి. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ప్రయాణ రాయితీలు, లాంజ్‌ అనుమతి.. వంటి ఆకర్షణీయ ప్రయోజనాలను అందజేయవు. సమయం గడిచే కొద్దీ మీ ఆదాయం పెరుగుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. అప్పుడు మీ ఖర్చుకి అనుగుణంగా ప్రత్యేక ప్రయోజాలను అందించే క్రెడిట్‌ కార్డుకి అప్‌గ్రేడ్‌ (Credit Card Upgrade) అయ్యేందుకు జారీ సంస్థలు అవకాశం కల్పిస్తాయి.

అయితే, కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి ముందు ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకోండి..

మీ ఖర్చుల తీరుకు సరిపోయేలా..

మనం చేసే ఖర్చులు వివిధ కేటగిరీల్లోకి వస్తాయి. ఉదాహరణకు ప్రయాణాలు, ఇంధనం, నిత్యావసరాలు, షాపింగ్‌. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు (Credit Card) జారీ సంస్థలు ఏదో కేటగిరీలో ప్రత్యేక ప్రయోజనాల్ని కల్పించేలా ఆఫర్లను అందిస్తుంటాయి. మిగిలిన ప్రయోజనాలు అన్నింటిలో సాధారణంగా ఉంటాయి. ఉదాహరణకు మనం తరచూ ప్రయాణం చేయాల్సి ఉంటే.. ట్రావెల్‌ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. వీటి వల్ల విమాన టికెట్లపై రాయితీ లభిస్తుంది. విమానాశ్రయాల్లో లాంజ్‌కి ఉచిత అనుమతి లభిస్తుంది. అలాగే ఇంధన కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుపై రాయితీ లభిస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఖర్చులు ఏ కేటగిరీలో అధికంగా ఉంటాయో గమనించి.. దానికి తగ్గట్టుగా కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకోండి.

రివార్డు పాయింట్ల వివరాలను తెలుసుకోండి..

మీకు ఏ రకమైన కార్డు కావాలో తెలుసుకున్న తర్వాత వివిధ సంస్థలు ఇచ్చే ఆఫర్లను అర్థం చేసుకోండి. వాటి నుంచి అందే ప్రయోజనాలను పోల్చి చూడండి. ఒకవేళ మీరు షాపింగ్‌ కార్డుని ఎంచుకుంటే.. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, రాయితీ ఇలా ఏ రూపంలో ఎంతమేర ప్రయోజనం లభిస్తుందో చూసుకోండి. కొన్ని కార్డులు ప్రత్యేకమైన బ్రాండ్లపై మాత్రమే ఆఫర్లను అందజేస్తుంటాయి. మరికొన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌కి మాత్రమే ప్రయోజనాల్ని వర్తింపజేస్తుంటాయి. వీటిలో మీకు ఏది సరిపోతుందో చూసుకోవాలి. కొన్ని కార్డులు ప్రయోజనాలపై గరిష్ఠ పరిమితి విధిస్తుంటాయి. మీ ఖర్చుకు.. వచ్చే రాయితీకి పొంతన ఉందో లేదో సరిచూసుకోవాలి. రూ.లక్ష ఖర్చుపై రూ.100 ప్రయోజనం లభిస్తే ఉపయోగం ఉండదు.

వార్షిక రుసుము ఎంత?

మంచి ప్రయోజనాలు ఉన్నాయంటే.. వార్షిక రుసుము కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు చెల్లించే రుసుముకి.. వచ్చే ప్రయోజనాలకి పొంతన ఉందో.. లేదో.. చూసుకోవాలి. మరికొన్ని సంస్థలు నిర్దిష్ట వ్యయ పరిమితిని నిర్దేశిస్తాయి. అది దాటితే వార్షిక రుసుముని రద్దు చేస్తాయి. అందుకే మీ ఖర్చు ఆ స్థాయిలో ఉందో.. లేదో.. చూసుకోండి. అందుకు తగ్గట్టుగానే రుసుము ఉండాలి. వ్యయ పరిమితి చేరుకోలేని స్థాయిలో ఉంటే.. అధిక రుసుము చెల్లించి ప్రయోజనం ఉండదు.

క్రెడిట్‌ పరిమితి పెరగాలి..

కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకున్నప్పుడు సహజంగానే క్రెడిట్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. అంటే క్రెడిట్‌ కార్డు (Credit Card)పై మీకు లభించే మొత్తాన్ని జారీ సంస్థలు పెంచుతాయి. అత్యవసర సమయాల్లో క్రెడిట్‌ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో.. ఫలితంగా క్రెడిట్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. అయితే, క్రెడిట్‌ లిమిట్‌ అనేది మీ ఆదాయం, మీరు అప్‌గ్రేడ్‌ చేసుకోబోయే కార్డుపై కూడా ఆధారపడి ఉంటుంది.

రివార్డు పాయింట్ల బదిలీ..

ముఖ్యంగా కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకునే ముందు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కార్డుపై ఉన్న ప్రయోజనాల్ని మరోసారి క్షుణ్నంగా పరిశీలించుకోండి. కొత్త కార్డు (Credit Card) వల్ల అధిక ప్రయోజనాలు ఉంటేనే దానికి వెళ్లాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న కార్డు వల్ల మీరు అత్యధికంగా పొందుతున్న లబ్ధిని కొత్త కార్డు ద్వారా కోల్పోకుండా చూసుకోవాలి. అలాగే ఈ కార్డులో ఉన్న రివార్డు పాయింట్లు కొత్త కార్డుకి బదిలీ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే.. వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని