Airtel: విదేశీ పర్యాటకుల కోసం వరల్డ్‌ పాస్‌.. 184 దేశాలకు వర్తింపు

కొవిడ్‌-19 పరిణామాల తర్వాత అంతర్జాతీయ పర్యటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘ఎయిర్‌టెల్‌ వరల్డ్‌ పాస్‌’ ప్లానును ప్రారంభించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

Updated : 07 Dec 2022 08:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 పరిణామాల తర్వాత అంతర్జాతీయ పర్యటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘ఎయిర్‌టెల్‌ వరల్డ్‌ పాస్‌’ ప్లానును ప్రారంభించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఒకే ప్లాన్‌తో 184 దేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత ఛార్జీలతో పోలిస్తే, ఈ దేశాల్లో రోమింగ్‌ ఛార్జీలను దాదాపు 99 శాతం తగ్గించినట్లు పేర్కొంది. పోస్ట్‌-పెయిడ్‌ వినియోగదారులు తమ ప్రస్తుత అంతర్జాతీయ రోమింగ్‌ ప్లాన్ల నుంచి అదనపు చెల్లింపు లేకుండానే కొత్త ప్లాన్‌కు మారేందుకు వీలుంటుందని తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు ఈ వరల్డ్‌ పాస్‌ ప్లాన్‌ను ప్రారంభించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ ( కన్జూమర్‌ బిజినెస్‌) శాశ్వత్‌ శర్మ తెలిపారు. ప్యాక్‌ ముగిసిన తర్వాతా అత్యవసర డేటాను వినియోగించుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఒక రోజు నుంచి 365 రోజుల వ్యవధి ఉండే కొత్త పోస్ట్‌పెయిడ్‌ రోమింగ్‌ ప్లాన్‌ల ధరలు రూ.649 నుంచి రూ.14,999 వరకు ఉన్నట్లు తెలిపారు. ప్రీ-పెయిడ్‌ ప్లాన్లు రూ.649 నుంచి రూ.2,997 మధ్య ఉంటాయని తెలిపారు. ఇప్పటికే పాత ప్లాన్‌ కొనసాగిస్తున్న వారు వ్యవధి తీరిన తర్వాత కొత్త ప్లాన్‌లోకి మారాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

* అమెరికా, బ్రిటన్‌, నేపాల్‌, చైనా, రష్యా, యూఏఈ, సౌదీ అరేబియా వంటి 119 దేశాల్లో డేటా వినియోగానికి ఎంబీకి రూ.1.5 / 1జీబీకి రూ.1536 అవుతుంది.

* దక్షిణాఫ్రికా, మారిషస్‌, మాల్దీవులు, మాలి, ఈజిప్ట్‌ వంటి 65 దేశాల్లో ఎంబీ డేటాకు రూ.3 / 1జీబీకి రూ.3072 అవుతుంది.

* ఇంటర్‌నెట్‌ ప్యాక్‌లు  లేకపోతే 1జీబీకి రూ.6.81 లక్షలు అవుతుందని సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు