ఎన్‌టీపీసీ లాభం రూ.4,854 కోట్లు

ప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టీపీసీ డిసెంబరు త్రైమాసికంలో రూ.4,854.36 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 29 Jan 2023 02:01 IST

మధ్యంతర డివిడెండు రూ.4.25

దిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టీపీసీ డిసెంబరు త్రైమాసికంలో రూ.4,854.36 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.4,626.11 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.33,783.62 కోట్ల నుంచి రూ.44,989.21 కోట్లకు పెరిగింది.

* రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 42.5 శాతం (రూ.4.25) చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.

* 2022 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కంపెనీ సరాసరి విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ.4.96 లభించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది రూ.3.95 మాత్రమే.

* బొగ్గు ఆధారిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌ లేదా సామర్థ్య వినియోగం) 67.72 శాతం నుంచి 68.85 శాతానికి చేరింది.

* దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.52 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నుంచి 1.57 మి.మె.టన్నులకు చేరింది.

* దేశీయ బొగ్గు సరఫరా 54.96 మి.మె.టన్నుల నుంచి 52.45 మి.మె.టన్నులకు తగ్గింది. క్యాప్టివ్‌ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 4 మి.మె.టన్నుల నుంచి 5.35 మి.మె.టన్నులకు చేరింది.

* సంయుక్త సంస్థలు (జేవీలు), అనుబంధ సంస్థలతో కలిపి ఎన్‌టీపీసీ గ్రూప్‌ మొత్తం ఇన్‌స్టాల్డ్‌ సామర్థ్యం 2022 డిసెంబరు 31 నాటికి 70,884 మెగావాట్లకు చేరింది.

* స్థూల విద్యుత్‌ ఉత్పత్తి 75.67 బిలియన్‌ యూనిట్ల (బీయూ) నుంచి 78.64 బి.యూనిట్లకు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు