ChatGPT: చాట్‌జీపీటీ ఎలా వాడాలి?

సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ చాట్‌జీపీటీ అనేక ఐటీ దిగ్గజ సంస్థలకు సవాలు విసురుతోంది.

Updated : 18 Feb 2023 09:35 IST

ఉద్యోగులకు ఐటీ సంస్థల శిక్షణ
కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ చాట్‌జీపీటీ అనేక ఐటీ దిగ్గజ సంస్థలకు సవాలు విసురుతోంది. దీంతో సరికొత్త సాంకేతికతలను రూపొందించే దిశగా ప్రయత్నాలు చేయడంతోపాటు, చాట్‌జీపీటీని తమ సంస్థ అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చు అనే విషయాలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయని సమాచారం.

నాలుగైదేళ్లుగా కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌, బిగ్‌ డేటా, బ్లాక్‌చైన్‌ సాంకేతికతలు ఐటీ పరిశ్రమను శాసిస్తున్నాయి. ఈ సాంకేతికతలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఈ నైపుణ్యాలున్న కొత్త వారికి నియామకాల్లో కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి.  ఐటీ పరిశ్రమను ఈ నిపుణుల కొరత ఇప్పటికీ వేధిస్తోంది. ఈ తరుణంలో ప్రాథమిక దశలోనే ఉన్న ఈ కొత్త చాట్‌జీపీటీ మరో సవాలు తీసుకొచ్చింది.

ధరల విషయంలో పోటీ

ఇప్పటికే యాక్సెంచర్‌, డెలాయిట్‌ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు చాట్‌జీపీటీ, కొత్తతరం ఏఐపై శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్ల వినియోగం, అవసరమైన చోట వాటిని వాడటం లాంటి అంశాలపై దృష్టి సారించాయి. జేపీ మోర్గాన్‌ నివేదిక ప్రకారం ‘ఈ సంస్థలు కొత్తతరం ఏఐని అధికంగా తీసుకొస్తున్నాయి. దీంతో భారతీయ కంపెనీలకు ప్రధానంగా ప్రాజెక్ట్‌ ధరల విషయంలో పోటీ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఆదాయాలపై ప్రభావం ఉంటుంద’ని తెలిపింది.

దేశీయ సంస్థల సన్నాహాలు

పోటీని తట్టుకునేందుకు వీలుగా తమ ఉద్యోగులకూ ఈ సాంకేతికతను నేర్పించేందుకు ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రయత్నాలు మొదలుపెట్టాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాట్‌జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఓపెన్‌ ఏఐకి ఇన్ఫోసిస్‌ ఇప్పటికే కొన్ని నిధులను సమకూర్చింది. దీంతోపాటు ఏఐ మీద ఉద్యోగులకు వర్క్‌షాప్‌నూ ఏర్పాటు చేసింది. చాట్‌జీపీటీని వాడటంలో ఉద్యోగులకు పోటీలనూ ఏర్పాటు చేస్తున్నట్లు ఒక వార్తా సంస్థ తెలియజేసింది.

* ఒక నిర్దిష్ట ప్రశ్నను సందర్భోచితంగా పరిష్కరించేందుకు అనేక మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాట్‌జీపీటీ సరిపోతుందని టీసీఎస్‌ పేర్కొంటోంది. యాక్సెంచర్‌ ప్రత్యేకంగా ‘అడ్వాన్స్‌డ్‌ ఎన్‌ఎల్‌పీ: ఇంట్రడక్షన్‌ టు జీపీటీ’ అనే డిజిటల్‌ కోర్సునూ తన ఉద్యోగుల కోసం ప్రారంభించింది.

ఏ ఉద్యోగాలపై ప్రభావం?

చాట్‌జీపీటీతో ఐటీ రంగంలో ఏ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ అనేక ఉద్యోగాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పాటునందిస్తుందనే అంచనాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థలు తమ ఉద్యోగులను భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముందునుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా అవసరమైనప్పుడు వారు సిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని