కొనసాగుతున్న ఉద్యోగ కోతలు

కొత్త సంవత్సరంలోనూ టెక్‌ దిగ్గజాలు ఉద్యోగ కోతల్ని కొనసాగిస్తున్నాయి. మాంద్యం భయాలతో మైక్రోసాఫ్ట్‌ నుంచి అమెజాన్‌ వరకు పలు కంపెనీలు లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి.

Updated : 19 Jan 2023 13:45 IST

మైక్రోసాఫ్ట్‌లో 10,000 మందిః అమెజాన్‌లో 18,000 ఉద్యోగులు ఇంటికి
షేర్‌చాట్‌లో 20%, సేల్స్‌ఫోర్స్‌లో 10% బయటకు
అంతర్జాతీయ మాంద్యం భయాలతోనే

కొత్త సంవత్సరంలోనూ టెక్‌ దిగ్గజాలు ఉద్యోగ కోతల్ని కొనసాగిస్తున్నాయి. మాంద్యం భయాలతో మైక్రోసాఫ్ట్‌ నుంచి అమెజాన్‌ వరకు పలు కంపెనీలు లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌లో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈఓ సత్య నాదెళ్ల బుధవారం ప్రకటించారు. ఇది చాలా క్లిష్టమైన నిర్ణయమేనని.. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ‘కొవిడ్‌ సమయంలో పెంచిన డిజిటల్‌ వ్యయాలను ఇపుడు స్థిరీకరిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నాం. మన మొత్తం సిబ్బందిలో 10,000 మందిని 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి కల్లా తొలగిస్తాం. ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం. ఉద్వాసనకు గురైన ప్రతి వ్యక్తికి ఇది సవాలుభరిత సమయమని మాకు తెలుసు’అని ఆయన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది జూన్‌ 30 నాటికి ఈ కంపెనీలో 2,21,000 మంది పనిచేస్తున్నారు.

* కీలక విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని ఉద్యోగాల కోత ప్రకటన అనంతరం నాదెళ్ల పేర్కొన్నారు.

అమెజాన్‌.. 18,000: మాంద్యం రావొచ్చన్న ఆందోళనలకు తోడు విక్రయాల్లో వృద్ధి తగ్గినందున, తాజా ఉద్యోగ కోతలకు అమెజాన్‌ సిద్ధమవుతోంది. 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ నెల మొదట్లోనే ఈ కంపెనీ ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 1%; కార్పొరేట్‌ ఉద్యోగుల్లో 6 శాతానికి ఇది సమానం. ‘ఈ మార్పుల వల్ల వ్యయాలు తగ్గి, దీర్ఘకాల అవకాశాలు అందుకోవడానికి వీలవుతుంద’ని కంపెనీ సీఈఓ యాండీ జెస్సీ పేర్కొన్నారు. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ మాతృసంస్థ మెటా నవంబరులో 11,000 మంది ని(మొత్తం సిబ్బందిలో 13%) తొలగిస్తున్నట్లు నవంబరులోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

6 రోజులు.. 30,611 ఉద్వాసనలు: కొత్త సంవత్సరం తొలి 6 రోజుల్లో అమెజాన్‌, వీమియో, సేల్స్‌ఫోర్స్‌ వంటి కంపెనీలు 30,611 మంది ఉద్యోగులపై వేటు వేశాయని తెలుస్తోంది. షేర్‌చాట్‌ 20%, సేల్స్‌ ఫోర్స్‌ 10% మంది ఉద్యోగులను బయటకు పంపనున్నట్లు పేర్కొన్నాయి.


ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు

* మైక్రోసాఫ్ట్‌ * అమెజాన్‌ వీమియో * షేర్‌చాట్‌ * స్నాప్‌చాట్‌ * సిస్కో సిస్టమ్స్‌ ఇంక్‌ * మెటా * క్వాల్‌కామ్‌ * సేల్స్‌ఫోర్స్‌ * ట్విటర్‌ * హెచ్‌పీ * బైజూస్‌ అన్‌అకాడమీ * గోల్డ్‌మాన్‌ శాక్స్‌ గ్రూప్‌ ఇంక్‌ * మోర్గాన్‌ స్టాన్లీ * ఇంటెల్‌  * జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని