జీఎస్‌టీ ఎగవేతదార్లపై దృష్టి

వ్యాపారాలు, వృత్తి నిపుణులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌ల)ను నిశితంగా పరిశీలించడం ద్వారా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేతదార్లను గుర్తించాలని జీఎస్‌టీ విభాగం సమాయత్తమవుతోంది.

Published : 20 Mar 2023 01:34 IST

ఐటీ, ఎంసీఏ గణాంకాల పరిశీలన

దిల్లీ: వ్యాపారాలు, వృత్తి నిపుణులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌ల)ను నిశితంగా పరిశీలించడం ద్వారా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేతదార్లను గుర్తించాలని జీఎస్‌టీ విభాగం సమాయత్తమవుతోంది. కార్పొరేట్‌ వ్యవహారాల (ఎంసీఏ) మంత్రిత్వ శాఖ వద్ద వ్యాపారాలు సమర్పించిన వివరాలను కూడా పరిగణలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వస్తు, సేవల పన్ను చెల్లింపుదార్లను పెంచడం కోసం, సరైన మొత్తంలో పన్ను వసూలు చేసేందుకు జీఎస్‌టీ విభాగం ఈ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 1.38 కోట్ల వ్యాపారాలు, వృత్తి నిపుణులు జీఎస్‌టీ కింద నమోదు చేసుకున్నారు. తయారీ వ్యాపారంలో వార్షిక టర్నోవర్‌ రూ.40 లక్షలు మించినా, సేవల విభాగంలో రూ.20 లక్షల టర్నోవర్‌ అధిగమించినా జీఎస్‌టీ కింద సంబంధిత వ్యాపారాలు, వృత్తి నిపుణులు నమోదు కావాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులను దాఖలు చేయడం తప్పనిసరి. ఐటీ విభాగం వద్ద ఉన్న సమాచారంతో జీఎస్‌టీ చెల్లించని వారిని తొలుత సున్నితంగా విచారిస్తామని జీఎస్‌టీ అధికారి వెల్లడించారు. డేటా విశ్లేషణ విభాగం.. వ్యాపారులు ఎంసీఏ వద్ద దాఖలు చేసిన త్రైమాసిక, వార్షిక గణాంకాలను విశ్లేషించి జీఎస్‌టీ ఎగవేతదార్లను గుర్తించేందుకు దోహదం చేస్తుందని సదరు అధికారి పేర్కొన్నారు.

* 2022-23లో ఫిబ్రవరి వరకు జీఎస్‌టీ ఎగవేత కేసులు 13,492

* 2021-22లో ఎగవేత కేసులు 12,574

* 2020-21లో ఎగవేత కేసులు 12,596

* జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన 2017 జులై నుంచి 2023 ఫిబ్రవరి వరకు మొత్తం వస్తు సేవల పన్ను ఎగవేత రూ.3.08 లక్షల కోట్లు కాగా, ఇందులో రూ.1.03 లక్షల కోట్లకు పైగా జీఎస్‌టీ విభాగం రివకరీ చేయగలిగింది. 1,402 మందిని గత అయిదున్నరేళ్లలో అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని