E-commerce: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అటవీ ఉత్పత్తులు: ధర్మేంద్ర ప్రధాన్‌

గిరిజనుల సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

Published : 21 Dec 2022 18:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆదివాసీలు తయారు చేసే అటవీ ఉత్పత్తుల విక్రయాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది.  ఆయా వస్తువులను అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వంటి ఇ-కామర్స్‌ వేదికలపై అందుబాటులో ఉంచేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆయా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఫలితంగా అటవీ ఉత్పత్తులకు విక్రయాలు పెరిగి గిరిజనులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై మీడియాతో మాట్లాడుతూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మాతృభాషకు పెద్దపీట వేసిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల గిరిజనులకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. గిరిజన సంక్షేమ పథకాలకు కేంద్ర నిధుల కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. 2014- 15లో రూ.19,437 కోట్లు కేటాయిస్తే.. 2022- 23 నాటికి వాటిని రూ.91,000 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఏకలవ్య విద్యాలయ పథకం ద్వారా వారి విద్యావ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ముఖ్యంగా 55,000 స్వయం సహాయక సంఘాల ద్వారా 10 లక్షల మంది లబ్ధిదారులను ‘వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాల’తో అనుసంధానించామన్నారు. ఫలితంగా గిరిజనులు తమ ఉత్పత్తులకు అధిక విలువ జోడించేందుకు మార్గం సుగమమైందన్నారు.

ఇ-కామర్స్‌తో చేతులు కలపడం ద్వారా అటవీ ఉత్పత్తులకు బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌ వంటి వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. వీటన్నింటితో పాటు ‘నేషనల్‌ ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ను ఏర్పాటు చేశామన్నారు. 50 శాతం కంటే అధిక గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో కనీస మౌలిక వసతులను మెరుగుపర్చామన్నారు. 2023ను ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడం వల్ల గిరిజనులకూ ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని