చమురు ఉత్పత్తిలో భారీ కోత: ఒపెక్‌

చమురు ఎగుమతి దేశాలు, అనుబంధ దేశాల సమాఖ్య అయిన ఒపెక్‌+.. చమురు ఉత్పత్తిలో నవంబరు నుంచి భారీ కోత విధించాలని నిర్ణయించాయి. దీంతో చమురు ధరలు పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 07 Oct 2022 02:09 IST

ఫ్రాంక్‌ఫర్ట్‌: చమురు ఎగుమతి దేశాలు, అనుబంధ దేశాల సమాఖ్య అయిన ఒపెక్‌+.. చమురు ఉత్పత్తిలో నవంబరు నుంచి భారీ కోత విధించాలని నిర్ణయించాయి. దీంతో చమురు ధరలు పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబరు నుంచి రోజుకు 2 మిలియన్‌ బారెళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత విధిస్తామని ఒపెక్‌ దేశాలు ప్రకటించాయి. కరోనా అనంతరం ప్రత్యక్షంగా జరిగిన సభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే అంచనాలతో, చమురుకు గిరాకీ తగ్గుతుందనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్న’ట్లు ఒపెక్‌+ పేర్కొంది. ప్రస్తుతం ముడిచమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముందు స్థాయికి దిగివచ్చిన నేపథ్యంలో, చమురు ధరల్లో రికవరీ కోసం ఈ అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

అమెరికాలో ప్రభావం ఇలా

అమెరికా కాంగ్రెషనల్‌ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సమయంలో రాజకీయంగా ఈ పరిణామం ప్రభావం చూపొచ్చు. అంతర్జాతీయ సరఫరా పెంచడానికి వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును అమెరికా బయటకు తీయదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జూన్‌ గరిష్ఠమైన 5.02 డాలర్ల నుంచి గ్యాసోలిన్‌ ధరలు తగ్గుతూ వచ్చిన వైనాన్ని అమెరికా అధ్యక్షుడు తన విజయంగా చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇపుడు అమెరికా గ్యాస్‌ పంపుల్లో ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మనపై ప్రభావం ఇలా..

మన దేశంలో దాదాపు ఆరు నెలలుగా పెట్రోలు, డీజిల్‌ ధరల సవరణ జరగడం లేదు. బుధవారం ఒపెక్‌+ ప్రకటన అనంతరం ముడిచమురు ధరలు పెరిగాయి. ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉంది. ఒపెక్‌+ నిర్ణయానికి ముందు దేశీయంగా చమురు మార్కెటింగ్‌ సంస్థలకు లీటర్‌ డీజిల్‌పై నష్టం రూ.30 నుంచి రూ.5కు తగ్గితే, పెట్రోలుపై కొంత మేర లాభాన్ని పొందాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు; రూపాయి బలహీనతలు కంపెనీల మార్జిన్లను దెబ్బతీయవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్‌ నుంచి వచ్చిన నష్టాలను పూడ్చుకోవచ్చన్న ఆశలతో ఉన్న చమురు కంపెనీలకు తాజా పరిణామం మింగుడుపడకపోవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు 4 నుంచి 137 రోజుల పాటు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ రిటైల్‌ ధరల సవరణను నిలిపివేశాయి. మార్చి 22 నుంచి మళ్లీ పెట్రో ఉత్పత్తుల సవరించినప్పటికీ.. ఏప్రిల్‌ 7 నుంచీ మాత్రం మార్చలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే సంస్థలు ఇలా చేస్తున్నాయి. మళ్లీ ముడిచమురు ధరలు పెరిగితే, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు-ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని