హైదరాబాద్‌ నుంచి గోవా, బెంగళూరుకు ఆకాశ విమానాలు

దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, గోవాలకు రోజువారీ విమాన సేవలను బుధవారం (ఈనెల 25) ప్రారంభిస్తోంది.

Published : 25 Jan 2023 02:52 IST

నేటి నుంచే

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, గోవాలకు రోజువారీ విమాన సేవలను బుధవారం (ఈనెల 25) ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి బెంగళూరుకు అదనంగా మరో 2 సర్వీసులు నిర్వహిస్తామని ఆకాశ ఎయిర్‌ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ అయ్యర్‌ మంగళవారం ఇక్కడ తెలిపారు. మరో సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ బెల్సన్‌ కౌటినోతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఆకాశ ఎయిర్‌ వద్ద మొత్తం 14 విమానాలు ఉన్నాయని, ప్రతి 15 రోజులకో కొత్త విమానం జత అవుతోందన్నారు.  ప్రస్తుతం 1,500 మంది ఉద్యోగులు ఉండగా, నెలకు 175 మందిని చేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. 21 మార్గాల్లో వారానికి 575 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని, విమానాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై దృష్టి పెడతామన్నారు. విదేశాలకూ విమాన సేవలను ప్రారంభించే ఆలోచన ఉందన్నారు.

2028నాటికి ప్రయాణికులు 40 కోట్లకు: ప్రస్తుతం దేశంలో ఏడాదికి 20 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. 2028 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ప్రవీణ్‌ అయ్యర్‌ అన్నారు. దేశంలో మొత్తం 700 విమానాలున్నాయని, పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా 1,000 విమానాలు కావాలని పేర్కొన్నారు. కరోనాకు ముందు రోజూ 3130 విమాన సర్వీసులు నడిస్తే, ఇప్పుడు 2800 వరకూ ఉన్నాయన్నారు. వేసవికి సర్వీసుల సంఖ్య 3,000కు చేరుకుంటుందనే అంచనాలున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని