పెట్రో రసాయనాలు, గ్యాస్‌ వ్యాపారంలో బీపీసీఎల్‌ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు

వచ్చే అయిదేళ్లలో పెట్రో రసాయనాలు, సిటీ గ్యాస్‌, స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ సంస్థ బీపీసీఎల్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలన్నీ స్వచ్ఛమైన, కర్బన రహిత ఇంధనం కోసం చూస్తున్నందున, చమురు సంస్థలు కూడా తమ

Published : 16 Aug 2022 03:18 IST

దిల్లీ: వచ్చే అయిదేళ్లలో పెట్రో రసాయనాలు, సిటీ గ్యాస్‌, స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ సంస్థ బీపీసీఎల్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలన్నీ స్వచ్ఛమైన, కర్బన రహిత ఇంధనం కోసం చూస్తున్నందున, చమురు సంస్థలు కూడా తమ ప్రధాన హైడ్రోకార్బన్‌ కార్యకలాపాల నుంచి స్వచ్ఛ ఇంధనం వైపు అడుగులు వేయబోతున్నట్లు బీపీసీఎల్‌ ఛైర్మన్‌, ఎండీ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వ్యాపారంలో విస్తరించి, అదనపు ఆదాయం ఆర్జించడం ద్వారా భవిష్యత్‌లో ద్రవరూప శిలాజ ఇంధన వ్యాపారంలో క్షీణతను సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నట్లు వివరించారు.

* దేశంలో మొత్తం 83,685 పెట్రోల్‌ బంకులు ఉండగా, అందులో బీపీసీఎల్‌ వి 20,217. వీటిల్లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలతో పాటు భవిష్యత్‌లో ఈవీ ఛార్జింగ్‌, హైడ్రోజన్‌ ఇంధన విక్రయాలు కొనసాగించాలనుకుంటోంది. బీపీసీఎల్‌కు ముంబయి, మధ్యప్రదేశ్‌, కేరళలలో రిఫైనరీలు ఉన్నాయి. ఇక్కడ 251.2 మిలియన్‌ టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. దేశీయంగా శుద్ధి చేస్తున్న చమురులో ఇది 14 శాతం ఉంటుంది.

* భవిష్యత్‌లో సంస్థ వృద్ధికి, స్థిరత్వానికి 6 వ్యూహాత్మక విభాగాలను గుర్తించామని అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో పెట్రోరసాయనాలు, గ్యాస్‌, రెన్యూవబుల్స్‌, కన్జూమర్‌ రిటైలింగ్‌, ఇ-మొబిలిటీ, అప్‌స్ట్రీమ్‌ విభాగాలున్నాయని పేర్కొన్నారు. ప్రధాన వ్యాపారమైన రిఫైనింగ్‌ (శుద్ధి), పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్‌ కూడా కొనసాగుతుందన్నారు. వ్యూహాత్మక విభాగాల్లో వచ్చే 5 ఏళ్లలో రూ.1.4 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

* 2040 నాటికి నికర శూన్య కర్బన ఉద్గార స్థితికి చేరాలని బీపీసీఎల్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2025 నాటికి 1 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, 2040 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకోవాలనుకుంటోంది. పెట్రోల్‌లో 10 శాతానికి పైగా ఇథనాల్‌ను కలుపుతున్నట్లు సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని